కంచి పరమాచార్య ధార్మిక సేవా ట్రస్ట్ (రి) @kpdstrust Channel on Telegram

కంచి పరమాచార్య ధార్మిక సేవా ట్రస్ట్ (రి)

@kpdstrust


విరాళాలు పంపాల్సిన వివరాలు.

A/C Name : Kanchi Paramacharya Dharmika Seva Trust ®

A/C. No : 50200059599164

IFSC Code : HDFC0001753

Branch : HDFC Bank

UPI ID : 7259859202@hdfcbank

Gpay/Phone pay/BHIM/freecharge 7259859202

కంచి పరమాచార్య ధార్మిక సేవా ట్రస్ట్ (రి) (Telugu)

కంచి పరమాచార్య ధార్మిక సేవా ట్రస్ట్ (రి) అనే టెలిగ్రామ్ ఛానల్ ఒక ధార్మిక సేవాలయంగా పరిచయం. ఈ ఛానల్ ద్వారా వివిధ సమాజ సేవా కార్యక్రమాలు, భక్తి సామగ్రిక చిత్రాలు, ధార్మిక సందేశాలు, మరియు ఉద్యోగ అవకాశాల గురించి వివరాలు అందిస్తుంది. ఇది ఉదాహరణాత్మకంగా సేవా కార్యక్రమాలను ప్రోత్సాహించే మరియు దానాల కోసం ఆహ్వానించే ప్లాట్ఫార్మ్. కంచి పరమాచార్య ధార్మిక సేవా ట్రస్ట్ ఛానల్ ద్వారా ధనాల చేపడాం, ఆత్మీయుల సమాచారం షేర్ చేయాం, మరియు సమాజంలో నైతికతను ప్రచారం చేయాం. అన్ని ఆదాయం నుండి కంచి పరమాచార్య ధార్మిక సేవా ట్రస్ట్ ఛానల్ ద్వారా సాధారణ మన సమాజానికి ఉపయోగమున్నది.

కంచి పరమాచార్య ధార్మిక సేవా ట్రస్ట్ (రి)

21 Nov, 00:36


కచేరి - కాలక్షేపం

పరమాచార్య స్వామివారు మహారాష్ట్రలోని మిరాజ్ లో మకాం చేస్తున్నప్పుడు వారి జయంతి సందర్భంగా కచేరి చెయ్యడానికి చెన్నై నుండి మా బృందం వెళ్ళింది. మరుసటిరోజు స్వామివారు పరివాట్టం ధరించి ధ్యానంలో ఉన్నప్పుడు “వెంకటేశన్ ను ప్రత్యేకించి దీక్షితర్ కృతులను పాడమని చెప్పు” అని ఆజ్ఞాపించారు. అలా ఒక గంటసేపు రాగాలను కృతులను పాడిన తరువాత స్వామివారు ధ్యానం ముగించుకుని బయటకు వచ్చి ఆ పరివాట్టాన్ని నా తలపై పెట్టమని ఆదేశించారు. అది ఇప్పటికి నా పూజమందిరంలో భద్రంగా ఉంది.

మరుసటిరోజు ఉదయం ఎనిమిది గంటల నుండి మధ్యాహ్నం పన్నెండు దాకా కచేరి జరిగింది. రాత్రి ఎనిమిది గంటలకి మహాలక్ష్మి ఎక్సప్రెస్ లో చెన్నై వెళ్ళడానికి స్వామివారి అనుమతి తీసుకున్నాము. ఏడుగంటలప్పుడు నన్ను మళ్ళా మొదలుపెట్టమన్నారు. బుక్ చేసిన టికెట్లను రద్దుచేసుకోవడం ఎలాగో మాకు అర్థంకాక ఆతురత పడుతుంటే, అప్పుడే ఆవూర్ హెచ్.టి.సి బంధువులు స్నేహితులతో కలిసి స్వామివారి దర్శనానికి వచ్చారు. శ్రీకంఠన్, రామమూర్తి విషయం అతనితో చెప్పగానే, “అంతా నేను చూసుకుంటాను. రేపు ఉదయం మైలై ఎక్సప్రెస్ కు మీకు అన్ని ఏర్పాట్లు చేసి నేనుకూడా ఈ ముగ్గురితో పాటు వెళ్తాను” అని చెప్పాడు.

ఆరోజు ఆరు నుండి తొమ్మిది దాకా కచేరి జరిగింది. కచేరి వినడానికి చాలామంది వచ్చారు. అప్పుడే సాంగ్లి మహారాజు తన కుటుంబంతో, పరివారంతో వచ్చారు. తనతో పాటు బుట్టలలో పళ్ళు, ఒక ఎర్రనిది, తెల్లనిది, నీలిరంగుది కాశ్మీరు శాలువాలు కూడా తెచ్చారు. వాటినన్నిటిని స్వామివారి ముందుంచారు. స్వామివారి కుడివైపున నీలి శాలువా, ఎడమవైపున తెల్లనిది, ఎర్రది తలపైన ఉంచుకున్నారు. వారిని అలా చూడటానికి చాలా అద్భుతంగా ఉంది.

ఒక అరగంట తరువాత స్వామివారి ఆజ్ఞ ప్రకారం మహారాజే స్వయంగా ఎర్ర శాలువాని పళ్ళ తట్టలో పెట్టి మా నాన్నగారు బ్రహ్మశ్రీ చిత్తూరు గోపాలకృష్ణ అయ్యర్ కు, నీలి శాలువా నాకు, తెల్లది మృదంగం రమేశ్ కు ఇచ్చారు. ఇది మాకు గొప సన్మానంగా వారి రక్షణగా భావించాము.

మరుసటి రోజు ఉదయం ఏడుగంటలకు మాతోపాటు చీఫ్ టికెట్ ఇన్ స్పెక్టర్ వచ్చి స్వామివారు ఇచ్చిన విభూతి, కుంకుమ, ప్రసాదం తీసుకుని స్వామివారి ఆశీస్సులు అందుకున్నాము.

మేము ప్రయాణంలో ఉండగా వార్తాపత్రికలో నిన్నమేము ప్రయాణించవల్సిన మహాలక్ష్మి ఎక్సప్రెస్ లో ఎనిమిది బోగీలు విడిపోయాయని తెలిసి ఖంగుతిన్నాము.

కేవలం మహాస్వామి వారి వల్లనే మా ప్రయాణం వాయిదా పడింది. స్వామివారి దివ్యదృష్టికి మేము దాసోహమయ్యాము.

--- ఫ్లూటిస్ట్ జి. వెంకటేసన్, మహాపెరియవళ్ – దరిశన అనుభవంగళ్ 4

#KanchiParamacharyaVaibhavam #కంచిపరమాచార్యవైభవం

కంచి పరమాచార్య ధార్మిక సేవా ట్రస్ట్ (రి)

20 Nov, 00:29


పది రూపాయలా? పదిహేను రూపాయలా?

పరమాచార్య స్వామివారు కలవైలో మకాం చేస్తున్నారు. ఒకరోజు ఉదయం తంజావూరు నుండి ఒక న్యాయవాది స్వామివారి దర్శనానికి కారులో వచ్చాడు. చాలా ఆడంబరంగా పటాటోపంతో వచ్చాడు. అతని భార్య సంప్రదాయ పద్ధతిలో మడిచీర కట్టుకుంది. వారి కుమారులు పంచ ఉత్తరీయములు వేసుకున్నారు. ఇక అతను వైదికంగా పంచకట్టుకుని ఉత్తరీయం వేసుకొని, మేలిమి రత్నం పొదగబడిన ఒక బంగారు గొలుసును మెడలో వేసుకున్నాడు.

అతని చేతిలో ఒక పెద్ద పళ్ళెం ఉంది. అందులో చాలా పళ్ళు, పూలు, ద్రాక్షలు, జీడీపప్పు, కలకండ, తేనె వీటన్నిటితో పాటు ఒక కవరులో డబ్బులు పెట్టుకుని తీసుకువచ్చాడు. వీటన్నిటిని తీసుకొని వచ్చి మహాస్వామి వారి ముందుంచి స్వామివారికి సాష్టాంగం చేసాడు. మహాస్వామివారు కళ్ళతో ఆ పళ్ళాన్ని తీక్షణంగా చూసారు.

”ఆ కవరులో ఏముంది?” అని అడిగారు.
”కొద్దిగా ధనం. . . ఉంది”

“కొద్దిగా అంటే పది రూపాయలా? పదిహేను రూపాయలా?”

బహుశా ఆ న్యాయవాది అహం దెబ్బతిని ఉంటుంది. అతను ఆ జిల్లాలోనే పెద్ద పేరుమోసిన క్రిమినల్ న్యాయవాది. “ఎందుకు మహాస్వామి వారు అతని గురించి అంత తక్కువ అంచనా వేసారు."

అతను అతివినయం ప్రదర్శిస్తూ, నమ్రతతో కొద్దిగా వొంగి మృదుమధురంగా “పదుహేను వేల రూపాయలు” అని అన్నాడు.

మహాస్వామి వారు కొద్దిసేపు మౌనంగా ఉన్నారు. “ఇక్కడికి ఎలా వచ్చారు?” అని అడిగారు.
”మేము ఇక్కడికి కారులో వచ్చాము” అని చెప్పాడు.

”ఈ కవరును జాగ్రత్తగా నీ కారులో ఉంచుకో. పూలు పళ్ళు చాలు” అని చెప్పారు స్వామివారు.

ఆ న్యాయవాది ఆ మాటలకు గతుక్కుమన్నాడు. స్వామివారు చెప్పినట్టు చేసాడు. స్వామివారు అతనితో చాలాసేపు ప్రశాంతంగా మాట్లాడి, వారికి ప్రసాదం ఇచ్చి పంపించివేసారు. కారు వెళ్ళిపోయిన శబ్ధం వినిపించింది.

పదిహేను వేలు వద్దు అన్నందుకు పరిచారకులు బాధపడి ఉంటారని స్వామివారికి తెలియదా? తెలుసు. వారివైపు తిరిగి,

”అతను తప్పుడు కేసు వాదించి గెలిచాడు. అతను ఇవ్వదలచిన ఆ పదిహేను వేలు ఆ కేసు గెలవడం వల్ల అతనికి ముట్టిన దాంట్లోనిదే. అది పాపపు సొమ్ము. అందుకే తీసుకోలేదు” అని చెప్పారు. సేవకులకు విషయం అర్థమై సమాధాన పడ్డారు.

ఒకానొకప్పుడు శ్రీమఠం చాలా ఆర్థిక ఇబ్బందుల్లో పడింది. మఠం మేనేజరు చాలా ఆరాటపడేవారు. అటువంటి సమయంలో కూడా పరమాచార్య స్వామివారు ఆత్రుతతో అక్రమ ధనం ముట్టేవారు కాదు.

“ఒక బిందెడు పాలు పాడుచేయడానికి ఒక చిటికెడు ఉప్పు చాలు. ఒక్కడికోసం, ఒక్కదానికోసం ఆచారాలను సంప్రదాయాలను ధర్మాన్ని వదిలేస్తే అదే అలవాటు అవుతుంది” అని చెప్పేవారు స్వామి వారు.

--- శ్రీమఠం బాలు మామ, మహా పెరియవళ్ - దరిశన అనుభవంగళ్

అపార కరుణాసింధుం జ్ఞానదం శాంతరూపిణం
శ్రీ చంద్రశేఖర గురుం ప్రణమామి ముదావహం ।।

టెలిగ్రామ్ ఆప్ ద్వారా కంచి పరమాచార్య వైభవం పొందాలనుకునేవారు ఈ టెలిగ్రామ్ ఛానల్ కు సబ్స్క్రైబ్ అవ్వగలరు.

t.me/KPDSTrust

#KanchiParamacharyaVaibhavam #కంచిపరమాచార్యవైభవం

కంచి పరమాచార్య ధార్మిక సేవా ట్రస్ట్ (రి)

19 Nov, 00:19


అప్పటికి మద్యాహ్నం రెండు గంటలు అయ్యింది. మీనాక్షి పాట్టిని మనవరాలిని తన ముందు కూర్చోమన్నారు. పొద్దున్న స్వామివారి అనుమతితో కామాక్షి దర్శనానికి వెళ్ళిన అంబుజం విచార వదనంతో వచ్చి స్వామి వారికి నమస్కరించింది. ఆవిడ తీవ్రమైన బాధతో కళ్లల్లో నీరు కారుస్తోంది. స్వామివారు చూసి, వాత్సల్యంతో “అడడా! ఎందుకమ్మా ఏడుస్తున్నావు?” అని అడిగారు.

