Latest Posts from తెలుగు ఆధ్యాత్మిక పుస్తకాలు (@pusthakam123) on Telegram

తెలుగు ఆధ్యాత్మిక పుస్తకాలు Telegram Posts

తెలుగు ఆధ్యాత్మిక పుస్తకాలు
7,520 Subscribers
1,375 Photos
24 Videos
Last Updated 01.03.2025 08:17

The latest content shared by తెలుగు ఆధ్యాత్మిక పుస్తకాలు on Telegram


☘️🍁 ఆప్తవాక్యాలు 🍁☘️

127. ఉద్యోగినం పురుషసింహముపైతి లక్ష్మీః

ప్రయత్నశీలుడైనపురుషశ్రేష్ఠుని(మానవుని) లక్ష్మి చేరుతుంది

ఈ మాటకు "ఉద్యోగం చేయడం మగవాడి లక్షణం" అని అర్థం చెబుతుంటారు.కానీ దీని అర్థం అది కాదు. ఒక శబ్దానికి లోకంలో అలవాటైన అర్థం వేరు. అసలైన
నిఘంటువు అర్థం వేరు. అందుకే భాషలో శబ్దానికి అర్థం చెప్పేటప్పుడు సంప్రదాయాన్ని పరిశీలించాలి.

ఉద్యోగం అనే మాటకు 'ఉపాధి', 'పని' అని అర్థాలు మనం వాడతాం. కానీ ఈ సంస్కృత శబ్దానికి ఈ అర్థాల వాడుక దేశమంతా లేదు. 'ఉద్యోగం' అనే శబ్దానికి అసలైన అర్థం - 'ప్రయత్నం'. 'పురుష' శబ్దానికి వైదిక పరిభాషలో 'మగవాడు' అనే
అర్థాన్ని చెప్పలేదు. 'పురుషుడు' అంటే 'జీవుడు' అని అర్థం.

ఈ శరీరాన్ని 'పురం' అని వర్ణించారు. నవద్వారాల పురం (పట్టణం) ఈ దేహం.

“నవ ద్వారే పురే దేహే..." అని పేర్కొన్నాయి శాస్త్రాలు. ఈ దేహ పట్టణంలో నివసించే జీవ చైతన్యమే 'పురుషుడు'. అంటే ప్రతి వ్యక్తీ (స్త్రీయైనా / మగవాడైనా)
పురుషుడే. ఇది సమూహంగా ప్రాణులందర్నీ తెలియజేస్తుంది.

ఇప్పుడీ వాక్యానికి అర్థాన్ని స్పష్టం చేస్తే - "ప్రయత్నించడం మానవ (జీవ) లక్షణం”.

పరస్పరం సహృదయంతో, ద్వేషరహితంగా మనసు విప్పి మాట్లాడుకోవడం సామరస్యానికి ప్రథమసూత్రం. సంభాషణ లేకపోవడం వల్ల అపార్థాలు,దురభిప్రాయాలు పెరగడమే కాక, అవి బలీయమై విద్వేషాలకు, వైమనస్యాలకు
హేతువౌతాయి.
-
రెండవ సూత్రం - లక్ష్యదృష్టి, వ్యక్తుల నడుమ ప్రధాన లక్ష్యాన్ని నెరవేర్చడమే
ప్రయోజనం అనే భావన ఉండాలి. ఆ ప్రయోజనం కోసం వ్యక్తిగతమైన
అహంకారాలనీ, ద్వేషాలనీ, స్వార్థాలనీ పక్కన పెట్టగలగాలి.

సంకల్పాలు సమానం కావాలి. ఆలోచనా ధోరణులు కలవాలి. అయితే ఇటువంటివన్నీ సమకూరడం కేవలం మానవుల చేతుల్లోనే ఉన్నాయనుకోవడం పూర్తి
సత్యము కాదు. ఒకొక్కప్పుడు మనల్ని మించిన ఏ శక్తి పనిచేస్తున్నదని మన అనుభవంలోనే తెలుస్తుంటుంది. నిష్కారణంగా ద్వేషాలు, కలహాలు, అనైక్యతలు
కూడా కలుగుతుంటాయి. దానివలన కలిసి కట్టుగా సాధించవలసిన ఎన్నో మహా ప్రయోజనాలు దెబ్బతింటున్నాయి.

