తెలుగు కథలు Telugu Stories

@telugu_kadhalu


తెలుగు కథలు, Telugu Stories.....

తెలుగు కథలు Telugu Stories

20 Oct, 16:59


ప్రసాదం - పరమార్థం

అది 1993లో నంగనల్లూర్ లో ఆంజనేయ స్వామీ దేవస్థానం ప్రారంభం చేస్తున్న సందర్భం. దేవాలయం నిర్మాణ పనులు త్వరితగతిన జరుగుతున్నాయి. చాలామంది భక్తులు కూడా వస్తున్నారు. ఒకరోజు నేను పరమాచార్య స్వామివారి ఆశిస్సుల కొరకు వెళ్లాను. స్వామికి సాష్టాంగం చేసి నమస్కరించాను. మహాస్వామివారు ఆశీర్వదించి నాతొ ఇలా అన్నారు, “ఇక్కడకు వచ్చే చాలా మంది భక్తుల ద్వారా విన్నాను దేవాలయానికి భక్తులు ఎక్కువగా వస్తున్నారు అని. చాలా పెద్ద విగ్రహం కదా స్వామివారి ఆకర్షణ శక్తి కూడా చాలా ఎక్కువగానే ఉన్నట్టుంది”.

నన్ను ఆశీర్వదించి ఎంతో వాత్సల్యంతో, “ఆయన చాలా పెద్ద స్వామీ కదా! మరి ఎక్కువ ప్రసాదం నివేదన చెయ్యాల్సి పడుతుంది కదా?” అని అడిగారు. నేను వెంటనే, “ఒక పెద్ద సంచి బియ్యాన్ని వండి నివేదన చేస్తున్నాము పెరియవ” అని బదులిచ్చాను.

“ఉత్తి అన్నం మాత్రమేనా?”

“లేదు పెరియవ చిత్రాన్నాలు వంటివి చేసి నివేదిస్తాము”

“నివేదనకు ఏమేమి తయారు చేస్తుంటారు?”

“ఉదయం నుండి చాలా రకాలు తయారు చేస్తుంటాము. వెణ్ పొంగల్, బెల్లం పొంగల్, పులిహోర, మిరియాల అన్నం, పెరుగన్నం అలా వరుసగా చేస్తుంటాము పెరియవ”

“మరి వీటికోసం చాలా మంది భక్తులు వస్తుంటారు కదా!”

కొంచం గర్వంతో, “ప్రతిరోజూ చాలా ఎక్కువ మంది భక్తులు వస్తారు. ప్రసాదాలు ఏవీ మిగలవు” అన్నాను.

మహాస్వామి వారు కొద్దిసేపు మౌనంగా ఉన్నారు. “ప్రసాదాలు కొద్ది కొద్దిగా ఇస్తారా, ఎక్కువ మొత్తంలో ఇస్తారా?” అని అడిగారు స్వామీ.

అతిశయించిన గర్వంతో, “ఒక పెద్ద ఆకులో ఎక్కువ ప్రసాదం ఇస్తాము పెరియవ” అని అన్నాను.

“ఇక్కడకు వచ్చే వారి వద్ద నేను ఈ విషయం విన్నాను. నిన్ను ఒక విషయం అడగదలచుకున్నాను. ప్రసాదాన్ని ప్రసాదం లాగా కొద్దిగా ఇవ్వాలా? లేక భిజనం లాగా ఎక్కువ ఇవ్వాలా?” అని ఆత్రుతతో అడిగారు.

ఏమని సమాధానం చెప్పాలో తెలియక నిలబడ్డాను.

మహాస్వామివారు నవ్వుతూ, “ఎందుకు అలా స్థాణువులా నిలబడిపోయావు? కేవలం నేను తెలుసుకోవడానికే నిన్ను ఈ ప్రశ్న అడుగుతున్నాను” అని అన్నారు.

కొద్దిగా సంశయిస్తూ వినయంగా, “లేదు పెరియవ. భక్తులు ఎంతో దూరం నుండి ఇక్కడకు వస్తారు. బహుశా వారికి ఆకలిగా ఉంటుంది కాబట్టి వారికి ఎక్కువ మొత్తంలో ప్రసాదాన్ని . . . ” అని ఇంకా నేను ముగించకుండానే, స్వామివారు “నువ్వు ఏమి ఆలోచిస్తున్నావో నాకు అర్థం అవుతుంది. కాని నా ఉద్దేశ్యం ప్రసాదాన్ని ప్రసాదం లాగా తక్కువ మోతాదులో ఇవ్వాలి. ఆకలిగొన్న వారిని కూర్చుండబెట్టి వేరేగా భోజనం పెట్టాలి” అని “మన వేదాలు, శాస్త్రాల్లో ఎన్నో చెయ్యవలసినవి, చెయ్యకూడనివి నిర్దేశించబడి ఉన్నాయి. కొన్ని కేవలం మన స్వియానుభావం వల్ల మాత్రమే అర్థం అవుతాయి” అని ఇతమిత్తంగా ఏమి చెప్పకపోవడంతో, అర్థం కాక, “నాకు ఈ విషయం అర్థం కాలేదు పెరియవ. ఏది సరైనది? ప్రసాదం కొంచం ఇవ్వాలా? ఎక్కువ ఇవ్వాలా? ఈ విషయంలో నాకు సహాయపడవలసింది” అని అడిగాను.