అంబుజం మామి కళ్ళుతుడుచుకుని ఇలా చెప్పింది, “అది ఇలా పెరియవా! రెండునెలల క్రితం కామాక్షికి ఐదురోజుల సేవ చేసినప్పుడు నా అల్లుడు కూతురు ఒక్కటైతే, నా ఎనిమిది సవర్ల రెండు వరసల బంగారు గొలుసుని ఇస్తానని మొక్కుకున్నాను. అమ్మవారు వాళ్ళిద్దర్నీ ఒక్కటిచేసింది. ఈరోజు నా గొలుసు ఇద్దామని వెళ్ళాను. కాని అది నా గొంతులో నుండి జారిపడి ఎక్కడో పడిపోయింది. ఆత్రంగా అంతా వెతికాను కాని నాకు ఎక్కడా దొరకలేదు. అది అమ్మవారికి ఇస్తానన్న గొలుసు. ఇప్పుడు నన్నేం చెయ్యమంటారు పెరియవా?” అని మళ్ళా కన్నీరు పెట్టుకుంది.

స్వామివారు మీనాక్షి పాట్టి వైపు అర్థమైందా అన్నట్టు చూసారు. పాట్టి స్వామివారికి నమస్కరించి లేచి నిలబడింది. పళ్ళెంలో పెట్టిన ఆ బంగారు గొలుసును చేతుల్లోకి తీసుకుని అంబుజం వైపు తిరిగి దాన్ని చూపిస్తూ, “అమ్మా అంబుజం చూడు ఇది నువ్వు పోగిట్టుకున్న గొలుసేనేమో?” అని అన్నది.

అంబుజం దాన్ని చేతులలోకి తీసుకుని పరీక్షించి, “ఇదే ఇదే గొలుసు. పాట్టి ఇది ఇక్కడికి ఎలా వచ్చింది? చాలా ఆశ్చర్యంగా ఉంది” అని అన్నది. పాట్టి అంబుజానికి జరిగిన విషయమంతా గుక్కతిప్పుకోకుండా చెప్పింది.

అంబుజం మామి మీనాక్షి పాట్టిని కౌగిలించుకుంది. సంతోషంతో “పాట్టి, నువ్వు ఏమి దిగులుపడకు. నేను స్వామివారి సమక్షంలో చెప్తున్నాను. నీ మనవరాలి పెళ్ళికి రెండు వరసల బంగారు గొలుసు ఎనిమిది సవర్లది కొత్తది నేను చేయిస్తాను. తన పెళ్ళి వైభవంగా జరుగుతుంది. ఈ గొలుసు నేను అమ్మవారికి సమర్పించాలనుకున్నది. ఈ సాయింత్రమే నిన్ను మీ అమ్మాయిని నాతో నగల షాపుకు తీసుకువెళ్ళి, ఎనిమి సవర్ల రెండు వరసల బంగారు గొలుసు ఇప్పిస్తాను. అంతేకాదు తన పెళ్ళి ఖర్చు నిమిత్తం ఐదువేల రూపాయలు ఇస్తాను” అని చెప్పింది.

స్వామివారు ప్రత్యక్ష కామాక్షిలా కూర్చుని అంతా చూస్తున్నారు సాక్షిగా. అందరూ మహాస్వామి వారికి నమస్కరించారు. స్వామి వారు మీనాక్షి పాట్టి వైపు చూస్తూ “ఈరోజు నీవు, నీ మనవరాలు ఐదు ప్రదక్షిణలు చెయ్యలేదు. సాయింత్రం వెళ్ళి అయిదు ప్రదక్షిణలు చేసి అమ్మవారిని ప్రార్థించండి” అని చెప్పి పంపించారు.

ఆ సమయంలో మీనాక్షి పాట్టికి తన మనవరాలికి కలిగిన ఉద్వేగం, ఆ సంఘటన వలన కలిగిన భావనలు సామాన్య పదాలతో వర్ణించడం అసాధ్యం.

అపార కరుణాసింధుం జ్ఞానదం శాంతరూపిణం
శ్రీ చంద్రశేఖర గురుం ప్రణమామి ముదావహం ।।

టెలిగ్రామ్ ఆప్ ద్వారా కంచి పరమాచార్య వైభవం పొందాలనుకునేవారు ఈ టెలిగ్రామ్ ఛానల్ కు సబ్స్క్రైబ్ అవ్వగలరు.

t.me/KPDSTrust

#KanchiParamacharyaVaibhavam #కంచిపరమాచార్యవైభవం

కంచి పరమాచార్య ధార్మిక సేవా ట్రస్ట్ (రి)

19 Nov, 00:19


అంబుజం నవ్వుతూ, “ఈ అరటి గొన మా అరటి తోటలోనిదే పెరియవా! అందుకే అంత పెద్దగా ఉంది” అని వినయంగా చెప్పింది.

స్వామివారు సంతోషంతో, “సరే! మీ అల్లుణ్ణి కూతురిని కలిపింది ఆ కామాక్షియే కాబట్టి ఈ అరటి గొనని ఆవిడకే సమర్పించి ఆ పళ్ళని ఆక్కడ దర్శనానికి వచ్చిన భక్తులకు పంచు” అని ఆజ్ఞాపించారు.

”లేదు లేదు పెరియవా! ఇది ఇక్కడే ఉండనివ్వండి. అమ్మవారికి సమర్పించడానికి సరిగ్గా ఇలాంటిదే ఇంకొకటి తెచ్చాను. మీరు అనుమతిస్తే అమ్మవారిని దర్శించుకొని నా కృతజ్ఞతలను తెలుపుకొని వస్తాను” అని చెప్పి స్వామికి నమస్కరించింది.

”భేష్! అమ్మవారి దర్శనం తరువాత మఠంలో భోజనం చేసి మీ ఊరికి వెళ్ళాలి సరేనా గుర్తుంచుకో. మరచిపోకు” అని వెళ్ళడానికి అనుమతిచ్చారు.

ఆరోజు కామాక్షి అమ్మవారి ఆలయంలో అంతగా భక్తుల తాకిడి లేదు. ఉదయం పదకొండు గంటలు. కొద్దిగా ఆలస్యం అవ్వడం వల్ల మీనాక్షి పాట్టి మనవరాలితో త్వరత్వరగా ఆలయంలోకి వెళ్ళింది. ఆరోజు చివరి రోజు కావడంతో పూజకు కావాల్సిన సామాన్లు తెమ్మని మనవరాలికి డబ్బులిచ్చి వెనక రమ్మని తను వెళ్ళిపోయింది.

ఆ అమ్మాయి, బామ్మ చెప్పినవన్నీ తీసుకుని లోపలికి వెళ్ళింది. పాట్టి అమ్మవారికి అర్చన చేయించి కళ్ళ నీరు కారుతుండగా ప్రార్థించింది. “అమ్మా కామాక్షి తాయి, నేను నీ పైనే ఆధారపడి నిన్నే నమ్ముకున్నాను. నువ్వు, స్వామి వారు తప్ప నన్ను కాపాడగలవారు లేరు. ఎనిమిది సవర్ల రెండు వరసల బంగారు గొలుసుతో నా మనవరాలి పెళ్ళి చేయవలసింది నువ్వే. నీ వల్లే నా మనవరాలి పెళ్ళి జరగగలదు. కాపాడు తల్లీ కాపాడు”. బామ్మ ఏడుస్తుండడంతో మనవారాలు కూడా ఏడ్చేసింది. తరువాత అమ్మవారి గర్భగృహానికి ప్రదక్షిణలు చేయడం మొదలుపెట్టారు. నాలుగో ప్రదక్షిణం చేస్తున్నారు.

“పాట్టి. . . పాట్టీ. . . పాట్టీఈఈఈ” మనవరాలు ఇలా గట్టిగా అరుస్తున్నందుకు మీనాక్షి పాట్టి వెనక్కు తిరిగి కోపంతో “ఎందుకు అలా అరుస్తున్నావు? ఏమి పోయిందని అలా మొత్తుకుంటున్నావు?” అని కోపంగా అంది.

“ఏమి పోలేదు పాట్టి కాని ఇది దొరికింది. ఇక్కడకు రా చూపిస్తాను” అని చిన్నగా చెప్పి, పాట్టిని ఒక మూలకు తీసుకుని వెళ్ళి, మూసి ఉన్న అరచేతిని తెరిచింది. అది తెగిపోయిన పథకమున్న రెండు వరసల బంగారు గొలుసు.

“ఎక్కడ దొరికింది నీకు?” పాట్టి ఆశ్చర్యంతో అడిగింది. “నేను నీ వెనక తలదించుకొని వస్తున్నాను, నా కళ్ళు కింద ఉన్న ఈ గొలుసుపై పడ్డాయి. నేను వెంటనే ఎవరూ చూడకుండా దీన్ని గభాలున తీసుకున్నాను. ముందు ఇది నిజమైనదా లేక నకిలీదా చూడు“ అని చెప్పింది ఆ అమ్మాయి.

పాట్టి దాన్ని చేతుల్లోకి తీసుకుంది. అటు ఇటు పరీక్షగా చూసి, “చూస్తే మంచి బంగారం లాగే ఉంది. ఒక ఎనిమిది ఎనిమిదిన్నర సవర్లు ఉండొచ్చు. ఇది మహాస్వామి వారి మహిమవల్ల కామాక్షి మనకు అనుగ్రహించింది. సరే ముందు ఇక్కడి నుండి వెళ్ళిపోదాం పద” అని చీరకొంగున ఆ గొలుసును దాచి ముడివేసి ఆత్రంగా బయటకు వచ్చింది.

అప్పుడు మధ్యాహ్నం ఒంటిగంట సమయం. స్వామి వారి సందర్శనార్థమై ఒక నలుగురైదుగురు వేచి ఉన్నారు. మీనాక్షి పాట్టి, ఆ అమ్మాయి నేలపై పడి నమస్కారం చేసి నిలబడ్డారు. స్వామివారు వారిని చూసి నవ్వారు. స్వామి వారికి గొలుసు విషయం చెప్పాలా వద్దా అని పాట్టీ తటపటాయిస్తోంది.

స్వామివారే ముందుగా “ఈరోజుతో ఐదురోజుల మీ పంచసంఖ్యోపచార పూజ పూర్తికావలసింది. కాని ఒక వస్తువు నీ మనవరాలి చేతుల్లోకి రావడం వల్ల, మీకు కలిగిన ఆశ్చర్యానందం వల్ల ఐదవ ప్రదక్షిణ పూర్తికాలేదు. కామాక్షి దేవి పూర్ణ అనుగ్రహం లభించింది అని పరుగుపరుగున బయటకు వచ్చేసావు. అవునా?” అని గట్టిగా నవ్వారు.

పాట్టి నిచ్చేష్టురాలైంది. భయంతో మాటలను మింగుతూ గుటకలు వేస్తూ, “స్వామివారు నన్ను తప్పుగా భావించరాదు. ఆ వస్తువు నా మనవరాలి చేతుల్లోకి రాగానే అమ్మవారే తను తీసుకోవాలని అక్కడ పడేసింది అని భావించి, సంతోషంతో మరొక్క ప్రదక్షిణ చెయ్యాలని మర్చిపోయాను” అని చెప్పింది.

స్వామివారు అసహనంగా, “అదొక్కటే మర్చిపోయావా! ఇక్కడికి వస్తూ దార్లో రంగు పథ్థర్ గారి దుకాణంలో ఆ వస్తువును తూచి, తెగిపోయినదాన్ని కొలిమిలో అతికించడం మరచిపోలేదా?” అని అడిగారు. “అది వదిలెయ్. తూచినప్పుడు అది సరిగ్గా ఎనిమిది సవర్లు ఉందా?” అని అడిగారు.

పాట్టి మరియు మనవరాలు నిర్ఘాంతపోయారు. “మీరు ఇప్పుడు చెప్పినదంతా నిజం పెరియవా!” అని పాట్టి అన్నది.

స్వామివారు నిదానించి, “చెప్పు. న్యాయంగా ఆ పదార్థం ఎవరికి చెందినది?” అని అడిగారు.