దానికి కొంతమేరకు దైవకార్యాలతో పరిష్కారం సాధించవచ్చు. ఈ సూక్తాల పారాయణ తగిన శాస్త్రవేత్తల ద్వారా చేయించవచ్చు. అదే విధంగా ప్రతివారు తమ
ఇంట నిత్యం భగవదారాధన, వీలైనప్పుడు 'నలచరిత్ర' పారాయణ వంటివి సౌమనస్య వాతావరణాన్ని ఏర్పరుస్తాయని పురాణ పరిష్కారాలు.

“కర్కోటకస్య నాగస్య
దమయంత్యాః నలస్యచ| ఋతుపర్ణస్య రాజర్షేః కీర్తనం కలి నాశనమ్॥"

అనే శ్లోకాన్ని అనునిత్యం పఠించితే సామరస్య భావానికి అవకాశముంటుందని మహాభారతంలోని మాట.

ఈ సమాన భావనాసౌఖ్యం సామాజికంగానే కాక, వ్యక్తిగత కార్యసాధనలో,కుటుంబ జీవనంలో కూడా అవసరం.

"పుత్రులు తల్లిదండ్రులకు ఆనందం కలిగించేవారిగా ఎదగాలి. భార్య భర్తతో మధుమయంగా, శాంతిగా మాట్లాడాలి. భర్త భార్యను గౌరవంగా ఆదరించాలి.అన్నదమ్ములు ద్వేషించుకోరాదు. ఆడపడచు ఆనందంగా ఉండాలి. సమానంగా
మంచి పనులు చేస్తూ, కుటుంబ సభ్యులందరూ శుభాలను పలుకుతుండాలి.

దేవతలు ఏవిధంగా ఒకరినొకరు ద్వేషించకుండా, పరస్పర సమన్వయంతో,ఏకస్వభావంతో అనేక రూపాలతో ఉంటారో అదే విధంగా ఇంట్లో అందరూ కలిసి ఉండాలి. గొప్పతనాన్ని పొందడంలో కలిసి మెలసి ప్రయత్నించాలి. పరస్పరం మెత్తని మాటలతో, అనురక్తితో కలిసి జీవించాలి."

ఇటువంటి అద్భుత భావాలు మన వైదిక సూక్తాలు ఆవిష్కరించాయి. దీనిని బట్టి శాంతియుతమైన సంఘటిత కుటుంబాలను, సమాజాలనీ - మొత్తంగా ఒక
అద్భుత నాగరికతను దర్శించడంలో భారతీయ ఋషులు ఎంత అగ్రస్థానంలో ఉన్నారో అర్థమవుతున్నది.

☘️🍁 ఆప్తవాక్యాలు 🍁☘️


121. భద్రం మనః కృణుష్య

(పరమాత్మా!) మా మనస్సును కల్యాణమయం చేయుము(సామవేదం)

మనస్సు శుభంగా ఉంటే అన్నీ శుభకరాలే. అందుకే మంచి సంకల్పాలు, మంచి భావాలు, మంచి ఆలోచనలు కల అంతఃకరణ ప్రధానం.

అయితే - చిత్తం శుద్ధమయ్యేవరకు అప్రయత్నంగా దుర్గుణాలు మనస్సులో చెలరేగుతాయి.

అందుకే మనం సన్మనస్సును ప్రసాదించమని భగవంతుని ప్రార్థించాలి. ఈ ప్రార్థన వలనే మనస్సుకి 'సత్' లక్షణం సమకూరుతుంది. మన ప్రయత్నానికి దైవసహకారం లభిస్తుంది.

( ఆ భద్రభావనలే దేవతలు. ఆ దేవతలకే విజయం కలగాలి. అప్పుడే మన జీవితానికి క్షేమం. 'యుక్తేన మనసా...' యోగ్యమైన మనస్సుతో మనం భగవంతుని ఆరాధించాలి... అని యజుర్వేదం పేర్కొంది. భద్రమైన మనస్సే యోగ్యమైనది. చెడు
ఆలోచన, చెడు ఆచరణ... ఇవే దురితాలు. వాటిని తొలగించమని ఋగ్వేద మంత్రం.
'సత్కర్మలని స్మరించు. ఇతరుల సత్కర్మలనే చర్చించు. చెడు తలంచకు - చర్చించకు' అని
యజుర్వేదం హెచ్చరించింది.)