“లేదు, లేదు ఈ విషయంలో సరైనది ఏది అని నీకు అనుభవంలోకి వస్తుంది. అప్పటి దాకా ఓపికగా ఉండు” అని నన్ను ఆశీర్వదించి పంపారు.

ఇప్పుడు నేను పాండిచెర్రి నుండి దిండివనం వెళ్ళే దారిలో ఉన్న పంచవటిలో ఒక దేవాలయం నిర్మిస్తున్నాను. అది ముప్పైఆరు అడుగుల పంచముఖ ఆంజనేయ స్వామీ ఆలయం. నిర్మాణం పనులు జరుగుతున్నాయి ఇప్పుడు. ఇక్కడ కూడా పెద్ద ఆకుల్లో ఎక్కువ ప్రసాదం ఇవ్వడం ఆనవాయితీ. కొన్నిసార్లు నేనే యా ప్రసాద వితరణ చేస్తుంటాను. ఇటివల ఒకరోజు ఎప్పటిలాగే ఒక ఆకులో కదంబం (సాబారు అన్నం) మరొక ఆకులో పెరుగన్నం పెద్దమొత్తంలో ఇస్తున్నాము. అక్కడే కూర్చుని తింటున్న కొద్దిమంది నా వద్దకు వచ్చారు.

అందులో ఒకరు చాలా నిష్టూరంగా నాతో, “మీరు సాంబార్ అన్నం, పెరుగన్నం ఎక్కువ ఎక్కువ ఇస్తున్నారు బావుంది. రుచిగా కూడా ఉంది. కాని మీకు ఒక సలహా ఇవ్వాలి అని ఉంది. సాంబార్ అన్నానికి నంచుకోవడానికి పోరియల్, పెరుగన్నానికి తోడుగా కారం ఊరగాయ(ఆవకాయ) ఇస్తే బావుంటుంది”

ఆ మాటలు విని నేను నిశ్చేష్టుణ్ణి అయ్యాను. 1993లొ పరమాచార్య స్వామివారి మాటలు ఒక్కసారిగా గుర్తువచ్చాయి.

“లేదు, లేదు ఈ విషయంలో సరైనది ఏది అని నీకు అనుభవంలోకి వస్తుంది. అప్పటి దాకా ఓపికగా ఉండు”

స్వానుభవంతో ఇప్పుడు నాకు నిజం అవగతమైంది. ప్రసాదాన్ని ప్రసాదం లాగా కొద్దిగానే ఇవ్వాలి అని

--- శ్రీ రమణి అన్న, “మహా పెరియవర్” నుండి

#KanchiParamacharyaVaibhavam #కంచిపరమాచార్యవైభవం

తెలుగు కథలు Telugu Stories

20 Oct, 16:59


Photo from perkacm

తెలుగు కథలు Telugu Stories

20 Oct, 16:59


ప్రజల్లో తరచూ లోపించేది వైరాగ్యం. దానికి కారణం వివేకం లేకపోవడమే. ఏదైనా ఉపద్రవం వలన వైరాగ్యం రావచ్చు కానీ అది తాత్కాలికమే. వివేకం వలన జనించిన వైరాగ్యం మాత్రమే శాశ్వతం. జ్వలిస్తున్న వైరాగ్యం యొక్క ప్రాముఖ్యతను నొక్కి చెప్పడం కుదరని పని. మనసును నియంత్రించడంలో జనులు ఎదుర్కొనే ఇబ్బందుల్లో చాలావరకు వైరాగ్యం కోసమేనని చెప్పడంలో ఎటువంటి దోషం లేదు.

శ్రీ శ్రీ శ్రీ అభినవ విద్యాతీర్ధ స్వామివారు

తెలుగు కథలు Telugu Stories

20 Oct, 16:56


వ్యాధి - వారి దృష్టి

1964లో నా రెండవ కుమారుడు మురళీధరకు ఊపిరి తిత్తులకు సంబంధించిన వ్యాధి కనిపించింది. విజయవాడలో, గుంటూరులో పేరుగల వైద్యులను సంప్రదించాము. వారు ఎక్స్రే ఫోటోలు తీసి, పరీక్ష చేసారు. శస్త్రచికిత్స అవసరం అన్నారు. రాయవెల్లూరు మిషన్ ఆసుపత్రిలో పనిచేస్తున్న డాక్టర్ గోపినాథ్ ఈ వ్యాధికి సంబంధించిన శస్త్రచికిత్సలో చాలా నిపుణుడనీ, ఆయనచేత ఆపరేషన్ చేయించ వలసిందని కూడా సలహా ఇచ్చారు.