”కామాక్షి అమ్మకి”

“మరి దాన్ని నువ్వు రహస్యంగా తీసుకుని చీరకొంగులో దాచుకోవడం సబబేనా? నువ్వే చెప్పు”

“అపరాధం . . . కేవలం నా అపరాధం అంతే. నన్ను మన్నించండి. అనుకోకుండా చేసాను” అని పాట్టి పశ్చాత్తాప్పడుతూ, చేతులు వణుకుతుండగా స్వామి వారి ముందు ఉన్న పళ్ళెంలో ఆ గొలుసును ఉంచింది. స్వామివారు నవ్వారు.

కంచి పరమాచార్య ధార్మిక సేవా ట్రస్ట్ (రి)

19 Nov, 00:19


మీనాక్షి పాట్టి సాష్టాంగం చేసి నిలబడి, “అదేమిటి పెరియవా మీరు అన్నీ అయిదుగా చెయ్యమంటారు!” అని పాట్టి ఆత్రుతతో “అలా చేస్తే కామాక్షి అమ్మ నా మనవరాలు కామాక్షి పెళ్ళి చేస్తుంది కదా?” అని అడిగింది. ”ఐదు సార్లు చెయ్యమని నాకోసం చెప్పడం లేదు. అమ్మవారి నామాలలో “పంచసంఖ్యోపచారిణి” అని ఉంది. ఐదు, ఐదు గుణిజాలుగా ఏమైనా చేస్తే ఆవిడ మన కోరికలు తీరుస్తుంది” అని చెప్పి, “నేను అదే చెప్పాను. మరింకేం లేదు” అని అన్నారు.

”ఎప్పుడు మొదలు పెట్టాలి పెరియవా?”

స్వామివారు నవ్వుతూ, “శుభశ్య శీఘ్రం” అని ఒక నానుడి. ఈరోజు శుక్రవారం. ఇంకేం ఈరోజునుండే మొదలుపెట్టండి” అని చెప్పి వారిని పంపించారు.

తన మనవరాలితో కలిసి బామ్మ కామాక్షి అమ్మవారి దేవస్థానానికి దారితీసారు. ఆరోజు శుక్రవారం అవడం వల్ల చాలా రద్దీగా ఉంది. అమ్మవారు ప్రత్యేక అలంకరణలో దర్శనమిస్తోంది. స్వామి వారి ఆనతి ప్రకారం ఇద్దరూ కళ్ళుమూసుకుని ప్రార్థించారు. పాట్టి తన మనవరాలి పేరు నక్షత్రం చెప్పి అర్చన చేయించి ప్రసాదం తీసుకుంది.

తరువాత ఇద్దరూ ఆ ఎనిమిది సవర్ల రెండు వరసల బంగారు గొలుసు గురించి ప్రార్థించి లోపలికెళ్ళి గర్భాలయం చుట్టూ ఐదుమార్లు ప్రదక్షిణ చేసారు. స్వామివారు చెప్పినట్టు ఐదుసార్లు నేలపై పడి నమస్కరించి అమ్మవారిపై విశ్వాసంతో ఇంటికి వెళ్ళారు.

శనివారం ఉదయం మీనాక్షి పాట్టి మనవరాలితో కలిసి పారిజాత పూలు తీసుకుని శ్రీమఠానికి వెళ్ళింది. ఆరోజు చాలా రద్దీగా ఉంది. ఒక ఇరవై ముప్పై మంది భక్తుల వెనకాతల పాట్టి నిలబడింది. తన ముందున్న వ్యక్తి మరొక వ్యక్తితో చెప్పగా విన్నది. “ఈరోజు అనుశం(అనూరాధ) నక్షత్రం. పరమాచార్య స్వామి వారి జన్మనక్షత్రం. కాబట్టి స్వామివారు ఈరోజు కాష్టమౌనంలో ఉంటారు. ఎవరితోను మాట్లాడరు. కేవలం ముఖదర్శనం మాత్రమే”

మీనాక్షి పాట్టి ఆత్రుత నీరుగారిపోయింది. “ఈ రోజు మహాస్వామి వారికి ఆ ఎనిమిది సవర్ల బంగారు గొలుసు గురించి గుర్తు చేద్దామనుకున్నాను కాని కుదిరేలా లేదు” అని అనుకుంది. వారు మహాస్వామి వారి దగ్గరకు చేరగానే సాష్టాంగం చేసి నిలబడ్డారు. అసలు జీవం లేదు అన్నట్టుగా ఆ పరబ్రహ్మం కూర్చొని ఉంది. పాట్టి అక్కడే నిలబడింది ఎలాగైనా గుర్తు చేద్దామని. స్వామి వారి సేవకుడొకరు గట్టిగా “పాట్టి ముందుకు వెళ్ళు ఈరోజు స్వామి వారు మౌనంలో ఉన్నారు. వారు మాట్లాడరు. చూడు ఎంతమంది వేచియున్నారు నీ వెనకాతల” అని కసిరి పంపించాడు.

చేసేదేమి లేక మనవరాలితో కలిసి కామాక్షి అమ్మవారి దేవస్థానానికి దారితీసింది. మహాస్వామి వారి ఆజ్ఞ ప్రకారం అమ్మవారికి పంచసంఖ్యోపచార పూజ చేసి ఇంటికి వెళ్ళిపోయారు. తరువాతి రెండు రోజులు స్వామి వారు మౌనంలో ఉన్నారు. పాట్టి ఆమె మనవరాలు కేవలం మహాస్వామి వారిని మఠంలో దర్శించుకుంటున్నారు. ఆమెకు ఆందోళన ప్రారంభమయ్యింది. “ఐదు రోజులలో నాలుగు రోజులు గడిచిపోయాయి. కాని ఏమి జరగలేదు. తల్లి కామాక్షి కళ్ళు తెరిచి నన్ను కరుణిస్తుందో లేదో?” అని తనలో తనే బాధపడుతోంది. . .

మంగళవారం తెల్లవారింది . కంచి మఠం చాలా కోలాహలంగా ఉంది. అరణి నుండి ఒక భజన బృందం వచ్చింది. వారి భజనామృతంతో మఠాన్ని భక్తిలో ముంచేస్తున్నారు. మహాస్వామి వారు వచ్చి వారి స్థానంలో కూర్చున్నారు. వారి మొహంలో తేజస్సు ప్రస్ఫుటంగా కనిపిస్తోంది. మౌనవ్రతం అయిపోయింది. స్వామి వారు దర్శనం కోసం చాలామంది వేచియున్నారు.

మధ్య వయస్కురాలైన ఒక మామి (పెద్దావిడ) తనవంతు రాగానే సంతోషంగా నేలపై పడి స్వామి వారికి నమస్కరించింది. తను తెచ్చిన వాటిని స్వామివారి ముందు పెట్టింది. ఒక పెద్ద రస్తళి అరటిపళ్ళ గొన, టెంకాయలు, చీనీ కాయలు, కమలాపళ్ళు, గుమ్మడికాయలు, లావుపాటి పచ్చి అరటిపళ్ళు మొదలైనవి పెట్టి మళ్ళా నమస్కరించింది.

స్వామివారు వాటిని చూసి తమలో తామే నవ్వుకున్నారు. వాటిని అక్కడ పెట్టిన ఆ పెద్దావిడ వైపు చూసారు. “నువ్వు నీదమంగళం భూస్వామి గణేశ అయ్యర్ భార్య అంబుజంవి కదూ? రెండు నెలల కింద ఇక్కడికి వచ్చావు. ఏదో విషయం గురించి బాధపడుతున్నానని చెప్పావు. ఇప్పుడు ఇలా పెద్ద అరటి పళ్ళతో వచ్చావంటే కామాక్షి అమ్మవారి దయ వల్ల నీ బాధలు తీరిపోయాయి కదా!” అని అన్నారు.

అంబుజం మామి మరలా నమస్కరించి, “అవును నిజం పెరియవా! నా ఒక్కగానొక్క కూతురు మైథిలి మూడేళ్ళుగా భర్తకు దూరంగా ఉంటోంది. రెండు నెలల క్రితం మీ వద్దకు వచ్చి నా బాధను చెప్పుకున్నాను. మీరు కంచి కామాక్షి అమ్మవారికి ఐదు ప్రదక్షిణలు, ఐదు నమస్కారాలు ఐదు రోజుల పాటు పంచసంఖ్యోపచార పూజ చెయ్యమన్నారు. నేను అది చాలా శ్రద్ధతో పూర్తిచేసాను. ఏమి నా అదృష్టం పదిహేను రోజుల క్రితం, జంషెడ్పూర్ టాటా స్టీల్ ప్లాంట్ లో పని చేసే నా అల్లుడు ఇక్కడకు వచ్చి తన భార్యను తీసుకుని వెళ్ళాడు. ఇదంతా కామాక్షి కరుణ మీ అనుగ్రహం పెరియవా!” అని ఆనందబాష్పాలు కారుస్తూ చెప్పింది.

అదంతా విని మహాస్వామి వారు “భేష్! భేష్! సంతోషం, చాలా మంచిది. ఆ దంపతులిద్దరూ సుఖంగా జీవించు గాక! సరేకాని ఇంత పెద్ద అరటిపళ్ళ గొన ఎక్కడిది? చాలా ఫలవంతంగా ఉంది” స్వామివారి నవ్వు ఉరుము ఉరిమినట్టు ఉంది.

కంచి పరమాచార్య ధార్మిక సేవా ట్రస్ట్ (రి)

19 Nov, 00:19


ఎనిమిది సవర్లు - రెండు వరసలు

(పంచసంఖ్యోపచారిణి)

చాలా ఏళ్ళ క్రితం ఒకరోజు తెల్లవారుఝామున బయట చిన్నగా చినుకులు పడుతుండగా కంచి శంకర మఠంలో మహాస్వామి వారు ఏకాంతంగా కూర్చొని ఉన్నారు. భక్తులందరూ దర్శించుకుని వెళ్ళిపోయిన తరువాత మహాస్వామి వారు తమ గదిలోకి వెళ్ళడానికి లేవబోతుండగా, ఒక ముసలి మామ్మ, ఒక యువతి పరుగు పరుగున వచ్చి మహాస్వామి వారికి నేలపై పడి నమస్కారం చేసి నిలబడ్దారు. స్వామి వారు మరల కూర్చొని, వారిని తేరిపారా చూసారు.

సంతోషంతో మొహం వెలుగగా, “అరెరె ఎవరు? మీనాక్షి పాట్టి(బామ్మ) నా? ఏమిటి ఆశ్చర్యం ఇంత ఉదయాన్నే వచ్చావు? నీతో ఉన్నది ఎవరు? నీ మనుమరాలా? ఏమిటి పేరు?” అని అడిగారు.

మీనాక్షి పాట్టి స్వామివారితో, “పెరియవా! నేను చాలా ఏళ్లుగా మీ దర్శనానికై వస్తున్నాను. కాని ఏరోజు మీకు నాగురించి చెప్పుకోలెదు. ఆ అవకాశం ఎప్పుడు రాలేదు. కాని ఇప్పుడు ఆ అవసరం వచ్చింది. ఈ అమ్మాయి నా మనుమరాలు, కూతురి కుమార్తె. ఇక్కడే పుట్టడం వల్ల కామాక్షి అని పేరు పెట్టాము. నాకు ఒక్కతె కూతురు. ఈ పిల్లను నా చేతుల్లో పెట్టి తను పోయి పన్నెండు ఏళ్ళు అవుతోంది. ఏదో జబ్బు తనకి. తన భర్త కూడా తనకంటే ముందే పోయాడు గుండేపోటు వల్ల.

ఈ పిల్లతో కలిసి జీవితం నెట్టుకొస్తున్నాను. పాఠశాలకు పంపిస్తే చదువు తలకెక్కలేదు. ఫిఫ్త్ గ్రేడ్ తో ఆపేసాను. ఇప్పుడు తనకు పదిహేను సంవత్సరాలు. దీన్ని ఒక అయ్య చేతిలో పెడితే నా బరువు తీరుతుంది”.

స్వామివారు అంతా ఓపికగా విన్నారు. “ఇంత పొద్దున్నే నువ్వు రావటంతోనే నేను అనుకున్నాను. మామూలుగా పదిగంటలప్పుడు చంద్రమౌళీశ్వర పూజకి పారిజాత పూలు తెచ్చేదానివి కదా. ఇప్పుడు వచ్చావంటే ఏదో అవసరం ఉంది అని. ఏమిటి విషయం?” అని అన్నారు.