'దురాచారం నుండి, దురాలోచనల నుండి దూరం చేయమ'ని కూడా
ఋగ్వేదమంత్రంలో వేడికోలు కనబడుతుంది.

'యద్ భద్రం తన్న ఆసువ'

- మంగళకరమైన గుణాలతో మనలను నింపివేయమని అభ్యర్థించాలి.

సంశయం, అశ్రద్ధ (శాస్త్రవాక్యాలపై అవిశ్వాసం), లంపటత్వం, క్రోధం, మోహం,మదం, లోభం, కామం, మాత్సర్యం - వంటివి మనోదోషాలు.

వాటిని పరిహరించే ప్రయత్నం ఆధ్యాత్మిక సాధనల ద్వారా సాగాలి.

'దురితాని పరాసువ...’

మనం మంగళకరమైన సంఘటనలు జరగాలని ఆశిస్తాం. భగవంతుని అడుగుతాం.మంగళం బైట ఉండాలని కోరుతాం కానీ, మనలోనే మంగళం ఉత్పన్నం కావాలని ఆశించం.

మన జీవిత వృక్షానికి మూలం మన మనస్సులోనే ఉంది. మనోదోషాలు లేనప్పుడు మనచుట్టూ శుభాలే.

అథర్వవేదంలో వివిధ రకాల దుష్టవృత్తుల గురించి వర్ణించారు. వాటి బారిన పడకుండా కాపాడమని అంతర్యామిని అర్థించడం కనిపిస్తుంది.

సంశయీవృత్తి, ఆక్రామిక వృత్తి (ఆక్రమించే బుద్ధి), చాటు కరవృత్తి (వంచన, వెనక నిందలు), అసామాజిక వృత్తి (నలుగురిలో కలువలేనితనం, సమాజవిరోధం),
అభిమానీవృత్తి (ఇది అహంభావం యొక్క స్వరూపం), లోలుపవృత్తి (ఇతరుల సంపదల పట్ల కోరిక) - వీటిని రాక్షస భావనలుగా పేర్కొన్నారు. వీటిని నశింపజేసుకోవడమే
రాక్షససంహారం.

మనలో భద్రభావనలు వృద్ధి చెందితే రాక్షసనాశనం జరిగినట్లే.

ఆ భద్రభావనలే దేవతలు. ఆ దేవతలకే విజయం కలగాలి. అప్పుడే మన జీవితానికి క్షేమం.

'యుక్తేన మనసా...' యోగ్యమైన మనస్సుతో మనం భగవంతుని ఆరాధించాలి...అని యజుర్వేదం పేర్కొంది.

భద్రమైన మనస్సే యోగ్యమైనది. చెడు ఆలోచన, చెడు ఆచరణ... ఇవే దురితాలు.వాటిని తొలగించమని ఋగ్వేద మంత్రం.

సత్కర్మలని స్మరించు. ఇతరులు సత్కర్మలనే చర్చించు. చెడు తలంచకు, - చర్చించకు'
అని యజుర్వేదం హెచ్చరించింది.

మంచిని స్మరించి, చర్చించితే మనస్సు శుభమయమౌతుంది.

Live stream started

☘️🍁 ఆప్తవాక్యాలు 🍁☘️


120. వాతా ఆ వాతు భేషజం శంభు మయోభు నో హృదే

శుద్ధమైన వాయువు ఔషధం - శుభకరం - ఆనందకరం(ఋగ్వేదం)

పర్యావరణ పరిశుద్ధికి సంబంధించిన ఎన్నో ఉపయోగకరమైన భావాలు
వేదవిజ్ఞానంలో కనిపిస్తాయి. మనచుట్టూ ఉన్న భూమి, వాయువు, నీరు, అన్నం...
అన్నీ క్షేమకరంగా ఉండాలనీ, ఉంచాలనీ వేదాకాంక్ష. యజ్ఞాదులు పర్యావరణాన్ని
శుద్ధిగా, బలంగా పరిరక్షించేందుకే ఏర్పరచబడినాయి.

