08-11-గీతామకరందము
అక్షరపరబ్రహ్మయోగము
పూజ్యశ్రీశ్రీశ్రీ విద్యాప్రకాశానందగిరి స్వాములవారు,
శ్రీశుకబ్రహ్మాశ్రమము, శ్రీకాళహస్తి.
యదక్షరం వేదవిదో వదన్తి
విశన్తి యద్యతయో వీతరాగాః యదిచ్ఛన్తో బ్రహ్మచర్యం చరన్తి
తత్తే పదం సంగ్రహేణ ప్రవక్ష్యే
టీక:-- వేదవిదః = వేదార్థము నెఱిగినవారు, యత్ = దేనిని, అక్షరమ్ = నాశములేని దానినిగా, వదన్తి = చెప్పుచున్నారో, వీతరాగాః = రాగరహితులగు (పోయినకోరికలుగల, లేక కామక్రోధాదులను జయించిన), యతయః = యత్నశీలురు (జితేంద్రియులు), యత్ = దేనిని, విశన్తి = ప్రవేశించుచున్నారో, యత్ = దేనిని, ఇచ్ఛంతః = కోరుచున్నవారై, బ్రహ్మచర్యమ్ = బ్రహ్మచర్యమును, చరన్తి = అనుష్ఠించుచున్నారో, తత్ పదమ్ = ఆ స్థానమును, తే = నీకు, సంగ్రహేణ = సంక్షేపముగ, ప్రవక్ష్యే = చెప్పెదను.
తా:- వేదవేత్తలు దేనిని నాశరహితమైనదానినిగ జెప్పుచున్నారో, రాగరహితులగు (కోరికలు నశించిన) యత్నశీలురు (జితేంద్రియులు) ఎద్దానియందు ప్రవేశించుచున్నారో, దేనిని అభిలషించుచు జనులు బ్రహ్మచర్యము ననుష్టించుచున్నారో అట్టి (పరమాత్మ) పదమునుగూర్చి నీకు సంక్షేపముగ జెప్పెదను.
వ్యాఖ్య:- పరమాత్మపదమును (మోక్షస్థానమును) గూర్చి సంగ్రహముగ జెప్పెదనని శ్రీకృష్ణమూర్తి వచించిరి. అది యుద్ధసమయము గనుక విశేషించి చెప్పటకు అవకాశము లేదు కావునను, బ్రహ్మపదమును ఎంతవర్ణించినను అంతము యుండదు గనుకను, సంక్షేపముగ చెప్పెదనని భగవాను డానతిచ్చిరి. ముముక్షువుల కియ్యది అతిముఖ్యమైన బోధగా నుండగలదు. ఏలయనిన, వేదములయొక్క సారమంతయు పిండి సంగ్రహరూపముగ సాక్షాత్ భగవాను డిచట పేర్కొనుచున్నారు. ప్రణవోపాసన బోధింపబోవుచున్నారు. ఆ పరబ్రహ్మపద మెట్టిదనిన -
(1) వేదవేత్తలు దానిని నాశరహితమైనదానినిగ (అక్షరముగ) పేర్కొనుచున్నారు. ప్రపంచములోని సమస్తపదార్థములు నాశవంతములు, క్షణికములు, క్షరములు. బ్రహ్మము (ఆత్మ) ఒకటియే నాశము లేనిది, అక్షరమైనది, త్రికాలాబాధ్యమైనది, ప్రతివారును వారివారిజీవితములో ముఖ్యముగ తెలిసికొనదగినది ఈ పరబ్రహ్మమే అయియున్నది. తక్కినవి ఎన్నితెలిసికొనినను శాశ్వతసుఖము నవి ప్రసాదింపజాలవు. కనుకనే బాల్యకాలమున పిల్లలకు అక్షరాభ్యాసమని ఒక నియమమేర్పడినది. అక్షరమగు పరమాత్మను బోధించుటయే నిజమగు అక్షరాభ్యాసము. అక్షరములను నేర్పునపుడు పరబ్రహ్మవాచకమగు "ఓం" కారమును మొట్టమొదట వ్రాయించుట కిదియే కారణము. కావున ఇతరవిద్యలనెన్నిటిని గ్రహించినను పరావిద్యయగు ఈ అక్షర(బ్రహ్మ)విద్యను మాత్రము త్యజించరాదు. మరియు వేదముల నెరుగుటయనగా వేదార్థమును అనుభూతమొనర్చుకొనుట, ఆచరణయందుంచుట. "వాచా"జ్ఞానము మాత్రము కలిగియుండుటకాదు. కనుకనే వేదవేత్తలు పరమాత్మను చక్కగ అనుభూతమొనర్చుకొని, సాక్షాత్కరించుకొని ఆతనిని అక్షరునిగ కనుగొనగల్గిరి (అక్షరం వేదవిదో వదన్తి).