మొదట కొద్దిగా సంకోచిస్తూ, “ఏమిలేదు పెరియవా! అమ్మయికి మంచి సంబంధం వచ్చింది. అబ్బాయిది కూడా ఈ ఊరే. పాఠశాలలో ఉపాధ్యాయుడు. అరవైరూపాయల జీతం. మంచి కుటుంబం. ఇచ్చి పుచ్చుకొనే బాధలు లేవు. జాతకాలు కూడా బాగా కలిసాయి. మీరే ఎలాగో ఈ వివాహం జరిపించాలి పెరివయా” అని స్వామివారికి నమస్కరించింది.

స్వామివారు స్వరం పెంచుతూ, మృదువుగా మందలిస్తున్నట్టుగా “ఏమిటి? నేను పెళ్ళి చేయాలా? ఏమి మాట్లాడుతున్నావు?” అన్నారు. వెంటనే చల్లబడి “సరే. నన్ను ఏమి చెయ్యమంటావు?” అని అడిగారు.

బామ్మ సంతోషంతో “అది ఇలా పెరియవా! నేను ఎలాగో కష్టపడి తన పెళ్ళికి ఒక ఐదువేలు రూపాయలు దాయగలిగాను. అ డబ్బుతో పెళ్ళి జరిపించగలను. కాని ఆ అబ్బయి తల్లి ఖండితంగా ‘పాట్టి ఏలా చేస్తావో, ఏమి చేస్తావో మాకు తలియదు నీ మనవరాలి మెళ్ళో ఎనిమిది సవర్ల బంగారు గొలుసు రెండు వరసలది వేసి పంపు’ అని చెప్పింది. నా ఆదాయంతో తనకి నగలు నట్రా నేను చేయించలేను. ఒక సవరం బంగారంతో రెండు గాజులు మాత్రం చేయించగలిగాను. నాకు అంతే సాధ్యపడింది. ఆ గొలుసు నేను ఎక్కడి నుండి తేగలను. మీరు మాత్రమే . . . ”

ఆవిడ ముగించక ముందే పరమాచార్య స్వామి వారు కోపంగా “చెప్పు, ఎనిమిది సవర్ల బంగారంతో రెండు వరసల గొలుసు నన్ను చేయించమంటావా?” అని అడిగారు.

మీనాక్షి పాట్టి సాష్టాంగం చేసి నిలబడి గట్టిగా లెంపలేసుకుంటూ “అపచారం అపచారం, పెరియవా నేను చెప్పదలచుకున్నదేమంటే రోజూ మీ దర్శనానికి ధనవంతులు, పెద్దవారు వస్తుంటారు. మీరు ఎవరికైనా ఈ గొలుసు కావాలని చెప్పొచ్చు కదా” అని దీర్ఘం తీస్తూ అడిగింది.

”ఏమిటీ? దర్శనానికి వచ్చిన వారిని గొలుసు ఇవ్వమని అడగనా? ఇక్కడ అటువంటి అలవాటు లేదు. నీకు కావాలంటే బంగారం అడగని ఏదైనా వేరే సంబంధం చూసుకో. అదే నీకు మంచిది” అని స్వామి వారు లేచారు.

మీనాక్షి పాట్టి ఆత్రుతగా “మహాస్వామి వారు ఇలాంటి సలహా ఇవ్వరాదని ప్రార్థిస్తున్నాను. ఇది మంచి సంబంధం, పెరియవా. పిల్లవాని స్వభావం మంచిది. వారి అమ్మాయికి పెళ్ళిచేసి ఎనిమిది సవర్ల బంగారం గొలుసు రెండు వరసలది పెట్టి పంపారట. కావున తమ ఇంటికి వచ్చే అమ్మాయి కూడా అలాగే రావాలని వారి కోరిక. మరింకేంలేదు పెరియవ! ఈ విషయంలో మీరే నాకు దారి చూపగలరు” అని ఏడుస్తూ అర్థించింది.

వెళ్ళడానికి లేచిన మహాస్వామి వారు మరలా కూర్చున్నారు. కొద్దిసేపు అలోచనలో మునిగిపోయారు. తరువాత కరుణా పూరితమైన మాటలతో “నేను ఇప్పుడు చెప్పేది మీరు చేస్తారా?” అని అడిగారు.

”ఖచ్చితంగా చేస్తాను పెరియవా. ఏమితో చెప్పండి” పాట్టి ఉత్సుకతతో అడిగింది.

”రేపు నీ మనవరాలితో కలిసి కామక్షి అమ్మవారి దేవస్థాననికి వెళ్ళు. ఇద్దరూ అమ్మవారిని ప్రార్థించండి, ‘అమ్మా! ఎనిమిది సవర్ల బంగారు గొలుసుతో ఈ పెళ్ళి బాగా జరిగేట్టు దీవించమ్మ. నీవే దాన్ని కరుణించగలవు అమ్మా’ అని సన్నిధి చుట్టూ అయిదు సార్లు ప్రదక్షిణ చెయ్యండి. ఐదు సార్లు అమ్మవారికి నేలపై పడి నమస్కారం చెసి ఇంటికి వెళ్ళండి. ఇలా ఐదురోజుల పాటు చెయ్యండి. మీరు సంకల్పించినట్టుగా మీకు కావాల్సింది కామాక్షియే ఇస్తుంది” అని ఆశీర్వదించి పంపారు.

కంచి పరమాచార్య ధార్మిక సేవా ట్రస్ట్ (రి)

18 Nov, 00:51


“శ్రీ కన్యకురిచి అమ్మ రక్షణ”

ఒక రోజు ఒక పెద్దమనిషి పరమాచార్య స్వామి వారి దర్శనం కోసం పట్టుకోట్టై అనే పట్టణం నుండి వచ్చాడు. దర్శనం అనంతరం మహాస్వామి వారితో "నేను ఒక కొత్త కారు కొన్నాను. దాన్ని తీసుకున్నప్పటి నుండి చాలా ప్రమాదాలు జరిగాయి. నేను చాలా మంది జ్యోతిష్కులను అడుగగా, వారు ఎన్నో పరిహారాలు చెప్పారు. వారు చెప్పినవన్నీ చేయించాను కాని ఏమి ఉపయోగం లేదు” అని అన్నాడు.

మహాస్వామి వారు కొద్దిసేపు మౌనంగా ఉన్నారు. తరువాత ఆ పెద్దమనిషిని "మీ ఊరి సమీపంలో కన్యకురిచి అనే ఊరు ఉన్నదా?" అని ప్రశ్నించారు.

ఆ మాటవిని ఆ పెద్దమనిషి చాలా ఆశ్చర్యపోయాడు.

మహాస్వామి వారు ఆ పెద్దమనిషితో "అక్కడ ఒక మహామాయా దేవి ఆలయం ఉన్నది. చాలా శక్తి వంతమైన దేవీ స్వరూపం. ఒక యాభై రూపాయలు పంపి అక్కడ ఉన్న అమ్మవారికి అభిషేకము చేయించు. నీ కారు ముందు “కన్యకురిచి అమ్మవారి ప్రసన్నః” అని అమ్మ రక్షణలో ఈ కారు ఉంది అని రాయించు” అని చెప్పారు.

ఆ పెద్దమనిషి నిశ్చేష్టుడయ్యి, నోట మాటరాక అలా నిలబడిపోయాడు. కొద్దిసేపటి తరువాత తేరుకొని, స్వామివారితో "పెరియవ! శ్రీ కన్యకురిచి అమ్మవారు మా ఇంటిదేవత, వంశపారంపర్యంగా మా ఆరాధ్య దైవం. మా తల్లితండ్రులు ప్రతి సంవత్సరము అక్కడకి వెళ్లి అమ్మవారికి అభిషేకం చేయించేవారు. మా కుటుంబం లోని చిన్నపిల్లలకు అక్కడే పుట్టువెంట్రుకలు తీయించేవారు. కాలక్రమములో మేము ఇవన్ని మరిచిపోయము. శ్రీ మహాపెరియవ దయ వలన మరియు మా అదృష్టం వల్ల మళ్ళీ మాకు గుర్తుచేసారు" అని స్వామివారికి సాష్టాంగం చేసి ఆనందంతో వెళ్ళిపోయాడు.

శ్రీ మహామాయ దేవి రక్షణ వల్ల ఆ కారుకి తరువాత ఎటువంటి ఆపదలు రాలేదు.

--- శ్రీ మఠం బాలు మామ, మహాపెరియవళ్ దరిశన అనుభవంగళ్

అపార కరుణాసింధుం జ్ఞానదం శాంతరూపిణం
శ్రీ చంద్రశేఖర గురుం ప్రణమామి ముదావహం ।।

టెలిగ్రామ్ ఆప్ ద్వారా కంచి పరమాచార్య వైభవం పొందాలనుకునేవారు ఈ టెలిగ్రామ్ ఛానల్ కు సబ్స్క్రైబ్ అవ్వగలరు.

t.me/KPDSTrust

#KanchiParamacharyaVaibhavam #కంచిపరమాచార్యవైభవం

కంచి పరమాచార్య ధార్మిక సేవా ట్రస్ట్ (రి)

17 Nov, 00:47


నక్తాల్ విశేషం

నాలుగు దశాబ్దాల క్రితం ఆంధ్రప్రదేశ్ లో తుఫాను వచ్చి ఎంతో ప్రాణనష్టం, ఆస్తినష్టం జరిగి దివిసీమ మొత్తం అతలాకుతలం అయిన రోజుల్లో జరిగిన సంఘటన ఇది.

మా మావయ్యగారు శ్రీ ఆలూరు వెంకట రమణా రావు గారు అప్పుడే వ్యాపారంలో నిలదొక్కుకునే ప్రయత్నంలో ఒక చిన్న వ్యాపారం మొదలు పెట్టారు. అహర్నిశలు కష్టపడి వ్యాపారం చేసి, మంచి ఫలితం వచ్చే దశలో తుఫాను కారణంగా తీవ్ర నష్టం వాటిల్లింది. అప్పటి వరకు పెట్టిన పెట్టుబడి, పడిన కష్టం అంతా బూడిదలో పోసిన పన్నీరు వలే వ్యర్ధమైపోయింది. మళ్ళీ ధైర్యంగా వ్యాపారం కొనసాగిద్దామంటే వారు చేసే ఆ వ్యాపారానికి రోజుకు షుమారు రూ.120 అవసరమవుతాయి. కానీ ఆ సమయంలో వాటికి కూడా ఇబ్బంది పడాల్సిన పరిస్థితిలో ఉన్నారు.

అప్పుడు మహాస్వామి వారు చాతుర్మాస్య దీక్షలో ఉన్నారని, వెళ్లి ఒకసారి దర్శనం చేసుకుందామని అనుకున్నారు. స్వామివారి దగ్గరకు అప్పటికే కొన్ని సార్లు వెళ్లి దర్శనం చేసుకున్నారు, కాని ఈ ఆపత్కర సమయంలో సహాయం కానీ సలహా కానీ అడిగే ధైర్యం చేయలేకపోయారు. అడిగితే మార్గం సూచిస్తారు అనే నమ్మకం ఉన్నా, వెళ్లి అడిగే ధైర్యం చెయ్యలేదు. నెమ్మదిగా వేరే ప్రయత్నాలు చేస్తుండగా, స్వామివారు దీక్షలో ఉన్న ప్రాంగణం దగ్గరలో ఉన్న ఒక సిమెంట్ ఫ్యాక్టరీలో పని ఉండడం వల్ల మా మావయ్యగారు వెళ్ళవలసి వచ్చింది. ఆ పని ముగించుకుని అలాగే స్వామి వారి దర్శనం కోసం వెళ్లారు.

అప్పుడే పూజలు ముగించుకుని స్వామి వారు ఏకాంతంలో ఉండగా, దర్శనానికి వెళ్లిన వీరిని పిలిచారు. ఆశీర్వచనం కోసం వెళ్లగా, సమస్య చెప్పాలా వద్దా అని మదన పడుతుండగా, మహాస్వామి వారు "నక్తాల్ విశేషం" అని అన్నారు. అదేంటో వీరికి అర్ధం కాలేదు. మరలా కొద్దిసేపటి తరువాత, "నక్తాల్ విశేషం" అని అన్నారు. అప్పుడు పక్కనే ఉన్న చంద్రమౌళి శాస్త్రి గారు మా మావయ్యగారితో, "స్వామి వారు మిమ్మల్ని ఉద్దేశించే చెప్పారు" అని చెప్పారు.