మురళిని మద్రాసుకు వెంటబెట్టుకు వెళ్ళి ఆకాడ డాక్టరుతో సంప్రదించాను. వారుకోడా ఆపరేషన్ అవసరమేనన్నారు. అదైనా, అరునెలలు దాటకుండా, ఆ గడువులోపల చేయవలసిందని సలహా చెప్పారు. నాకు ఆప్తమిత్రులైన ఒకరిద్దరు వైద్యులు ‘ఈ అపరేషన్ అంత ప్రమాదరహితం కాదనీ, ఇతరవిధాల నివారణోపాయం ఏదైనా సాధ్యమయ్యేట్టయితే దాని అనుసరించడం మంచిద’ని సూచించారు.

సందిగ్ధంలో పడ్డాను.

ఇన్నిచోట్ల, ఇంతమంది డాక్టరులు ఆపరేషన్ అవసరమని ఏకగ్రీవంగా అభిప్రాయం వెలిబుచ్చిన తరువాత, వారి సలహా త్రోసివెయ్యడం సాధ్యమా? శ్రేయస్కరమా? అయితే గత్యంతరం?

భగవంతుడి మీద భారంవేసి, రాయవెల్లూరు వెళ్ళాము. డాక్టరు గోపీనాథ్ ను సంప్రదించాము. ఆయన జాగ్రత్తగా పరీక్ష చేసి, ఆపరేషన్ అవసరమేనని, మార్గాంతర6 లేదని తేల్చిచెప్పారు.

కొద్దిరోజులలో డాక్టరు గోపీనాథ్ రాయవెల్లూరు ఆస్పత్రి వదిలిపెట్టి, ఢిల్లీ వెళుతున్నాడు. వెంటనే కాకపోతే, ఆరునెలలు మించకుండా ఢిల్లీకి రావలసిందని కూడా సలహా ఇచ్చాడు.

తుదకు, ఆపరేషన్ వయిదా వెయ్యకుండా రాయవెల్లూరులోనే, గోపీనాథ్ చేతనే ఆపరేషన్ చేయించుకోవడానికి నిశ్చయం చేసుకున్నాము. అవసరమైన ఏర్పాట్లన్నీ చేశాము.

అయితే ఆపరేషన్ చేయించుకునే ముందు కంచికి వెళ్ళి, శ్రీ చంద్రశేఖరేంద్ర సరస్వతి స్వామిని దర్శించి, వారి ఆశీస్సును పొంది రావాలనుకున్నాను. వెంటనే కారులో నేనూ, నా కుమారుడు రాయవెల్లూరు నుంచి కంచికి బయలుదేరాము. కంచి చేరేసరికి సాయింకాలమైంది.

స్వామి మఠంలో లేరు. సర్వతీర్థం సమీపాన ప్రత్యేకంగా ఒక పాకలో ఉంటున్నారు. మేము సర్వతీర్థం వెళ్ళేసరికి మసకమసగ్గా ఉంది. అనుష్ఠానాదులు ముగించుకుని స్వామి అప్పుడే పాకలో ప్రవేశించబోతున్నారు. స్వామి వెంట ఇద్దరు శిష్యులున్నారు. శిష్యుల ద్వారా మా రాక స్వామికి ఎరిగించాను.

ద్వారం తెరిచి లోపలికి వెళ్ళబోతున్నవారల్లా ఆగి, మావైపు తిరిగి, “ఏమిటి విశేషం” అన్నారు.

నా రెండవ కుమారుడు మురళీధరకు జబ్బు చేసిందని, శస్త్ర చికిత్సకై రాయవెల్లూరు ఆసుపత్రికి వచ్చామని, ఆపరేషన్ కు ముందు తమ ఆశీర్వాదం కోసం కంచి వచ్చామనీ విన్నవించాను.

”ఏమిటి జబ్బు” అని అడిగారు.

”ఊపిరి తిత్తులకు సంబధించిన వ్యాధి. ‘బ్రాంక్రియాక్టాసిస్’ అంటారు. ఊపిరితిత్తులలో ఎడమ వైపు మచ్చ కనిపించింది ఎక్స్రే తీస్తే” అని అన్నాను.

నకనకలాడే లాంతరు వెలుగులో, ఆ దూరాన్నించే మురళి వక్షస్థలం వైపు చూశారు స్వామి.

