ఎనభై తొమ్మిదవసర్గ.(89) సనాతన ధర్మం
లక్ష్మణుడు ఇంద్రజిత్తు ఒకరితో ఒకరు ఘోరంగా యుద్ధము
చేస్తుంటే. పక్కనే ఉన్న విభీషణుడు తన వంతు సహకారాన్ని
అందించాడు. తాను కూడా ధనుస్సు చేత పట్టి రాక్షసులను
సంహరిస్తున్నాడు. రాక్షసుల ఆనుపానులు తెలిసిన విభీషణుడి
బాణముల ధాటికి రాక్షసులు కుప్పలుకుప్పలుగా చచ్చిపడుతున్నారు.విభీషణుడు రాక్షసులను చంపుతుంటే, విభీషణుని నలుగురు మంత్రులు కూడా కత్తులు చేత బట్టి రాక్షసులను నరుకుతున్నారు. విభీషణుడు కూడా వాళ్లను ప్రోత్సహిస్తూ ఇలా అంటున్నాడు.“ఓ వానరవీరులారా! రావణునికి వీడొక్కడే గతి. వీడు చస్తే రావణుని పక్షాన యుద్ధం చేసే వాళ్లు ఎవరూ లేరు. రాక్షస వీరులైన ప్రహస్తుడూ, నికుంభుడూ, కుంభకర్ణుడూ, కుంభుడూ, ధూమ్రాక్షుడు, జంబుమాలి, మహామాలి, అశనిప్రభుడూ సుప్తఘ్నుడూ, యజ్ఞకోపుడూ,వజ్రదంష్ట్రుడూ, సంహాది, వికటుడూ,
తపనుడూ, మందుడు, ప్రఘాసుడు, ప్రఘసుడూ, జంఘుడూ, ప్రజంఘుడూ, అగ్నికేతువూ,రశ్మికేతువూ, విద్యుజ్జిహ్వుడు, ద్విజిహ్వుడు, సూర్యశత్రువు, అకంపనుడు,సుపార్శ్వుడు, చక్రమాలి, కంపనుడు, దేవాంతకుడు, నరాంతకుడు అందరూ మన చేతిలో చంపబడ్డారు. ఇంక లంకలో మనతో యుద్ధం చేయగల వీరులు ఎవరూ లేదు. ముందుకు దూకండి ఇంద్రజిత్తును చంపండి. రాక్షసులను తునుమాడండి. రాక్షసులతో చేసిన యుద్ధములో యోధానుయోధులను చంపాము. నూరుయోజనముల
సముద్రమును దాటిన మీకు ఈ ఇంద్రజిత్తు, ఆవు పాదము(గోష్పాదము)తో ఏర్పడిన చిన్న గుంటలాంటి వాడు. . వీడిని చంపడం
మనకు లెక్కలోనిది కాదు.నేనే ఇతనిని చంపగలను. కాని నాకు ఇతడు కుమారుడు.నేను వీడికి తండ్రిని. వీడి మీదున్న పుత్రవాత్సల్యము నన్ను అడ్డుకుంటూ ఉంది. వీడిని చంపాలని అనుకున్నప్పుడల్లా నా కళ్లలో నీళ్లు సుళ్లు తిరుగుతున్నాయి. కాబట్టి లక్ష్మణుడే వీడిని చంపగలడు. ముందు మీరందరూ ఇంద్రజిత్తు చుట్టుమోహరించి ఉన్న రాక్షసులను చంపండి.తరువాత లక్ష్మణుడు ఇంద్రజిత్తును చంపగలడు" అని వానర వీరులను ప్రేరేపించాడు విభీషణుడు. విభీషణుని మాటలతో వానరులలో ఉత్సాహం పెల్లుబికింది. సింహనాదాలు చేస్తున్నారు. వానరులు, భల్లూకములు ఒక్కసారిగా రాక్షస సేనల మీద పడ్డారు. వారిని రక్కారు, పీకారు. కొరికారు. రాళ్లతో కొట్టారు. జాంబవంతుడు కూడా యధాశక్తి రాక్షసులను చంపుతున్నాడు. రాక్షసు లందరూ జాంబవంతుని చుట్టు ముట్టారు. తమ చేతులలో ఉన్న పట్టిసములతోనూ, గండ్రగొడ్డళ్లతోనూ, కత్తులతోనూ దారుణంగా కొట్టారు. జాంబవంతుడుకూడా వారికి తగురీతిలో సమాధానం చెప్పాడు. వానరులకు రాక్షసులకూ యుద్ధం తీవ్రస్థాయిలో జరుగుతూ ఉంది.