"నక్తాల్ అంటే ఏమిటో మీకు తెలుసా?” అని అడిగారు శాస్త్రి గారు.

"తెలీదు స్వామి" అని చెప్పారు.

"కార్తీక మాసంలో ఉపవాసం చేస్తారా?" అని అడిగారు.

"కార్తీక మాసంలో విశేషమైన రోజులలో ఉపవసిస్తాను స్వామి" అని చెప్పారు. అప్పుడు శాస్త్రి గారు "నక్తాల్"అంటే ఏమిటో వివరించారు.

ఈశ్వర ప్రీతికరమైన కార్తీక మాసంలో క్రమం తప్పకుండ శక్తికొలది ఈశ్వరారాధన చేసి, ఉదయం నుండి ఉపవాసం ఉండి, సూర్యాస్తమయంలో దీపారాధన చేసి, నక్షత్ర దర్శనం తరువాత ఈశ్వర ప్రసాదం(భోజనం) తీసుకోవాలి. కానీ ఆరోజే, కార్తీక మాసం చివరి రోజు కావడంతో, రానున్న కార్తీక మాసం నుండి తప్పక ఆచరిస్తానని స్వామివారికి నమస్కరించి సెలవు తీసుకున్నారు.

అప్పటి నుండి ప్రతీ సంవత్సరం క్రమం తప్పకుండ కార్తీక మాసంలో నక్తాల్ ఆచరిస్తూ, ఈశ్వరానుగ్రహం పొందుతూ వచ్చారు. మహాస్వామి వారి సూచన మేరకు, ఈశ్వరానుగ్రహం వలన చేపట్టిన వ్యాపారాలన్నీ దినదినాభివృద్ధి చెందుతూ లక్ష్మి కటాక్షం సిద్దించింది. స్వామివారి అనుగ్రహంతో "నీరజ గ్రూప్ అఫ్ కంపెనీస్" స్థాపించి వాటికి చైర్మన్ గా వ్యవహార బాధ్యతలు నిర్వహిస్తున్నారు. ఒంగోలు పట్టణంలో "శ్రీగిరి శ్రీ వెంకటేశ్వర స్వామి వారి దేవస్థానం" నిర్మించి, వ్యవస్థాపక ధర్మకర్తగా వైఖానస ఆగమ శాస్త్రానుసారం స్వామి వారికి ఉపచారములు జరిపిస్తున్నారు. వేద విద్యాభ్యాసం ప్రాముఖ్యత, ఆవశ్యకత ఎరిగిన వారై వారి తల్లి తండ్రుల పేరు మీద వేదపాఠశాల స్థాపించి "వేద విద్య ప్రవర్తక" అని గౌరవం పొందారు. నాలుగు దశాబ్దాలుగా మహాస్వామి వారి సూచన మేరకు "నక్తాల్" ఆచరిస్తూ ఈశ్వరానుగ్రహం పొందుతూ స్వామి వారి సూచనానుసారం సేవ చేసుకుంటున్నారు.

--- ఆలూరు కమలా దేవి, ఒంగోలు

అపార కరుణాసింధుం జ్ఞానదం శాంతరూపిణం
శ్రీ చంద్రశేఖర గురుం ప్రణమామి ముదావహం ।।

టెలిగ్రామ్ ఆప్ ద్వారా కంచి పరమాచార్య వైభవం పొందాలనుకునేవారు ఈ టెలిగ్రామ్ ఛానల్ కు సబ్స్క్రైబ్ అవ్వగలరు.

t.me/KPDSTrust

#KanchiParamacharyaVaibhavam #కంచిపరమాచార్యవైభవం

కంచి పరమాచార్య ధార్మిక సేవా ట్రస్ట్ (రి)

16 Nov, 00:49


జయ జయ శంకర !! హర హర శంకర !!

కంచి పరమాచార్య వైభవం. తెలుగునాట ఈ పేరు తెలియని పరమాచార్య స్వామివారి భక్తులు ఉండరంటే అది అతిశయోక్తి కాదేమో!!

దాదాపు తొమ్మిది సంవత్సరాలుగా రోజుకొక మహాస్వామి వారి అనుగ్రహ లీలను ప్రచురిస్తూ ఎందరికో తమ దినచర్యను మహాస్వామి వారి స్మరణతో ప్రారంభించడానికి సహకరించిన మన కంచి పరమాచార్య వైభవం పుస్తక రూపంలో రావాలని ఎన్నో సంవత్సరాలుగా ఎంతో మంది తపించిన ఫలితం చివరకు నిజమైంది.

పుస్తకం ముద్రణ పూర్తయ్యి, జగద్గురువులు శ్రీ శ్రీ శంకర విజయేంద్ర సరస్వతీ స్వామివారి అమృత హస్తములతో ఆశీస్సులు పొందిన తరువాత కరుణతో వారు శ్రీముఖాన్ని కూడా అనుగ్రహించారు.

బ్రహ్మశ్రీ సామవేదం షణ్ముఖ శర్మ గురుదేవుల తొలిపలుకులతో, బ్రహ్మశ్రీ చాగంటి కోటేశ్వరరావు గారి ముందుమాటతో, ప్రముఖ ఆధ్యాత్మిక ప్రవాచాకులు నండూరి శ్రీనివాస్ గారి పరిచయ వాక్యాలతో ఈ పుస్తకం పరిపూర్ణమైంది. ఈ పుస్తకం అవిముక్త వారణాసి క్షేత్రంలో పరమ పవిత్రమైన కార్తీక మాసంలో శ్రీ సామవేదం షణ్ముఖ శర్మ గురువు గారిచే ఆవిష్కరింపబడింది.

పుస్తకము, ప్రసాదము అనాయాచితంగా వస్తే దానికి విలువ ఉండదు కాబట్టి వెలకట్టలేని ఈ పుస్తకానికి 175/- ల వెలను నిర్ణయించడమైనది.

పుస్తకాలు కావాల్సిన వారు మాకు వాట్సాప్ (7259859202) చెయ్యగలరు

ట్రస్టు బ్యాంకు అకౌంటు వివరాలు

A/C Name: Kanchi Paramacharya Dharmika Seva Trust
A/C. Num: 50200059599164
IFSC Code: HDFC0001753
A/C Branch: Kanakapura Road, Bengaluru

అపార కరుణాసింధుం జ్ఞానదం శాంతరూపిణం
శ్రీ చంద్రశేఖర గురుం ప్రణమామి ముదావహం ।।

#KanchiParamacharyaVaibhavam #కంచిపరమాచార్యవైభవం

కంచి పరమాచార్య ధార్మిక సేవా ట్రస్ట్ (రి)

15 Nov, 00:42


ధర్మ రక్షణ - దేశ రక్షణ

ముఖ్యంగా స్వాతంత్ర్యం వచ్చిన సమయంలో ఉన్న పరిస్థితులు ఎలాంటివి అంటే, మొట్టమొదట స్వాతంత్ర్యోద్యమాలు స్వామి వివేకానంద స్ఫూర్తితో ఉద్భవించినప్పుడు “సనాతన ధర్మంతో కూడిన అచ్చమైన భారత దేశాన్ని” రక్షించుకోవాలనే తపనే ఆనాడు ఉన్న మహాత్ములది. కాని తరువాత తరువాత స్వాతంత్ర్యోద్యమం ధర్మమయమైన దేశాన్ని సాధించడం అనేటువంటి మూర్తిని విడిచిపెట్టి మరొక రూపం తీసుకుంది.

అది కేవలం రాజకీయ ఉద్యమంగా మారిపోయింది. “ఈ రాజకీయోద్యమం ఇలాగే కొనసాగి కాని మనకు స్వాతంత్ర్యం సిద్ధిస్తే, మన ధర్మం ఏమవుతుంది” అని ఆలోచించిన వాళ్ళు ఈ స్వాతంత్ర్యోద్యమ సమయానికి కొద్దిమంది మాత్రమే ఉన్నారు. గట్టి సంఖ్యలో చెప్పుకోలేము. అందులో యతీశ్వరులు మహాత్ములు మా పీఠాలేమైపోతాయో అని బాధపడేవాళ్ళే చాలామందున్నారు కాని, స్వాతంత్ర్యం సిద్ధిస్తే ఈ సనాతన ధర్మం ఏమౌతుంది? ఎటువంటి రాజ్యాంగం తయారవుతుంది? ఎందుకంటే రాజకీయ పరమైనటువంటి వాతావరణమే తప్ప ధార్మికమైన వాతావరణం లేదు. అలాంటి స్థితిలో ఈ దేశంలో ఈ సనాతాన హైందవ ధర్మం రక్షింపబడాలి అనే తపన పడ్డటువంటి ఏకైక ఆచార్యులు శ్రీ శ్రీ శ్రీ చంద్రశేఖరేంద్ర సరస్వతి స్వామివారు.

మహిమలు చూపే విషయములే కాకుండా ధర్మరక్షణకు వారు చేసినవే మనం తెలుసుకోవలసింది. ఇది చాలా స్ఫూర్తి. అసలు దేశభక్తి లేనివారికి దైవభక్తి లేనట్టే లెక్క. ఒకవేళ దైవభక్తి ఏదైనా ఉంటే, వాడిల్లు వాడి కుటుంబం క్షేమంగా ఉండడం కోసం చూసిన భక్తియే తప్ప ఇక ఏది లాభం లేదు దానివల్ల. అందుకు ప్రధానంగా ఈ దేశం క్షేమంగా ఉండాలి. ధర్మం క్షేమంగా ఉండాలని ముందు కోరుకోవాలి. ఎలాగైతే మన ఇంట్లో ఉన్న మనం నేను క్షేమంగా ఉండాలి అని ఎంత కోరుకుంటామో నా ఇల్లు క్షేమంగా ఉండాలని అంతే కోరుకోవాలి.

లేకపోతే మీ జపం మీరు చేస్తుంటే మీ ఇంటి పైకప్పు ఊడి నెత్తిమీద పడితే, ఎవడు రక్ష. అందుకు మన జపం మనకు సాగుతున్నా, మన ఇల్లంతా బాగుండాలని ఎలా అనుకుంటామో, ఈ దేశమంతా ధర్మమంతా బాగుండాలని కోరుకోవాలి. అందుకే వయుక్తిక మోక్షం కోసం సాధన చేయడం ఎంత అవసరమో, సామాజికమైన దేశ క్షేమం కోసం సాధన చెయ్యడం అంత అవసరం.

అందులో పీఠాధిపతి వ్యవస్థని ఆదిశంకర భగవత్పాదులు వారు ఆ కారణం చేతనే ఏర్పాటు చేశారు. నాలుగు వైపుల్నుంచి కూడాను భారతదేశాన్ని రక్షించడం కోసమే ఆయన పీఠములను ప్రతిష్టాపన చేశారిక్కడ. అటువంటి శంకరుల హృదయం తెలిసినటువంటి శంకరులు మళ్ళి అవతరించిన శంకరులు. మాకనిపిస్తుంది కేవలం ముప్పైరెండేళ్ళు ఉండి చెయ్యాల్సిందంతా చేసి నేను వెళ్ళిపోయాను.

కాని కలి ముదిరిపోతోంది. ముప్పైరెండేళ్ళ ఉనికి చాలదు. ఒక సంపూర్ణమైన శతవర్ష ఆయుః పరిమితితో కూడిన ఉనికి కావాలి అని అనుకున్న శంకరులు మళ్ళి చంద్రశేకరేంద్ర సరస్వతి స్వామివారిగా అవతరించారు. ఇందులో సందేహం లేదు.