“జబ్బు ప్రమాదకరమైనదే అయినా, భయపడవలసిన అవసరం లేదు. ఆపరేషన్ వద్దు. మఠానికి వెళ్ళి ప్రసాదం పుచ్చుకుని, ఇంటికి వెళ్ళండి” అన్నారు. బ్రహ్మదేవుడు ఆయుర్ధాయం పొడిగించాడు! ఇద్దరం స్వామికి సాగిలపడి, సెలవు పుచ్చుకుని, మఠంలో ప్రసాదం స్వీకరించి, రాయవెల్లూరు వెళ్ళి గోపీనాథ్ తో, ఆపరేషన్ వాయిదా వేస్తున్నామని చెప్పి, మద్రాసు మీదుగా విజయవాడ చేరాము.

ఇది జరిగి నేటికి(1990) 26 ఏండ్లు గడిచాయి. ప్రధాన ఆంగ్లపత్రికలో ఈ చిరంజీవి పాత్రికేయుడిగా పేరుగడించాడు. అతని వయస్సు ఇప్పుడు 54 సంవత్సరాలు. నైష్ఠిక బ్రహ్మచారి. ఇంతవరకూ మళ్ళా, ఊపిరితిత్తులకు సంబంధించిన వ్యాధి ఏమిటో ఎరగడు.

--- నీలంరాజు వెంకటశేషయ్య గారి "నడిచే దేవుడు" పుస్తక సౌజన్యంతో

అపార కరుణాసింధుం జ్ఞానదం శాంతరూపిణం
శ్రీ చంద్రశేఖర గురుం ప్రణమామి ముదాన్వహం ।।

#KanchiParamacharyaVaibhavam #కంచిపరమాచార్యవైభవం

తెలుగు కథలు Telugu Stories

20 Oct, 16:56


Photo from perkacm

తెలుగు కథలు Telugu Stories

20 Oct, 16:56


పూర్వ జన్మల ప్రారబ్ధం వల్ల కలిగే కష్టసుఖములనే ఫలితాలను ఇప్పడు చేసే కొన్ని ప్రయత్నముల వల్ల నివారించవచ్చు. మొదట్లో ఫలించనంత మాత్రమున ప్రయత్నమును విడువకండి. ప్రయత్నముతో చివరికి విజయం లభిస్తుంది

--- శ్రీశ్రీశ్రీ భారతితీర్థ మహాస్వామి

#SringeriJagadguruVaibhavam #శృంగేరిజగద్గురువైభవం

తెలుగు కథలు Telugu Stories

20 Oct, 16:46


అద్వైతం - అణుశాస్త్రం

మనకంటే వేఋఒకటి భావించనపుడే అద్వైతజ్ఞానం పట్టుబడుతుంది. ఒక తేలు, ఒక పాము మనలను కుట్టో కరిచో బాధపెడతాయి. మనమేవాటిగా మారినపుడు తమను తాము కుట్టిచంపుతాయా? అందరిలో నేన్నున్నాననే తీవ్ర భావన లేదా ఎరుక కలిగినపుడు అంతా ఆనంద స్వరూపంగానే కనిపిస్తుంది. అదే మోక్షం దేహం నశించిన తరువాతనో, ఏదో లోకంలోనో అనుభవించడం కాదు. ఈ జన్మలోనే, ఇప్పుడే అనుభవించదగిందని అద్వైతం చెబుతుంది.

అంతా ఒకటని ఎట్లా చెబుతారు? భిన్నభిన్నవస్తువులను చూస్తున్నాము కదా! మనం చూసేదైనా సత్యంకావాలి, లేదా వేదాంతులు చెప్పేదైనా సత్యంకావాలి కదా! ఏది సత్యం?

ఏది సత్యమైందో, అది అఖండానందాన్ని శాంతిని, తృప్తిని ప్రసాదిస్తుంది. మన మామూలు జీవితంలో ఇవి కనపడతాయా? మనం కలలో చాలా వాటిని చూస్తాం. మెలకువ వచ్చినప్పుడు ఇవన్నీ ఉన్నాయా? మేల్కొన్నవాడొక్కడే ఉన్నాడు. అట్లాగే ఈ ప్రపంచాన్ని ఒక కలగా భావిస్తాడు జ్ఞాని.

ఆధునిక శాస్త్రం కూడా భిన్నభిన్నంగా ప్రపంచం కనపడినా ఒకటేఅట్లా కన్పిస్తోందని అంటోంది. కొన్ని భిన్నమూల పదార్థాలవల్ల ప్రపంచం ఏర్పడిందని, చాలా కాలం వెనుక నిర్ధారించారు. కాని నేడు అన్ని మూలపదార్థాలతోను ఒకే ఒక శక్తి ఉందని నిర్ధారిస్తున్నారు. పదార్థము, శక్తి ఒక్కటే అని నిర్ధారించారు. కనుక ఏది వేదాంతం చెప్పిందో దానినే నేటి సైన్సు ఋజువుచేస్తోంది. ఐన్ స్టైన్, సర్ జేమ్సు జీన్సు వంటి మేధావులు అద్వైతానికి చేరువగా వస్తున్నారు.