అప్పటిదాకా లక్ష్మణుని తన వీపు మీద మోస్తున్న హనుమంతుడు, లక్ష్మణుని కిందికి దింపి, ఒక పెద్ద బండరాయిని చేతిలోకి తీసుకున్నాడు. ఆ బండరాతితో మోదుతూ హనుమంతుడు రాక్షసులను చంపుతున్నాడు. విభీషణుడితో యుద్ధం చేస్తున్న
ఇంద్రజిత్తు, ఆయనను వదిలి లక్ష్మణుని మీదికి వెళ్లాడు. లక్ష్మణుడికి ఇంద్రజిత్తుకు సమరం సంకులంగా మారింది. ఒకరి మీద ఒకరు బాణవర్షము కురిపిస్తున్నారు. ఇద్దరూ సమానమైన యుద్ధకౌశలాన్ని ప్రదర్శిస్తున్నారు. వారు సంధించిన బాణములతో ఆకాశం కప్పబడిపోయింది. ఒక సారి లక్ష్మణుడిది పైచేయిగా ఉంటే ఇంకాసేపటికి ఇంద్రజిత్తు విజయకేతనం ఎగరవేస్తున్నాడు. అంతలోనే
లక్ష్మణుడు ఇంద్రజిత్తు మీద పట్టుసాధిస్తున్నాడు. జయాపజయాలు ఇద్దరి మధ్య అటు ఇటు పరుగెడుతున్నాయి. లక్ష్మణుడు, ఇంద్రజిత్తు ఒకరి మీద ఒకరు వేసుకుంటున్న బాణములతో ఆకాశం కప్పబడిపోయింది. చీకట్లు కమ్ముకున్నాయి. వానరులు రాక్షసుల రక్తంతో అక్కడ రక్తపుటేరులు ప్రవహిస్తున్నాయి.ఆ సమయంలో లక్ష్మణుడు నాలుగు బాణములతో ఇంద్రజిత్తు రథానికి కట్టిన గుర్రములను చంపాడు. మరొక భల్లబాణంతో ఇంద్రజిత్తు సారధిని చంపాడు. ఇంద్రజిత్తు మరొక రథాన్ని ఎక్కి తన రథమును తానే తోలుకుంటూ లక్ష్మణునితో యుద్ధం చేస్తున్నాడు. ఆ సమయంలో లక్ష్మణుడు ఇంద్రజిత్తు మీద తన వాడి అయిన బాణములను ప్రయోగించాడు. మరలా రథమునకు కట్టిన గుర్రములను తన బాణములతో కొట్టాడు లక్ష్మణుడు. అవకాశం దొరకడం ఆలస్యం లక్ష్మణుడు ఆ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుంటూ ఇంద్రజిత్తును దెబ్బతీస్తున్నాడు. ఇంద్రజిత్తుకు క్రమక్రమంగా సామర్థ్యం సన్నగిల్లింది.
అలసిపోతున్నాడు. ఇది చూచిన వానర నాయకులు హర్షధ్వానాలు
చేసారు. ఇంతలో ప్రమాథి, రభసుడు, శరభుడు, గంధమాధనుడు అనే వానర శ్రేష్ఠులు ఇంద్రజిత్తు మీదికి దూకారు. ఎగురుకుంటూ వెళ్లి
ఇంద్రజిత్తు రథం మీద కూర్చున్నారు. ఇంద్రజిత్తు రథమునకు కట్టిన
గుర్రములను బలంగా కొట్టారు. అవి రక్తం కక్కుకున్నాయి. కిందపడి
మరణించాయి. తరువాత ఆ నలుగురు వానర వీరులు ఇంద్రజిత్తు
ఎక్కిన రథమును ముక్కలు ముక్కలుగా విరుగ గొట్టారు. మరలా
వెనక్కు ఎగిరి లక్ష్మణుని పక్కన నిలబడ్డారు. ఇదంతా క్షణాలలో