--- బ్రహ్మశ్రీ సామవేదం షణ్ముఖశర్మ గారి ప్రవచనం నుండి

#KanchiParamacharyaVaibhavam #కంచిపరమాచార్యవైభవం

కంచి పరమాచార్య ధార్మిక సేవా ట్రస్ట్ (రి)

14 Nov, 00:25


తండ్రికొడుకులిద్దరూ స్వామి వారికి సాష్టాంగం చేసి నిలబడ్డారు. అచార్యుల మొదటి ప్రశ్న “చంద్రమౌళి బాగా మాట్లాడగలుగుతున్నావు కదా? భేష్ భేష్ అంతా సీతారాముల అనుగ్రహం”

చంద్రమౌళీ వెంటనే బిగ్గరగా “హర హర శంకర జయ జయ శంకర” అని చెప్పడం మొదలుపెట్టాడు. అందరూ నిలబడి అలా చూస్తుండిపోయారు.
కొద్దిసేపటి తరువాత స్వామి వారు మాట్లాడారు “శంకర ఇప్పుడు చెబుతాను విను. చంద్రమౌళికి ఇలా జరగడానికి వేరే ఏ కారణము లేదు. వీడికి సహజంగా సీతారాములపై ప్రేమ భక్తి ఏర్పడింది. వారికి ఏమైనా జరిగితే తట్టుకోలేడు. మొదటి సారి ఉపన్యాసం విన్నప్పుడు శ్రీవత్స జయరామ శర్మ సీతాపహరణం గురించి చెబుతున్నారు కదా శంకరా?”

ఆడిటర్ ఆశ్చర్యముతో నోరెళ్ళబెట్టి నిలబడ్డాడు. “అవును స్వామీ అదే. అదే స్వామీ అదే. ఆరోజు వారు దాని గురించే చాలా ఆర్ద్రతతో ఉపన్యసించారు”

స్వామి వారు మరలా “తను ఎంతగానో భక్తితో ఆరాధించి ప్రేమించే సీతామాతని ఒక రాక్షసుడు ఎత్తుకుని వెళ్ళిపోతుటే తట్టుకోలేక చిన్న మానసిక ఒత్తిడికి గురయ్యి నిస్సహాయుడై మాటలు ఆగిపోయాయి. అంతే మరింకేమి కాదు. కాబట్టి దీనికి పారిష్కారమేమంటే అతని చెవులతో అదే ఉపన్యాసకుని మాటలలో సీతారాములు ఒక్కటయ్యారని వింటే అతని మనస్సు కుదుటపడి అతని మాటలు వస్తాయి. అందుకే నేను అలా చెయ్యమని చెప్పినది. సీతారాముల దయవలన ఇప్పుడు అంతా క్షేమంగా ఉంది. చంద్రమౌళి నువ్వు పరమ క్షేమంగా ఉంటావు” అని అన్నారు.
పరమాచార్య స్వామి వారి మాటలను విన్న అందరూ నిచ్చేష్టులయ్యారు.

--- శ్రీ రమణి అన్న, ‘శక్తి వికటన్’ ప్రచురణ. మార్చి 18, 2007.

అపార కరుణాసింధుం జ్ఞానదం శాంతరూపిణం
శ్రీ చంద్రశేఖర గురుం ప్రణమామి ముదావహం ।।

#KanchiParamacharyaVaibhavam #కంచిపరమాచార్యవైభవం

కంచి పరమాచార్య ధార్మిక సేవా ట్రస్ట్ (రి)

14 Nov, 00:25


మహాస్వామి వారు అతణ్ణి సమాధానపర్చి మృదువచనాలతో “అతణ్ణి అప్పుడప్పుడు మైలాపూర్ లో జరిగే ప్రవచనాలకు తీసుకువెళ్తుంటావా?” అని అడిగారు.
”వెళ్తుంటాడు స్వామీ. అప్పుడప్పుడు నేనే స్వయంగా తీసుకుని వెళ్తుంటాను. వీడి మాట పడిపోక ముందురోజు కూడా నేను వీణ్ణి రసిక రంజన సభలో జరిగే రామాయణ ప్రవచనానికి తీసుకుని వెళ్ళాను. ఆసాంతం చాలా శ్రద్ధగా విన్నాడు. తరువాతి రోజే ఇలా జరిగింది” అని చెప్పాడు.
స్వామివారు నవ్వుతూ “అంటే నీ ఉద్దేశ్యము రామాయణం వినడంవల్లనే ఇలా జరిగిందనా?”

ఆడిటర్ లెంపలేసుకుంటూ “రామ రామ! అలా కాదు స్వామీ. ఆ తరువాతి రోజే ఇలా జరిగింది అని చెప్పానంతే” అని అన్నాడు.
”సరే. ఉపన్యాసం ఎవరు చెప్పారు?”

“శ్రీవత్స జయరామ శర్మ, స్వామీ”

“భేష్ భేష్ సోమదేవ శర్మ కుమారుడు. గొప్ప పండిత వంశం. సరేకాని శంకరా ఇతణ్ణి వైద్యునికి చూపించావా?”

“చూపించాను స్వామీ”

“ఎవరా వైద్యుడు?”

“డాక్టర్ సంజీవి”

“ఏమన్నాడు?”

“అన్ని పరీక్షలు చేసి, ఇతని స్వరపేటిక నరములు రెండు దెబ్బతిన్నాయి. ఆపరేషన్ చేస్తే సరిపోవచ్చు అని చెప్పాడు స్వామీ”

“ఆపరేషన్ తరువాత ఖచ్చితంగా బాగవుతుందని చెప్పలేదా?”

“అతను ఆ హామీ ఇవ్వలేదు స్వామీ. ఎలాగో మీరే వాడికి మాటలు వచ్చేలా చెయ్యలి. కేవలం మీరే చెయ్యగలరు”

పరమాచార్య స్వామివారు కొద్దిసేపు మౌనంగా ఉండి ఇలా చెప్పారు “శంకరా ఒక పనిచెయ్యి, పిల్లాణ్ణి తీసుకుని ఇక్కడి దేవాలయాలన్నీ దర్శించి ప్రార్థించు. ఇక్కడే మఠంలో భోజనం చేసి రాత్రికి ఇక్కడే ఉండు. రేపు ఉదయం నీ స్నానము అనుష్టానము పూర్తి చేసుకొని పది గంటలకు నా వద్దకు రా”.

మాహాస్వామి వారి మాటలు వారిని స్వాంతన పరిచాయి. స్వామివారికి ఇద్దరూ సాష్టాంగం చేసి దేవాలయాల దర్శనానికి బయలుదేరారు.

మరుసటి రోజు ఉదయం పదిగంటలకు ఆడిటర్ పిల్లాణ్ణి తీసుకుని పరమాచార్య స్వామి వారి దర్శనానికి వచ్చారు. శంకర నారాయణన్ స్వామివారికి సాష్టాంగం చేసి నిలబడ్డాడు. స్వామివారు తీక్షాణంగా కొద్దిసేపు చూసి, “శంకరా, ఒక పని చెయ్యి. పిల్లాణ్ణి మైలాపూర్ కపాలీశ్వర స్వామి వారి దేవస్థానానికి తీసుకుని వెళ్ళి, స్వామి అమ్మవార్లకి పూర్ణాభిషేకం చేయించి పిల్లాడితో దర్శనం చేయించు. తరువాత ఏమి చేస్తావంటే శ్రీవత్స జయరామ శర్మ గారి సంపూర్ణ రామాయణ ప్రవచన వివరాలకోసం వేచియుండు. ఎక్కడైనా దేవాలయంలో కాని లేదా స్భామందిరంలో కాని వారి ఉపన్యాసం ఉంటే సుందరాకాండ నుండి సీతారామ పట్టాభిషేకం వరకు నీ కుమారునితో వినిపించు. సీతారామ పట్టాభిషేకతో ఉపన్యాసం ముగిసిన రోజు కొన్ని అరటి పళ్ళు కొని ఆ ఉపన్యాసకుడికి ఇచ్చి వారికి ఇద్దరూ మనసులో పట్టాభిరాముణ్ణి ఉపన్యాసకుడిని ప్రార్థిస్తూ సాష్టాంగం చెయ్యండి. ఆ సీతారాములు మిమ్మల్ని కాపాడుతారు. ఏమి దిగులు పడకండి అంతా మంచే జరుగుతుంది” అని ప్రసాదం ఇచ్చి పంపించారు.
ఆరోజునుండి ఆడిటర్ చెన్నైలో శ్రీవత్స జయరామ శర్మ గారి రామాయణ ప్రవచన వివరాల గురించి వెతుకుతున్నాడు. ఒకరోజు వారు మైలాపూర్ లోని ఒక ఆలయంలో మందిరంలో సంపూర్ణ రామాయణం నవాహం(తొమ్మిది రోజులు) చేస్తున్నట్టు తెలిసివచ్చింది.

ఆరోజే సుందరాకాండ ప్రారంభం. కుమారుణ్ణి వెంటబెట్టుకుని శంకర నారాయణ ఉపన్యాసానికి వెళ్ళాడు. చంద్రమౌళి తనకు కలిగిన బాధను మరికిపోయి మరీ విన్నాడు. కొన్నిసార్లు కన్నులవేంట నీరు కారుస్తుంటే శంకర నారయాణన్ వెన్ను నిమిరి సమాధాన పరిచేవారు.
ఆరోజు రామాయణ ఉపన్యాసం చివరి రోజు. వినడానికి చాలామంది వచ్చారు. దాదాపు పదిన్నర ప్రాంతంలో శ్రీవత్స జయరామ శర్మ గారు శ్రీ సీతారామ పట్టభిషేక ఘట్టంతో ఉపన్యాసాన్ని ముగించారు. ఒకరితరువాత ఒకరు అందరూ వారికి నమస్కరించి వెళ్ళిపోతున్నారు. వీరిద్దరూ కూడా సాష్టాంగం చేసి, శంకర నారాయణన్ చంద్రమౌళికి అరటిపళ్ళు ఇచ్చి శ్రీవత్స జయరామ శర్మ గారికి ఇమ్మన్నారు. తండ్రి చెప్పినట్టు వాటిని ఇచ్చి పిల్లవాడు సాష్టాంగం చేశాడు. వారు ఆనందంతో ఆ పళ్ళు తీసుకుని వెనకున్న శ్రీరామ పట్టాభిషేకం పటానికి సమర్పించి అందులో రెండు పళ్ళను చంద్రమౌళికి ఇచ్చి “బాబు నువ్వు చిరకాలం సంతోషంగా ఉండు. ఈ రెండు పళ్ళు నువ్వు తిను” అని ఆశీర్వదించారు. ఆలయం వెలుపలికి వస్తూ చంద్రమౌళి ఆ రెండు పళ్లను తిన్నాడు.
మరుసటి రోజు ఉదయం ఒక అద్భుతం జరిగింది. పళ్ళుతోముకొని హాల్లోకి వచ్చిన ఆ పిల్లవాడు గట్టిగా తన తల్లితో “అమ్మా కాఫీ రెడియా?” అని అరిచాడు. పేపరు చదువుతున్న వాళ్ల నాన్నగారు ఆశ్చర్యపోయారు. వంతగదిలో ఉన్న వాళ్ళ అమ్మ పరిగెత్తుకుంటూ వచ్చింది. చంద్రమౌళి అక్కడ నవ్వుతూ నిలబడ్దాడు.
”చంద్రమౌళి!!! కాఫీ తయారయ్యిందా అని అరిచినది నువ్వేనా?” అని పిల్లాణ్ణి గట్టిగా హత్తుకుని ఆనందంతో ముద్దుపెట్టుకుంది. శంకర నారాయణన్ ఆ పిల్లాణ్ణి భుజాలపైకెత్తుకుని ఆనందంతో గంతులేసాడు. చంద్రమౌళీ ఎప్పటిలాగే ధారాళంగా మాట్లాడసాగాడు. తెలిసినవారందరూ వచ్చి ఈ వార్త విని సంతోషపడ్దారు.

ఆరోజు సాయంత్రం అయిదున్నర ప్రాంతంలో మహాస్వామి వారు ఏకాంతంలో కూర్చున్నారు. ఎక్కువమంది భక్తులు లేరు. ఆడిటర్ శంకర నారాయణన్ వ్యానులో ఒక పది పదిహేనుమందితో కలిసి వచ్చాడు.