పదార్థం మిథ్య అని అద్వైతులంటే ఏ అర్థంతో వాడారు? అది వ్యవహారిక సత్యమనే అభిప్రాయంలోనే, బ్రహ్మమే విశ్వోత్తీర్ణమైనదని అనగా విశ్వాతీతమని కనబడే ఈ ప్రపంచం ఈ క్షణంలో ఉండి మార్పు చెందదనే అర్థంలోనే వాడారు అద్వైతులు. దానినే శాస్త్రజ్ఞలు ప్రపంచం సాపేక్షికమైనదని నిత్యసత్యము కాదని వ్యాఖ్యానించారు.

అట్లా చెప్పినవారే అణుబాంబులు తయారుచేయడం చాలా దురదృష్టకరం. బౌద్ధికమైన స్థాయిలోనే అద్వైతానికి సైన్సుకి పోలిక ఉంది. ఇట్లా బుద్ధితో భౌతిక ప్రపంచంతోనే ఆగిపోకుండా ప్రజల మనస్తత్వంలో మార్పును, ఎరుకను తీసుకొనిరాలేకపోయింది. కాని అద్వైతమట్లా కాదు. సాధకులలో అఖండ శాంతిని, జ్ఞానాన్ని కలిగిస్తుంది

--- దేవరకొండ శేషగిరిరావు గారి "అద్వైతం" పరమాచార్య ఉపన్యాసాల సంగ్రహం

#KanchiParamacharyaVaibhavam #కంచిపరమాచార్యవైభవం

తెలుగు కథలు Telugu Stories

20 Oct, 16:46


Photo from perkacm

తెలుగు కథలు Telugu Stories

20 Oct, 16:45


ఒక్కసారి భగవంతుని అనుగ్రహాన్ని రుచి చూస్తే, ఈ జీవితం ఐహిక విషయముల కోసం కాదని, భగవంతుణ్ణి చేరుకోవడానికి సాధనమని అవగతమవుతుంది. ఇక నిరాశావాదానికి నిస్పృహకి తావుండదు. జీవితంలో ఇక శూన్యం అనేది ఉండదు.

--- శ్రీశ్రీశ్రీ భారతితీర్థ మహాస్వామి

#SringeriJagadguruVaibhavam #శృంగేరిజగద్గురువైభవం

తెలుగు కథలు Telugu Stories

20 Oct, 16:03


కొద్దిసేపటి తరువాత పాలక్కాడ్ హరిహర సుబ్రమణియన్ వచ్చి మహాస్వామి వారికి నమస్కరించాడు. అతని చేతిలో చిన్న ట్రంకు పెట్టె ఉంది. మహాస్వామి వారు అతణ్ణి అతని చేతిలోని ట్రంకు పెట్టెని చూసారు. ఆ యువకుడు ఆ దబ్బా తెరిచి అందులో ఉన్న పట్టు బట్టలో చుట్తబడియున్న కొన్ని తాళపత్రాలను బయటకు తీసాడు. మహాస్వామి వారు ఏమి తెలియనట్టు ఏంటవి? అన్నాట్టుగా చూసారు.

అతను అమాయకంగా “మీరు ఈ సంవత్సరం నుండి బొమ్మల కొలువు పెట్టమని నాకు అనుజ్ఞ ఇచ్చారు. నేను బొమ్మల కోసం వెతికితే నాకు ఈ డబ్బా దొరికింది. నేను ఎప్పుడూ దీన్ని చూడలేదు. నేను తెరచి చూసి అందులో ఉన్న భాష అర్థం కాక ఇక్కడకి తెచ్చాను.”

మహాస్వామి వారు నవ్వుతూ తమ ఎదురుగా కూర్చొని ఉన్న ఆ కాషాయ వస్త్రధారిని చూసి హిందీలో “కొద్దిసేపటి ముందు నువ్వు నన్ను అడిగిన ఆ అపూర్వ వస్తువు వచ్చింది. వచ్చి చూడు” అని అన్నారు. అతను కింద కూర్చుని ఆ తాళ పత్రాలను నిశితంగా పరిశీలించసాగాడు. అతని మొహం ఆనందమయమైంది. వాటిని ఎత్తుకుని తలపై ఉంచుకొని ఆనందంతో గట్టిగా “ఓ పరమ ఆచార్య పురుషా! ఈ అపూర్వ అయుర్వేద గ్రంథం కోసం ఎన్నో ఏళ్ళుగా వెతుకుతున్నాను. నువ్వు ప్రత్యక్ష దైవానివి. అరగంటలో నేను అడిగినదాన్ని నాకు ప్రసాదించావు. నేను ధన్యుణ్ణి.” అని పరమాచార్య స్వామి వారికి సాష్టాంగ నమస్కారం చేసాడు.