ఋగ్వేదంలో ఏ ఏ ఋతువులో ఏవేవి తినాలో, తాగాలో, ఏ విధంగా జీవించాలో
చాలా మంత్రాల్లో వివరించారు. ఈ వేదాంశాలే ఆయుర్వేదంలో స్వీకరించబడినాయి.భూమినీ, నీటినీ క్షయం కాకుండా, నిస్సారం కాకుండా, వృధా కాకుండా పరిరక్షించుకోవలసిన బాధ్యతను వేదభాగాలు వివరించాయి.

వృక్షాలను నరకడం పాపమని ఎన్నో మంత్రాలు పేర్కొన్నాయి. పురాణాల్లో,
ధర్మశాస్త్రాలలో కూడా చెట్లను నరికితే పాప ఫలాలనుభవించాల్సి ఉంటుందని
హెచ్చరించాయి. యజ్ఞదుల్లో వాడే సమిధలు కూడా ఎండిన కట్టెలు మాత్రమే.
తమంత తాము ఎండిన కట్టె పుల్లలను ఏరి తెచ్చి వాడడమే యజ్ఞంలో కర్తవ్యం.
చెట్లను నరకడం కానీ, పచ్చి చెక్కలను ఉపయోగించడం యజ్ఞంలో నిషేధం.

అలాగే పంటలను పండించే పద్ధతుల్లో కూడా భూసారం క్షయం కాకుండా ఉండే విధానాలను ప్రాచీన వాఙ్మయాలు బోధించాయి. గోఘృతం, పలాశాది
సమిధలు, గోమయంతో చేసిన పిడకల వలన రేగే అగ్నిలో, మంత్ర సహితంగా
హుతం చేయడం వలన రేగే ధూమం వాయుమండలంలో శుద్ధిని కలిగించడమే
కాక, ప్రాణశక్తిని నింపి పర్యావరణాన్ని బలోపేతం చేస్తుందన్న యజ్ఞవిజ్ఞానం నేటి
శాస్త్రపరిశోధనల్లో కూడా సత్యంగా తేలింది.

ఎటువంటి కాలుష్యాలు లేని వాయువు మందు వలె ఆరోగ్యాన్ని కలిగిస్తుందనీ,
శుభాన్నీ, శాంతినీ, ఆహ్లాదాన్నీ ప్రసాదిస్తుందని పై ఋగ్వేద మంత్రం చెబుతుంది. ఓషధీ విలువలు కలిగిన తులసి, బిల్వం, ఉసిరిక వంటి చెట్లను పరిసరాలలో పెంచడం వల్ల వాయువులో శుభ్రత, ఆరోగ్యం లభిస్తాయి అని ఆర్షగ్రంథాలు వెల్లడిస్తున్నాయి.


విజ్ఞానం పేరుతో ప్రగతి సాధిస్తున్నామనే భ్రమలో భూ, జల, వాయు, ధ్వని
కాలుష్యాలను విస్తరింప జేస్తున్న నేటి నాగరికత - వేదసంస్కృతి ఆదర్శాలను
స్వీకరించాల్సిన అవసరముంది.

ఇమా ఆపః ప్రభారామ్యయక్ష్మా మక్ష్మనాశనీః॥ (అథర్వవేదం)

'రోగంలేని, రోగాలని పోగొట్టగలిగే జలాలను కాంక్షించే అథర్వ వేదభావన జలశుద్ధిని పేర్కొంది.

"శం నో దేవీరభీష్టయ ఆపో భవన్తు పీతయే" అని జలాలు శుభకరం కావాలని
ఋగ్వేదం సంభావించింది. మౌనం, ధ్యానం, పవిత్రకరమైన వాక్కు, స్వరసహిత
వేద ఉచ్చారణ మొదలైన ధ్వని కాలుష్యనివారణ సాధనలు కూడా వేద నాగరికతలో కనిపిస్తాయి.

‘వాచం వదామ భద్రయా' - శుభకరమైన భావనతో పలికే మాటలు శబ్దశుద్ధతని
ప్రకటిస్తాయని అథర్వవేద సంభావన. యంత్రాల రొదలో, హోరులో బ్రతుకుతున్న
మనకి ప్రశాంత ప్రకృతి నాదాలతో సహజీవనాన్ని బోధించిన తపోభూముల
నిర్మలత్వాన్ని స్మరించితే చాలు శాంతి లభిస్తుంది.