కంచి పరమాచార్య ధార్మిక సేవా ట్రస్ట్ (రి)

14 Nov, 00:25


సీతాపహరణం – స్వరాపహరణం

చాలా సంవత్సరాల క్రితం ఒక సాయంత్రం మహాస్వామి వారి దర్శనార్థమై చలామంది భక్తులు వేచివున్నారు. పరమాచార్య స్వామివారు గదినుండి బయటకు వచ్చి భక్తుల వంక ఒకసారి చూసి, గోడకు ఆనుకుని కూర్చున్నారు. భక్తులందరూ వరుసలో ఒక్కొక్కరుగా వచ్చి, మహాస్వామి వారికి సాష్టాంగం చేసి, వారి కష్టాలను చెప్పుకొని, స్వామి వారు చెప్పిన మాటలు విని ముందుకెళ్తున్నారు. ఒక మధ్యవయస్కుడైన పెద్దమనిషి ఒకరు ఒక పిల్లవాడి చెయ్యి గట్టిగా పట్టుకుని వరుసలో నిలబడి వున్నారు. అతని కళ్ళల్లో నుండి నీరు కారి ఏరులై పారుతోంది. ఆ పిల్లవాడు ఏ చలనము లేక నిలబడ్డాడు.
అతను పరమాచార్య స్వామివారి ముందుకు రాగానే సాష్టాంగం చేసి చేతులు జోడించి నిలబడ్డాడు. ఆ పిల్లవాడు కూడా సాష్టాంగం చేసి నుంచున్నాడు. స్వామి వారు అతణ్ణి పరిశీలనగా చూసి, “ఏమప్పా నువ్వు మైలాపూర్ ఆడిటర్ శంకర నారాయణన్ కదూ? ఎందుకు అంతలా ఏడుస్తున్నావు? ఏమిటి నీ సమస్య?” అని అడిగారు.
పరమాచార్య స్వామివారు అలా అనగానే అతని దుఃఖం కట్టలు తెంచుకుంది. మరలా ఏడుస్తూ, “అవును స్వామీ! భరింపరాని కష్టం వచ్చిపడింది నాకు. ఏమిచేయాలో తెలియటం లేదు. మీరే నా దేవుడు. మీరే ఎలాగో నన్ను కాపాడాలి. నాకు వేరొక దిక్కు లేదు” అని మరలా సాష్టాంగం చేశాడు. పరిస్థితిని అర్థం చేసుకుని పరమాచార్య స్వామివారు వాత్సల్యంతో “అరే శంకరా బాధపడకు. కొద్దిసేపు అక్కడ కూర్చో. అందరూ మాట్లాడి వెళ్ళిపోయిన తరువాత నిన్ను పిలుస్తాను” అని చెప్పి ఒక స్థలం చూపించారు.
“అలాగే చేస్తాను స్వామీ. మీ ఆజ్ఞ” అని ఆయన స్వామి ఎదురుగా కొద్దిదూరంలో కూర్చున్నారు. అరగంట తరువాత అందరూ భక్తులందరూ స్వామివారిని దర్శించుకుని వెళ్ళిపోయారు. స్వామి వారి ఇద్దరు సహాయకులు తప్ప ఎవరూ లేరు. ఆడిటర్ శంకర నారాయణన్ ను రమ్మన్నట్టు సైగ చేసారు. అతను వచ్చి మరలా సాష్టాంగం చేసి నిలబడ్డాడు. మహాస్వామి వారు అతని వంక ఆప్యాయంగా చూస్తూ, “శంకరా! నీ ప్రాక్టీసు బాగా జరుగుతోంది కదా? నువ్వు బాగా పేరుగాంచిన ఆడిటరువి. ప్రాక్టిసు గురించి అడగనవసరం లేదులే. సరే మీ తండ్రి గారు పంచపకేశ అయ్యర్ తంజావూరులో వున్నారు కదూ? బావున్నారు కదా?”

కన్నీళ్ళు తుడుచుకుంటూ ఆడిటర్ స్వామి వారితో “ప్రాక్టిసు బాగా జరుగుతోంది స్వామీ. మా తల్లితండ్రులు బొంబాయిలో ఉన్న నా తమ్ముణ్ణి చూడ్డానికి వెళ్ళారు. రెండు నెలలు అయ్యింది. నాకే ఇప్పుడు కష్టం వచ్చింది. దీన్ని భరించడం నా వల్ల కావట్లేదు. మహాస్వామి వారే నన్ను కాపాడాలి” అని దగ్గరున్న ఆ పిల్లవాడిని కౌగిలించుకుని ఏడ్చేసాడు.
ఆ పిల్లవాని విశయంలోనే ఏదో జరిగి ఉంటుందని మహాస్వామి వారు అర్థం చేసుకున్నారు. మహాస్వామి వారు అతనితో “శంకరా ఏదేమైనా సరే మగవారు ఇలా ఏడువరాదు. సరే ఎవరు ఈ పిల్లవాడు నీ కుమారుడా?” అని అడిగారు.
”అవును స్వామీ నా కుమారుడే. పేరు చంద్రమౌళి. వీడికోసమే స్వామీ నా బాధ. హఠాత్తుగా. . . ” దుఃఖం తన్నుకొస్తుండడంతో ఇంక ఏమి మాట్లాడలేక పోయాడు. మహస్వామి వారు కంగారుగా “శంకరా ఏమి జరిగింది హఠాత్తుగా? చంద్రమౌళి పాఠశాలకు వెళ్తున్నాడా?” అని అడిగి “ఖంగారు పడకుండా ఏమి జరిగిందో సరిగ్గా చెప్పు” అని అన్నారు.
కళ్ళ నీరు తుడుచుకొని, కొద్దిగా స్థిమితపడుతూ, “స్వామీ నా కుమారుడు చంద్రమౌళి మైలాపూర్ లోని పి.యస్.హైస్కూల్ లో ఏడో తరగతి చదువుతున్నాడు. చదువులో చాలా చురుగ్గా ఉంటూ, తరగతిలో ఉత్తమ విద్యార్థిగా ఉన్నాడు. ఇరవై రోజుల క్రితం హఠాత్తుగా తన మాట పడిపోయింది స్వామీ. అడిగితే తను మాట్లాడలేక పోతున్నానని సైగల ద్వారా చెప్తున్నాడు. ఆరోజు నుండి పాఠశాలకు వెళ్ళలేదు. రెండుపూటలా భోజనం చేస్తాడు. చక్కగా నిద్రపోతాడు. అవన్ని బావున్నాయి కాని మాట్లాడలేకపోతున్నాడు. నేనేంచేయగలను? మీరే కరుణించి వీడికి మాటలు ప్రసాదించాలి” కళ్ళ నీరు కారుతుండగా స్వామివారిని ప్రార్థించాడు.
పరమాచార్య స్వామివారు కొద్దిసేపు మౌనంగా వున్నారు. తరువాత ఆడిటరుతో “పిల్లలతో దేవాలయానికి వెళ్తంటారా? చంద్రమౌళికి దేవునిపై భక్తి నమ్మకం ఉన్నాయా?” అని అడిగారు. ”వీడికి చాలా భక్తి ఉంది స్వామీ. ప్రతిరోజు స్నానం చేసిన తరువాత కందషష్టి కవచం, రాముడు ఆంజనేయుడి గురించి కొన్ని శ్లోకాలు చదువుకొని పాఠశాలకు వెళ్తాడు. మా ఇంట్లో కోదందరాముని పెద్ద చిత్రపటం ఉంది. అది మా తాతల కాలంనాటి తంజావూరు చిత్రపటం. రోజూ ఉదయం సాయింత్ర సాష్టాంగం చేసి, సీతారాముల పాదములకు నమస్కారం చేసి కళ్లకద్దుకుంటాడు. “నాకు సీతారాములంటే చలా ఇష్టం అని తరచూ చెప్తుంటాడు”. వారంలో రెండుమూడు రోజులు వాడి తల్లితో కలిసి కపాలీశ్వర, ముందక కన్ని అమ్మణ్, లుజ్ ఆంజనేయ దేవాలయాలకు వెళ్తుంటాడు. ఇంత మంచి పిల్లాడికి ఇలా జరిగింది” అని ఇక తట్టుకోలేక గట్టిగా ఏడ్చేసాడు.

కంచి పరమాచార్య ధార్మిక సేవా ట్రస్ట్ (రి)

13 Nov, 02:05


జయ జయ శంకర !! హర హర శంకర !!

అవిముక్త కాశీ మహాక్షేత్రంలోని ముమక్షు భవన్ లో గత తొమ్మిది రోజులుగా జరుగుతున్న క్రతువులో ఇవాళ సహస్ర లింగేశ్వర ప్రతిష్ఠ మరియు పూర్ణాహుతి కార్యక్రమాలు బ్రాహ్మశ్రీ సామవేదం షణ్ముఖ శర్మ గురువు గారి అమృతహస్తములతో

కంచి పరమాచార్య ధార్మిక సేవా ట్రస్ట్ (రి)

13 Nov, 00:47


https://www.youtube.com/live/x2QNn-Rjis0?si=J531mUZhErbmMDE1

కంచి పరమాచార్య ధార్మిక సేవా ట్రస్ట్ (రి)

13 Nov, 00:32


సముద్రస్నానం - సహాయం

దేవాలయాలను తీర్థాలను దర్శించి సేవించాలని చాలామందికి కోరికగా ఉంటుంది. ఈనాటికి చాలామంది పుణ్యనది స్నానం కొరకు మహామాఖం, కుంభమేళా వంటి ఉత్సవాలకు వేల సంఖ్యలో వస్తుంటారు. తిర్తస్నానం వల్ల మన పాపములు తొలగి మనస్సుకు శాంతి చేకూరుతుంది.

“కేవలం సముద్ర దర్శనమే మహా పుణ్యం“. సాధారణ రోజులలో సముద్ర స్నానం చెయ్యరాదు. అది కేవలం అమావాస్య, పౌర్ణమి, గ్రహణాల వంటి రోజులలో మాత్రమే చెయ్యాలి. కాని రామేశ్వరం, తిరుప్పులని, వేదారణ్యం, ధనుష్కోటి వంటి క్షేత్రములలో సంవత్సరంలో ఎప్పుడైనా సముద్రస్నానం చేసి పుణ్యం ఆర్జించవచ్చు.

ఒకసారి కంచి పరమాచార్య స్వామివారు తమిళనాడు మొత్తంగా విజయయాత్ర చేస్తున్నారు. ఆడి (ఆషాడం) అమావాస్య దగ్గర పడుతుండడంతో వేదారణ్యంలో సముద్ర స్నానం చెయ్యాలని ప్రణాళిక వేశారు. కారణం లేకుండా శ్రీరాముడు ఒక్కమాట కూడా మాట్లాడడు అని ప్రతీతి. అలాగే సన్యాసులు కూడా. అక్కరలేని విషయాలు మాట్లాడడం, నిష్పలమైన పనులు చెయ్యడం అన్నది వారి వద్ద ఉండదు.

మహాస్వామివారు వేదారణ్యం చేరేదారిలో కొన్ని ఊళ్ళల్లో మకాం చేస్తూ యాత్ర సాగిస్తున్నారు. అలా ఒక ఊరిలో, ఆకలిగొన్న వ్యక్తీ ఒకరు స్వామీ దర్శనానికి వచ్చాడు. స్వామివారు మఠం మేనేజరును పిలిచి “అతనికి మంచి ఆహారం పెట్టి, ఒక పంచ ఉత్తరీయం ఇమ్మ”ని ఆదేశించారు. మేనేజరు స్వామివారి ఆదేశాన్ని పాటించి “అతనికి మీరు మీరు చెప్పినవన్ని ఇచ్చాము. పంపెయ్యమంటారా?” అని అడిగారు.

స్వామివారు వెంటనే, “అతణ్ణి మఠ ప్రముఖునిగా చూసుకుంటూ, రాజభోగాలను కల్పించ”మని ఆదేశించారు. మేనేజరుకు ఏమీ అర్థం కాకపోయినా స్వామివారి ఆదేశాన్ని పాటిస్తూ అతణ్ణి యాత్రలో తమతోపాటు ఉండమన్నారు.

“అతనికి భోజనం ఇచ్చారా? బాగా చూసుకున్తున్నారా?” అని మహాస్వామివారు మేనేజరుతో ప్రతిరోజూ అడిగి తెలుసుకునేవారు. రోజులు గడుస్తున్నాయి. హఠాత్తుగా ఒకరోజు అతను మఠానికి తాగి వచ్చాడు. భగవంతుణ్ణి దూషించాడు. మఠ ఉద్యోగులను తిట్టాడు. ఆఖరికి కూడుగుడ్డ ఇచ్చిన పరమాచార్య స్వామిని కూడా తూలనాడాడు. మేనేజరుకు కోపం వచ్చి అతని ప్రవర్తనను మహాస్వామికి విన్నవించారు. “అతణ్ణి పంపెద్దాం పెరియవ” అని స్వామిని అర్థించారు.