హరిహర సుబ్రమణియన్ ఏమి అర్థం కాక నిలుచుండిపోయాడు. మహాస్వామి వారు దగ్గరకు పిలిచి “ఇతను పండరీపురం నుండి వచ్చిన ఆయుర్వేద సిద్ధాంతి. అరగంట క్రితం తను ఒక అపూర్వ గ్రంథం కోసం వెతుకుతున్నానని నాతో చెప్పాడు. నా మనస్సుకు ఏదో తోచినట్టయ్యి కొద్దిసేపు వేచియుండమని చెప్పాను. తరువాత నువ్వు ఈ ట్రంకు పెట్టెతో వచ్చావు. వారికి ఇవి ఉపయోగపడతాయి. నీ తండ్రిని తాతని తలచుకొని నీ చేతులతో వాటిని ఆయనకు ఇవ్వు” అని ఆజ్ఞాపించారు.

ఆ యువకుడు వారు చెప్పినట్టే చేసాడు. వాటిని తీసుకుంటున్నప్పుడు ఆ పెద్దమనిషి కళ్ళలో ఆనందభాష్పాలు కారాయి. అతను ఆ యువకుడితో “నీ వల్ల నాకు అపూర్వ గ్రంథము దొరికింది. దానికి వెల నేను కట్టలేను. అలాగని ఈ అపూర్వ సంపదని ఉచితముగా తీసుకోలేను” అని ఒక పళ్ళెంలో యాభైవేల రూపాయలు, పళ్ళు ఉంచి వినయంగా ఇచ్చాడు. ఆ యువకుడు మహాస్వామి వారి వంక చూసాడు. వారు చిరునవ్వుతో తీసుకుమ్మన్నారు. వణుకుతున్న చేతులతో అతను దాన్ని అందుకున్నాడు.

మహాస్వామి వారు దగ్గరకు పిలిచి “నువ్వు నీ పూర్వీకుల గురించి తప్పు గా మాట్లాడినప్పుడు నేను నీకు ఏమి చెప్పానో గుర్తుందా? వారు చాలా గొప్పవారు. చాలా మంచి పనులు చేసారు. చూసావా బొమ్మల కొలువు పెట్టమన్నందుకు నీకు ఇది దొరికింది. ఇంటి అప్పు 45వేలు అన్నావుగా! చంద్రమౌళీశ్వరుడు నిన్ను అనుగ్రహించాడు. పాలక్కాడ్ కి తిరిగి వెళ్ళు. డబ్బు జాగ్రత్త” అని చెప్పి అశీర్వదించి పంపించారు.

అపార కరుణాసింధుం జ్ఞానదం శాంతరూపిణం
శ్రీ చంద్రశేఖర గురుం ప్రణమామి ముదావహం ।।

తెలుగు కథలు Telugu Stories

20 Oct, 16:03


ఆయుర్వేద వైద్యం - బొమ్మల కొలువు

అది మహారాష్ట్రలోని సతారాలో ఉత్తర శ్రీ నటరాజ స్వామి వారి దేవాలయం కడుతున్నప్పటి రోజులు. మహాస్వామి వారు అక్కడే ఉంటూ అన్నీ స్వయంగా పర్యవేక్షిస్తున్నారు. పరమాచార్య స్వామి వారి దర్శనానికి భక్తులు తండోపతండాలుగా వస్తున్నారు.

ఒకనాటి ఆదివారం మద్యాహ్నం మూడు గంటల ప్రాంతంలో 30 సంవత్సరముల వయస్సుగల ఒక యువకుడు మహాస్వామి వారికి సాష్టాంగం నమస్కారం చేసి నుంచున్నాడు. అతని కళ్ళల్లో కన్నీటి ధారను మహాస్వామి వారు చూసి ప్రేమతో “ఏమప్పా! ఎవరు నీవు? ఎక్కడనుండి వచ్చావు? నీ కళ్ళల్లో ఆ తడి ఎందుకు?” అని అడిగారు. అతను ఏమి సమాధానం చెప్పకుండానే పెద్దగా ఏడ్వటం మొదలుపెట్టాడు. చుట్టూ ఉన్న వారు అతన్ని ఊరడించి మహాస్వామి వారిముందు కూర్చోపెట్టారు.

”ఎక్కడినుండి వచ్చావు అప్పా?” మహాస్వామి అడిగారు. ”పాలక్కాడ్ కేరళ”

వెంటనే మహాస్వామి వారు “పాలక్కాడ్ నుండి ప్రయాసపడి ఇక్కడిదాకా వచ్చావా?” అని అడిగారు. ”అవును పెరియావ మీకొసం అక్కడినుండి వచ్చాను”

“సరే. నీ పేరు ఏంటి?”

