147. మా కస్య అద్భుత క్రతూ! యక్షం భుజేమ తనూభిః
మా శేషసా మా తనసా
ఓ అద్భుతకర్మపరులారా! మేము మా తనువులతో యక్షమును
అనుభవించకుందుము గాక, వారసత్వముగా లభించిన ధనమునూ, సంతానము
ఆర్జించిన సొమ్మును భోగించకుందుము గాక (ఋగ్వేదం)
స్వశక్తితో సంపాదించినదే అనుభవానికి యోగ్యం అని పై వేదవాక్య హృదయం.
పిత్రార్జితం మధ్యమమే. అలా వచ్చిన వాటిని సత్కార్యాలకు వినియోగించవచ్చు.
తల్లిదండ్రుల బాగోగులు చూడడం పుత్రులకు స్వధర్మం. దానిని వారు మీరరాదు.కానీ సంతానపు సొమ్ముపై మాత్రమే ఆధారపడడమూ ఆదర్శం కాదు. తమ స్వార్జితాన్నే సరియైన విధంగా ప్రణాళికాబద్ధంగా వినియోగించుకుంటూ దానితో జీవించడమే సమంజసం.
అయితే పైతరాల నుండి, తరువాత వారి నుండి తమంత తాముగా వచ్చిన ఆదాయాన్ని ధార్మిక సత్కర్మలకు వెచ్చించడం శ్రేష్ఠం.
అదే విధంగా 'యక్ష'మును అనుభవించరాదు. అని శాస్త్రం. 'యక్ష' శబ్దానికి 'పూజార్హమైన ద్రవ్యం' అని అర్థం. దానికి చాలా అన్వయించవచ్చు.
దైవ ద్రవ్యాలు, లేదా - పూజ్యుల (మహాత్ముల, గురువుల) ద్రవ్యములు లేదా -గౌరవనీయంగా లభించిన కానుకలు, దానాలు... ఇన్ని అర్థాలు 'యక్షము' అనే పదానికి ఉన్నాయి. వీటితో జీవించడం,అనుభవించడము తగదని భావం.
మొత్తంగా శ్రమతో సాధించిన స్వార్జిత విత్తం అనుభవించడమే శ్రేష్ఠం - అని
తాత్పర్యం.
స్వశక్తినీ, శ్రమనీ - దాని వలన లభించిన సక్రమార్జనని మాత్రమే అనుభవించాలి-అని శాసించిన వేదమాత ఎంత అద్భుత జీవనశైలిని ఆదర్శంగా బోధించిందో
అవగతం చేసుకోవాలి.
'ఉత్తమం స్వార్జితం విత్తం' - అని సుభాషితకారుడూ ఈ నీతినే బోధించాడు.
పిత్రార్జితాన్ని 'మధ్యమం' అన్నారు.
స్త్రీ శ్రమించి సంపాదించిన దానిని అనుభవించడం 'అధమం'గా పేర్కొన్నారు.అంటే స్త్రీ శ్రమని దోచుకోరాదు అనే భావన కూడా ఇందులో ఉంది. స్త్రీమూర్తికి
మన సమాజమిచ్చిన గౌరవమది.
శుద్ధమైన స్వార్జితం వల్ల ఆరోగ్యం, చిత్తం కూడా బలంగా, శుద్ధంగా సత్కర్మలకు యోగ్యంగా ఉంటాయి.
కేవలం లోకకల్యాణానికై తమ ప్రకాశాన్ని వినియోగిస్తున్న సూర్య చంద్రాదులను ఇందులో సంబోధించారు.
'అద్భుతక్రతూ' - 'ఆశ్చర్యకరమైన గొప్పపనులు చేసేవారు' - వేద ప్రకారంగా దేవతలు, ప్రత్యక్ష రూపులైన సూర్యచంద్రులు. వారు తమదైన శక్తితో, విశ్వహితానికై
ప్రవర్తిస్తున్నట్లుగా, స్వశక్తితో సమాజహితానికి పాటు పడేలా అనుగ్రహించమని వారి రూపంగా ఉన్న పరమేశ్వరుని ప్రార్థిస్తున్న మంత్రమిది.