స్వామివారు ఏమీ కోప్పడక గట్టిగా నవ్వారు. “స్వామీ! అతణ్ణి పంపెయానా?” అని మేనేజరు మరలా అడిగారు. కాని స్వామివారు అందుకు ఒప్పుకోలేదు.

ఆరోజు ఆడి ఆమావాస్య. స్వామివారు వేదారణ్యంలో సముద్రస్నానం చేయడానికి వస్తున్నారని తెలిసి వేలమంది భక్తులు వచ్చారు. ఆడి అమావాస్య రోజు సముద్ర స్నానం పుణ్యప్రదం. అందునా ‘నడమాడుం దైవం’ పరమాచార్య స్వామితో కలిసి చెయ్యడం అత్యంత పుణ్యప్రదం. దాంతో తీరం అంతా లక్షలాదిమంది భక్తులతో నిండిపోయింది. భక్తితో ఎంతోమంది వృద్ధు మహిళలు కూడా తీరం వెంబడి నిలుచున్నారు.

పరమాచార్య స్వామివారు సముద్రం దగ్గరకు వచ్చారు. అందరూ స్వామివారికి నమస్కరించగా స్వామివారు సముద్రంలోకి నడిచారు. స్వామివారిని అనుసరిస్తూ అక్కడున్న వృద్ధ మహిళలతో పాటు అందరూ లోపలి నడిచారు.

అంతే ఒక్కసారిగా వచ్చిన ప్రచండమైన అలల తాకిడికి ఆ వృద్ధ మహిళలు కొంతమంది సముద్రలోకి కొట్టుకునిపోయారు. అందరూ ఏం చెయ్యాలో పాలుపోక చేష్టలుడిగి నిలుచున్నారు. అంతటి భయంకరమైన అలలను కూడా లెక్క చెయ్యకుండా ఒక వ్యక్తీ వెంటనే సముద్రంలోకి దూకి ఆ ఆడవారిని ఒడ్డుకు లాగి రక్షించాడు. ఆ వ్యక్తీ మరెవరో కాదు. మఠంలో అందరిని ఇబ్బందులు పెడుతున్న ఆ తాగుబోతు.

ఈ సంఘటనను చూడగానే మహాస్వామివారు మేనేజరు వంక తిరిగి ఒక చిన్న నవ్వు నవ్వారు. మేనేజరు పరుగున వచ్చి స్వామివారి పాదాలపై పడ్డాడు.

సన్యాసులు భవిష్యత్తును దర్శించగల దిర్ఘదర్శులు. వారు చేసే ప్రతి క్రియలో కొన్ని వేల కారణాలు/నిజాలు ఉంటాయి. మనం వాటిని లోతుగా పరిశీలిస్తేనే వారి పూర్ణ అనుగ్రహాన్ని పొందగలము.

అపార కరుణాసింధుం జ్ఞానదం శాంతరూపిణం
శ్రీ చంద్రశేఖర గురుం ప్రణమామి ముదావహం ।।

#KanchiParamacharyaVaibhavam #కంచిపరమాచార్యవైభవం

కంచి పరమాచార్య ధార్మిక సేవా ట్రస్ట్ (రి)

12 Nov, 00:33


--- డా. వారణాసి రామమూర్తి ‘రేణు’

అపార కరుణాసింధుం జ్ఞానదం శాంతరూపిణం
శ్రీ చంద్రశేఖర గురుం ప్రణమామి ముదాన్వహం ।।

#KanchiParamacharyaVaibhavam #కంచిపరమాచార్యవైభవం

కంచి పరమాచార్య ధార్మిక సేవా ట్రస్ట్ (రి)

12 Nov, 00:33


కరుణావరుణాలయులు

శ్రీ కంచికామకోటి గురుచరణులు శ్రీ చంద్రశేఖరేంద్ర సరస్వతి స్వామిపాదులు జంగమ తీర్థ చక్రవర్తి. శ్రీవారి చరణ స్పర్శ భూమిలోని అణువణువును పవిత్రతీర్థం కావిస్తుంది. వారు సర్వజ్ఞులు, సర్వసములు, సర్వసులభులు. ఈ మాటలు అతిశయోక్తులు కావు. స్వామివారి చరణాల వద్ద నేను పొందిన ఎన్నో మధురానుభూతుల ఆధారంతో ఈ మాటలంటున్నాను. వానిలో ఒకటిరెండు అనుభవాలు నివేదిస్తాను.

శ్రీచరణులు మఠంతో హైదరాబాదు దయచేసిన సందర్భంలో దాదాపు నాలుగైదు నెలలు వారి దర్శన సేవాభాగ్యాలు అనుభవించిన వాళ్ళల్లో నేనొకడను. ఆ సమయాన శ్రీవారు అందరినివలె నన్ను కూడా అనుగ్రహించారు. పర్యటనానంతరం కంచి తిరిగివెళ్ళిన తరువాత నేనప్పుడప్పుడు వారి దర్శన్ననికి కంచి వెళ్తుండేవాడిని. వెళ్ళినప్పుడల్లా ఏదో ఒక వ్యాసం, ఎవరో ఒక భక్తుని గురించి గాని, క్షేత్రాన్ని గురించిగాని వ్రాసి తీసుకువెళ్ళేవాడిని. దానిని శ్రీవారికి వినిపించి వారి ఆమోదముద్ర వేయించుకొని పత్రికలకు పంపేవాడిని.

అలాగే ఓ పర్యాయం శ్రీ సదాశివబ్రహ్మేంద్ర సరస్వతీస్వాముల జీవితవిశేషాలతో ఒక వ్యాసం వ్రాసి వారికి నివేదించడానికి బయలుదేరాను. మద్రాసు నుండి బస్సులో కాంచీపురానికి వెళ్తున్నాను. దారిలో నా మనస్సులో ఒక అసంతృప్తి ఆలోచన ప్రారంభమయ్యాయి. ఆరోజుల్లో శ్రీవారు శివస్థానమనే చోట కంచిలో ఉండేవారు. ఆలయం పక్కనే ఒక కుటీరంలో ఏకాంతంగా మౌనవ్రతం పాటిస్తున్నారు. కుటీరానికి చుట్టూ తడకలు కట్టి ఉన్నాయి. దర్శనార్ధులకు కిటికీచువ్వల గుండా కాని, కుటీరానికి వెనుకభాగాన గల బావి వద్ద లోతట్టుగా నిలబడి కాని స్వామి దర్శనం ఇచ్చేవారు. అందుచేత శ్రీవారి ఊర్ధ్వకాయదర్శనమే తప్ప పాద దర్శనం లభించేది కాదు.

బస్సులో పోతూ నాలో నేనిలా అనుకుంటూ ప్రయాణం చేశాను. ‘శ్రీచరణుల పాద దర్శనం చేసి చాలా రోజులైంది. ఇంతకుముందు వచ్చినప్పుడు కూడా బావి వెనుక నిలబడినందున శ్రీవారి చరణ దర్శనం కాలేదు. ఈ పర్యాయం కూడా అక్కడనిలబడే దర్శనమిస్తారో లేక బయటకి వచ్చి నఖశిఖ పర్యంతం దర్శించే భాగ్యం కలగజేస్తారో! ఏమో నా అదృష్టం ఎలా ఉందో! వారి చరణసౌభాగ్యం దర్శించే అనుగ్రహం చేయకూడదా? ఏమో వారి దయ! నా భాగ్యం’.

ఇలా మనసులో బాధపడుతూ కంచి చేరుకున్నాను. శ్రీవరదరాజస్వామి కోవెల వద్ద బస్సుదిగి శివస్థానానికి వెళ్ళాను. సాయింత్రం అయిదున్నర గంటలయింది. శ్రీవారు తమ కుటీరం చుట్టూ ఉన్న ప్రహరీ గోడ పైనుంచి బయటచేరిన భక్తులకు దర్శనం ఇస్తున్నారు. వారి ముఖారవిందం మాత్రమే కనబడుతోంది. నేను ఊరు, పేరు చెప్పుకుని నేలమీద సాష్టాంగ పడ్దాను. ‘రేణు’ ’హైదరాబాదు’ అని విన్నంతనే ఆ దయామయుని ముఖం వికసించి మందహాసంతో అభయహస్తం అనుగ్రహించారు.

శ్రీ సదాశివబ్రహ్మేంద్రులపై ఒక వ్యాసం వ్రాసి తెచ్చాననీ, ఆ సందర్భంగా విషయ సేకరణకై పుదుక్కోట తంజావూరు ప్రాంతాల్లొ పర్యటించాననీ, దానిని చిత్తగించి శ్రీవారు ఆశీర్వదించాలనీ అర్థించాను. నా కోర్కెకు ఆమోదం తెలిపి ఒక అరగంట కాలంలో వచ్చిన భక్తులందరును ఆశీర్వదించి పంపి, ఆరుగంటలకు బావివద్ద లోతట్టున బల్లపై కూర్చొని నాకు కబురు పంపారు. నేను బావికి ఇవతల సాష్టాంగప్రణామం చేసి నిలిచాను. బావిపైన ఒక ఇనుపవల వేసి ఉంది. అప్పటికి సందె చీకటి ప్రారంభమైంది.

శ్రీచరణులు నన్ను చదవమని మౌనంతోనే సంజ్ఞ చేస్తూ పక్కనే ఉన్న బ్రహ్మచారిని టార్చిలైటు వేయమని సంకేతం చేశారు. నేను చదవడం ప్రారంభించాను. ఎత్తుగడలో భారతదేశం మహిమాన్వితులైన సాధుపుంగవులకూ, భక్త గాయకులకూ ఎందరికో పుట్టినిల్లని చెబుతూ, అలాంటి సాధుమహాత్ముల కొందరి పేర్లు చదివాను. ఆ వాక్యం పూర్తికాగానే హస్త సంజ్ఞతో నన్ను ఆగమని ‘ఎవరో ఫలనా భక్తుని వదిలేశావే!’ అన్నట్టుగా నా వంక చూసారు.

మందబుద్ధినైన నేను వారి సంకేతం గ్రహించలేక, ఆ భక్తుడేవరో సెలవివ్వమని అర్థించాను. మౌనవ్రతానికి భంగం లేకుండా సంజ్ఞలతోనే నాకు భక్తుని పేరు తెలియబరచడానికి శ్రీఎవరెంతో ప్రయత్నించారు. అయితే వారి సంకేతాలేవీ నా బుర్రలోకి ఎక్కలేదు. అంతటితో విసుగు కలిగినట్టుగా నటిస్తూ, తమ రెండు చేతుల బొటన వ్రేళ్ళూ మడిచి ఎనిమిదివేళ్ళూ చూపారు. “చిత్తం స్వామీ! ఎనిమిది!” అన్నాను. వెంతనే కూర్చున్న పళంగా తమ ఎడమపాదము పైకెత్తి నాకు చూపారు. అప్పటికి నాకు వారి ఆంతర్యం బోధపడి “ఆ! స్వామి! ఎనిమిది, పాదం, ఎనిమిది పాదాలు, అష్టపాదాలు, అష్టపదులు! ఆ జయదేవులా?” అని పెద్దగా అన్నాను.

శ్రీవారు మందహాసంతో అవునన్నారు. నిజమే! నేనిచ్చిన పేర్లలో గీతగోవిందకర్త జయదేవుని పేరులేదు. అంతేకాదు ఇంకెందరి పేర్లో కూడా లేవు. ఇత్యాదులు అంటూ అందర్నీ కలిపాను. అయితే ఇందులో శ్రీవారు ఒక్క జయదేవులను నాకు గుర్తుచేయడంలోనే వారి అపారమైన కరుణ వాత్సల్యాలు పెనవేసుకొన్నాయి.

మద్రాసులో నుంచి బస్సులో వస్తూ, శ్రీవారి చరణదర్శనం ప్రాప్తించదేమో అని నేను పడిన మానసిక సంతాపాన్ని ఆ సర్వజ్ఞమూర్తి గుర్తించి, జయదేవ కవి వ్యాజాన, అష్తపదుల నెపంతో తమ సంపూర్ణమైన, సర్వశుభలక్షణ లక్షితమైన శ్రీ చరణతల దర్శనం అనుగ్రహించి న న్నానందపరిచారు! శ్రీచరణులు సర్వజ్ఞతకూ, సర్వాంతర్యామిత్వానికి, భక్తవాత్సల్యానికి ఈ ఘట్టం చక్కని తార్కాణం.