133. వృక్షాణాం పతయే నమః
వృక్షాలకు పతి అయినవానికి నమస్కారం(రుద్రనమకం)
చెట్లంటే ప్రకృతిలో ప్రతి ప్రాణికి పరవశమే. వృక్షాలను దైవాలుగా భావించి ఆరాధించిన భవ్య సంస్కృతి మనది. మహోత్కృష్టమైన నాగరికత కలిగిన భరతవర్షం సనాతనంగా ఓషధుల విజ్ఞానాన్ని ఆవిష్కరించింది.
ప్రాచీన కాలంలోనే - వృక్షాలను
ప్రాణవంతాలుగా దర్శించిన విజ్ఞానం మనకుంది.
ప్రతి ఇంటా పెంచదగిన చెట్లను, మొక్కలను పెంచి పోషించాలని, అది
గృహస్థధర్మమని 'మహాభారతం'లో ఆనుశాసనికపర్వంలో భీష్ములవారి బోధ.పూలమొక్కలు, చెట్లు ఉన్న ఇంట మహాలక్ష్మి నివసిస్తుందని వివరించింది భారతం.తులసి మొక్కను తప్పనిసరిగా ఇంట్లో ఉంచి ఆరాధించడం మన సంప్రదాయం.
కొన్ని ప్రత్యేక మాసాలలో ప్రత్యేక వృక్షాల పూజలున్నాయి. అశ్వత్థ వృక్షానికి అర్చనలు,వటవృక్షానికి (వట సావిత్రీవ్రతం) ఆరాధనలు, శమీవృక్షానికి (విజయదశమినాడు)
పూజలు, ఉసిరికకు (కార్తికమాసంలో) మొక్కులు వంటివి మన ఆచారాలు. ప్రకృతికీ మనకీ దివ్య బంధముంది. భగవత్స్వరూపాన్ని చెట్టు, పుట్టలో కూడా దర్శించగలగడం గొప్ప సంస్కారం. దేవతా వృక్షాలుగా తలంచే చెట్లన్నీ ఔషధ విలువలతో కూడుకున్నవే.
విశ్వాన్నీ, జీవితాన్నీ కూడా వృక్షంతో పోల్చారు. బీజం ఏకమై, వృక్షం అనేకంగా కనిపిస్తుంది. విశ్వబీజమైన విశ్వమూలశక్తి భగవంతుడు విశ్వమనే వృక్షంగా విస్తరించాడు. మూలం కనిపించదు. భగవానుడూ గోచరించడు.
మనం పృథ్విపై ఉండి వర్ష, కాంతి, సస్యాది ఫలాలను అనుభవిస్తున్నాం. ఫలాలు దొరికే చోటు కొమ్మల వద్దే. అయితే వీటికి మూలమైన వేళ్ళు మాత్రం ఆకాశంలోనే ఉన్నాయి. అనంతాకాశం నుంచి వర్షించే కాంతి కిరణాలు, మబ్బులు, ఆ సూర్యశక్తి ద్వారా లభించే ప్రాణశక్తి... ఇవన్నీ పైన ఉన్న మూలాలు. ఇలా ఉన్న ఈ చిత్ర
జగద్వృక్షం ‘అశ్వత్థం'. ‘శ్వ' అంటే రేపు, 'రేపు ఉండనిది' - అశ్వత్థం. దీని
ప్రపంచం ఇవాళ ఉన్నట్లు రేపుండదు. నిత్య పరిణామశీలమైనది. వృక్షంలో చిగురింత,ఈ పుష్పీకరించడం, ఫలించడం, ఆకులు రాల్చడం.. మళ్ళీ చిగురించడం.. ఇలా నిత్య
పరిణామం కనిపిస్తుంది. చెట్టుకి పచ్చని పత్రాలు ఎలాంటివో, ప్రపంచానికి సనాతనధర్మం అట్లాంటిది. ధర్మమే ప్రపంచానికి రక్ష. అది లేనినాడు ఈ జగత్తు
ఆకులు లేని మోడులాంటిది.
రామాయణాన్ని. భారతాన్నీ, భాగవతాన్నీ కల్పవృక్షాలుగా వర్ణించారు. చెట్టులో జీవితాన్నీ, జగతినీ దర్శించగలిగి, ఈ రెండు పచ్చగా, సఫలంగా ఉండాలని
కాంక్షించారు వేదర్షులు. చెట్టుని నరకడం మహాపాతకమని హెచ్చరించారు. తప్పనిసరై
ఒక్క చెట్టును నరికితే, ఆ దోష నివారణార్థం ప్రాయశ్చిత్త కర్మ చేసుకొని, తగిన చోట
ప్రత్యామ్నాయంగా కొన్ని మొక్కలను నాటాలని పరిహారాన్ని నిర్దేశించారు. చెట్టునీ, కొమ్మలనీ హింసించకుండా పత్రాలను, ఫలాలను గ్రహించాలని చెప్పారు.
తులసి, మారేడు, కదంబం, ఉసిరిక, మేడి - వంటి దేవతావృక్షాలు తమ నుంచి దివ్యశక్తి తరంగాలను వాతావరణంలో నింపుతాయని ఇటీవల కొన్ని విజ్ఞాన పరిశీలనలు ఋజువు చేస్తున్నాయి. 'వనదేవతలు' అనే మాట మనకు ఎలాగూ ఉంది.
'వృక్షాణాం పతయే నమః' అని రుద్రనమకం కీర్తిస్తే 'న్యగ్రోధోదుంబరోశ్వతః' అని
విష్ణుసహస్రం వినుతించింది. ఋషులందించిన వృక్షారాధనలోని విశాల విజ్ఞానదేవతా భావనను గ్రహించగలిగిననాడు పర్యావరణాన్ని పచ్చదనంతో నింపగలగడం తేలికైన
పనే.