“హరిహర సుబ్రమణియన్”

“భేష్! చాలా మంచి పేరు. మీ తండ్రి గారు ఏం చేస్తుంటారు?” అని అడిగారు. ”మా తండ్రి గారు ఇప్పుడు శరీరంతో లేరు. వారు పాలక్కాడ్ లో ఆయుర్వేద వైద్యుడు. వారి పేరు డా. హరిహర నారాయణన్”

అతను ముగించక ముందే మహాస్వామి వారు కుతూహలంతో ”ఓ నువ్వు పాలక్కాడ్ ఆయుర్వేద వైద్యులు హరిహర నారాయణన్ కుమారుడవా. మంచిది! సరే చెప్పు. అలా అయితే నువ్వు డా. హరిహర రాఘవన్ గారి మనవడివి కదూ! వారందరూ ఆయుర్వేద వైద్యంలో మంచి పేరు సంపాయించారు” అని చెప్తూ వచ్చిన అతణ్ణి పరిశీలనగా చూస్తూ కనుబొమ్మలు పైకెత్తారు.

”అవును పెరియావ” సమాధానమిచ్చాడు ఆ యువకుడు.

మహాస్వామి వారు నవ్వుతూ “భేశ్! ఉన్నతమైన వైద్య వంశం మీది. అది సరే నువ్వు నీ పేరు ముందు డాక్టర్ అని పెట్టుకోలేదా?” అని అన్నారు.

”నేను అది చెదవలేదు పెరియావ. మా తండ్రి గారు నన్ను ఆ మార్గంలో పెంచలేదు” కొంచం నిర్లక్ష్యంగా అన్నాడు. ”నువ్వు అలా చెప్పరాదు. మీ తండ్రిగారు చెప్పించలేదా లేదా నీకే దానిపైన శ్రద్ధ లేదా?”

అతను ఏమి చెప్పలేదు. “అంతటి మహా వైద్యుల వంశంలో పుట్టి నువ్వు నేర్చుకునే భాగ్యం పోగొట్టుకున్నావు. సరే ఎంతదాకా చదువుకున్నావు?” అడిగారు మహాస్వామి వారు. ”తొమ్మిది దాకా పెరియావ”

“ఏం మరి చదువుకోవాలని అనిపించలేదా?”

“ఏమో నాకు అప్పుడు అనిపించలేదు. కాని ఇప్పుడు చింతిస్తున్నాను.”

“నీకు వివాహం అయ్యిందా?”

“అయ్యింది పెరియావ. మాకు ఏడు సంవత్సరముల కూతురు ఉంది”

“సరే. ఇప్పుడు ఏమి చేస్తున్నావు?”

అతని కళ్ళల్లో నుండి నీరు జారసాగింది. “నాకు మంచి చదువు లేకపోవడం వల్ల మంచి ఉద్యోగం లభించలేదు పెరియావ. నేను ఒక రైస్ మిల్లులో సూపర్వైజర్ గా పనిచేస్తున్నాను. నా జీతం ఏడు వందల రూపాయలు. దాంతోనే మా కుటుంబం గడుస్తోంది.”

“ఓహో అలాగా? సరే నీకు మీ పూర్వీకులు స్వంత ఇల్లు వదిలివెళ్ళారా?”

అతను కళ్ళు తుడుచుకుంటూ “మా తాత గారు ఒక ఇంటిని కట్టించారు. నేను ఇక్కడకి రావటం ఆ ఇంటి గురించే పెరియావ. కాలా ఏళ్ళ క్రితం మా అత్తయ్య (నాన్న గారి చెల్లెలు) భర్త చనిపోవడంతో తన ఇద్దరు కూతుళ్లను తీసుకుని పాలక్కాడ్ వచ్చింది. నవరాత్రులప్పుడు మా నాన్న గారు మేము ఉన్న ఇంటిని 25వేల రూపాయలకు తకట్టుపెట్టారు. మా అత్తగారి పిల్లల పెళ్ళిళ్ళు చేసారు. తరువాత మా నాన్న మా అత్త ఇద్దరూ కాలం చేసారు.”

“పెరియావ నా బాధ ఏంటంటే నవరాత్రి సమయంలో లక్ష్మీకారకం అయిన ఇంటిని తాకట్టు పెట్టి పోయారు. ఇప్పుడు ఆ అప్పు 45వేల రూపయలు అయ్యింది. ఇక ఇల్లు నా నుండి వెళ్ళీపోతుంది”
పరమాచార్యస్వామి వారు ధ్యానంలోకి వెళ్ళారు. కొద్దిసేపటి తరువాత చిరువవ్వుతో “సరే ప్రతి నవరాత్రికి నువ్వు ఇంట్లో బొమ్మల కొలువు పెద్తున్నావు కదూ?”