(2) అట్టి పరమాత్మ పదమునం దెవరు ప్రవేశింపగలరు? అను ప్రశ్నకుకూడ యిట సమాధానము చెప్పబడినది. రాగద్వేషరహితులు, కామక్రోధాది దుర్వాసనావర్జితులు (వీతరాగులు) మాత్రమే మోక్షసౌధమున ప్రవేశింపగలరుగాని తదితరులు కాదు. మోక్షధామప్రవేశమునకీ రాగరాహిత్యమొక టిక్కెటువంటిది. టిక్కెటులేనివారిని, అనుమతిపత్రము పొందియుండనివారిని గొప్పగొప్ప రాజభవనములందు ఎట్లు పోనివ్వరో, అట్లే కామము నశింపనివారు, కోరికలు తొలగనివారు, రాగాదులు క్షయింపనివారు అక్షరబ్రహ్మపదమున, మోక్షసౌధమున ప్రవేశింపజాలరు, అవి నశించినవారే నిరాటంకముగ, నిర్భయముగ పోగలరు. కాబట్టి
"నాకింకను మోక్షముకలుగలేదే " యని యెవరును వెతలనొందక భగవానుడు తెలిపిన ఈ వీతరాగత్వ మభ్యసించిన చాలును.
"యతయః - (ప్రయత్నశీలురు) అని చెప్పటవలన దైవవిషయమున లెస్సగ యత్నించువారు, పెక్కుకష్టములకోర్చి తీవ్రమగు సాధనలను జరుపువారు, ఇంద్రియనిగ్రహపరులు మాత్రమే మోక్షమార్గమున సాఫల్యము నొందగలరేకాని తదితరములగు సోమరులు కాదని స్పష్టమగుచున్నది. యత్నరహితులగు సోమరు లెన్నటికిని అక్షరమగు మోక్షపదమును బడయజాలరు. ఒక చిన్న ప్రాపంచిక వస్తువును సంపాదించుటకే ఎంతయోయత్న మావశ్యకమైయుండ, అనేక జన్మలనుండి వచ్చుచున్న దుష్టవాసనలను, దుస్సంస్కారములను నశింపజేసి, పరబ్రహ్మమను మహోన్నతపదము నధిష్టించుటకు ప్రయత్న మవసరము కాదా?
(3) ఇక మూడవవిషయము బ్రహ్మచర్యము. 'ఏ పరమాత్మపదము నభిలషించుచు జనులు బ్రహ్మచర్యము ననుష్టించుచున్నారో!" అని యిచట చెప్పబడినందున దైవప్రాప్తికి, మోక్షమునకు బ్రహ్మచర్య మత్యావశ్యకమని తేలుచున్నది. మోక్షమునకై యత్నించువారికీ బ్రహ్మచర్య మెంతయో సహాయపడగలదని ఈ భగవద్వాక్యములవలన స్పష్టమగుచున్నది. అధ్యాత్మక్షేత్రమున బ్రహ్మచర్యమున కెంతటి ప్రాముఖ్యతను భగవాను డొసంగిరో ఇచట విశదమగుచున్నది. కాయికముగా, వాచికముగా, మానసికముగా విషయసంపర్కము లేకుండుటయు, బ్రహ్మమందు చిత్తమును లగ్నముచేయుటయు బ్రహ్మచర్య మనబడును.
"ప్రవక్ష్యే - (లెస్సగచెప్పెదను) - "వక్ష్యే అనకుండ 'ప్రవక్ష్యే ' అనుట వలన భగవానుడు చెప్పుబోవు బ్రహ్మోపాసన విషయము ఎంతముఖ్యమైనదో, దాని యెడల ముముక్షువులు ఎంతటి విశ్వాసము కలిగియుండవలెనో తేటతెల్లమగుచున్నది. ఈ శ్లోకమును బోలిన శ్లోకము కఠోపనిషత్తునందును గలదు.