“లేదు పెరియావ. మా తండ్రి గారు ఉన్నప్పుడు పెట్టేవారం. వారు వెళ్ళీపోయిన తరువాత నేను పెట్టడంలేదు.”

మహాస్వామి వారు అడ్డుపడుతూ “పూర్వీకుల గురించి నువ్వు అలా మాట్లాడకూడదు. వారు చాలా గొప్పవారు. నాకు తెలుసు. వారు చాలా మంచి పనులు చేసి వెళ్ళిపోయారు. నువ్వు మనసులో ఏదో పెట్టుకుని తరతరాలుగా వస్తున్న ఆచారాలను వదలరాదు. మరొక్క వారంలో నవరాత్రి మొదలు అవుతుంది. పాలక్కాడ్ లోని మీ ఇంటిలో బొమ్మలు కొలువు పెట్టి దేవిని ఆరాధించు. నీ కష్టాలు తీరి ఊరట లభిస్తుంది.” అని చెప్పి అతనికి ప్రసాదం ఇచ్చి ఆశీర్వదించి పంపించారు.

ఇరవై రోజులు గడిచాయి. ఆ రోజు ఆదివారం. సతారా లో మహాస్వామి దర్శనార్థం చాలా మంది భక్తులు వచ్చారు. శ్రీ మఠం పరిచారకుడు ఒకరు ఆ భక్తుల మధ్యలో త్రోవ చేసుకుంటూ ఒక 60 65 సంవత్సరముల వయస్సు ఉన్న ఒక పెద్దాయనను తీసుకుని వచ్చారు. వారు కాషాయ వస్త్రములు ధరించి మెడలో ఎన్నో తుళసి రుద్రాక్ష మాలలు ధరించి ఉన్నారు. వారు మహాస్వామి వారికి సాష్టాంగం చేసి హిందీలో మాట్లాడారు. పరమాచార్య స్వామి వారు కూడా అతనితో హిందీలో మాట్లాడి తమ ఎదురుగా ఉన్న వేదిక పైన కూర్చోమన్నారు.

తెలుగు కథలు Telugu Stories

20 Oct, 16:03


Photo from perkacm

తెలుగు కథలు Telugu Stories

20 Oct, 16:03


పూర్వాచార్యుల మహాత్మ్యం - 3

ముప్పయి మూడవ జగద్గురువులు శ్రీ సచ్చిదానంద శివాభినవ నృసింహ భారతీ మహాస్వామివారు, తమ ఎనిమిదో ఏటనే సన్యాసాశ్రమాన్ని స్వీకరించారు. అతి చిన్న వయస్సులోనే యోగానిష్ణాతులైన ఈ మహనీయులు శిఖరతుల్యమైన నిర్వికల్ప సమాధిస్థితిని పొందారు. అపార దైవ విశ్వాసం. అచంచల గురుభక్తి పరాయణులైన విరు రచించిన వందలాది శ్లోకాలను భక్తిసుధా తరంగిణి పేరిట ప్రకటించడం జరిగింది. శ్రీ మచ్చంకర భగవత్పాదులపై అమిత గౌరవము కలిగి ఉన్న ఈ మహనీయులు, కాలడిలో పరిశోధన జరిపి శంకరుల జన్మస్థలం గుర్తించి 1910లో అక్కడ శారదాంబ, ఆదిశంకరుల ఆలయాలను నిర్మించారు. ప్రతిఏటా శంకరజయంతి నిర్వహించే సంప్రదాయాన్ని వీరు ప్రారంభించారు. శ్రీ ఆదిచంకరులు రచించిన అన్ని రచనలనూ ఒక సంకలనంగా రూపొందించి “శంకర గ్రంథావళి” అనే పేరుతో వీరే ప్రచురించారు.

ముప్ఫయి నాల్గవ జగద్గురువులైన శ్రీ చంద్రశేఖర భారతీ స్వామివారు చిన్నతనంలోనే తీవ్ర వైరాగ్యానికి లోనయ్యారు. ఆత్మనిష్టాగారిష్టులైన ఈ మహానియుడిని జీవితకాలంలో ఒక్కసారి దర్శించినా జన్మసార్తకమైనట్లే అని వేలాదిమంది భక్తులు భావిస్తూ వారి దర్శనానికి వచ్చేవారు. శ్రీ మచ్చంకర భగవత్పాదులు రచించిన వివేక చూడామణికి వీరందించిన భాష్యాన్ని మహాపండితులు సైతం కొనియాడుతారు.

--- ‘శ్రీ శారదాంబ దివ్యసన్నిధి శృంగేరి’ పుస్తకం నుండి

#SringeriJagadguruVaibhavam #శృంగేరిజగద్గురువైభవం

1,321

subscribers

126

photos

17

videos