భౌతిక కాలుష్యాలనే కాక అంతరిక కాలుష్యాలను సైతం నివారించే పవిత్ర
భారత ఋషి సంస్కృతిని తిరిగి ప్రతిష్ఠించగలిగినప్పుడు ప్రపంచ కాలుష్య సమస్యను నివారించి, చల్లని పుడమిని సాధించగలం.

☘️🍁 ఆప్తవాక్యాలు 🍁☘️


119. సానో భూమిర్గోష్వప్యన్నే దధాతు

భూదేవి మా గోవులయందు, అన్నమునందు సమృద్ధిగా అనుగ్రహించు గాక (అథర్వవేదం)

వేదవారసత్వంలో మహర్షుల తపోదృష్టి సంస్కార సంపన్నమైన విజ్ఞానాన్ని ఆవిష్కరించింది. అందులో మనకు ఆధారమైన భూమి ఎన్ని విధాల మనకు పోషకమౌతుందో అద్భుతంగా కీర్తించారు. విశ్వాధారమైన ఈశ్వరశక్తి ఒక తల్లి
శిశువును కాపాడినట్లుగా మనల్ని పోషిస్తోంది. అందుకే ఆ శక్తిని 'జగన్మాత' అని సంభావించి, ఆ మాతృత్వం భూమి ద్వారా మనకి లభిస్తున్న సత్యాన్ని గుర్తించి,
ఆరాధించి ఆనందంగా జీవించమని మనలను ప్రబోధించారు.

“సానో భూమిర్విసృజతాం మాతా పుత్రాయ మే పయః" అని పృథ్వీసూక్తంలోని మంత్రవాక్యం. 'పుత్రుడైన నాకు క్షీరా(పోషకమైన ఆహారం)న్ని భూమాత అందించు గాక!'

విశ్వమయుడైన విశ్వపతి విష్ణువు పత్ని(విడదీయలేని శక్తి)గా, భూలక్ష్మిగా ఈ పృథ్విని గౌరవించిన కారణంగా భూమియందున్న వివిధ సంపదలను లక్ష్మీ రూపాలుగా దర్శించే వైదిక సంస్కారం మనకు పరంపరగా ప్రాప్తించింది.

ఒకచోట మహోన్నత పర్వతాలు, మరొక చోట జలప్రవాహాలు, ఇంకొక తావున సారవంతమైన సస్యశామలక్షేత్రాలు, వేరొక స్థలాన కేవల శిలాభూములు, ఒకచోట
పంటలనిస్తోంది. మరొక చోట రత్నాలనందిస్తోంది. అన్యత్ర ఇంధనాలను సమకూర్చుతోంది.

ఇందులో ఒక చోట దొరికేదానిని గ్రహించి, మరొక చోట అది లేని వారితో పంచుకొని, వారి నుండి మనకు లేనిదానిని పొందడం... అనే పరస్పర స్నేహపూర్వక సమన్వయం ద్వారా, ఒకే భూమాత వాత్సల్యాన్ని మనందరం అనుభవించవచ్చు.

ఈ విధమైన దృష్టితోనే 'జననీ పృథివీ కామదుఘాస్తే' అన్నారు కంచి మహాస్వామి శ్రీశ్రీశ్రీ చన్ద్రశేఖరేన్ద్రసరస్వతీస్వామివారు. పుడమితల్లి మనకు కామధేనువు. కనిపించే ఈ భూమాత కనిపించని ఒక సమస్త విశ్వసంచాలకునిచే ధరింపబడి ఉంది. అతడే
యజ్ఞస్వరూపుడైన నారాయణుడు. ఆయన కృపయే భూరూపంలో మనల్ని అనుహ్రిస్తోంది. అందుకే భూరూపంలోనున్న పరమేశ్వర కృపను 'శర్వాయ క్షితిమూర్తయే
నమః' అంటూ, ఆ సదాశివుని అష్టమూర్తులలో ఒకటిగా భూమిని వర్ణించారు.

కామదుఘా, పయస్వతి, సురభి, ధేనుః, వసుంధరా వంటి అనేక నామాలు వేద వాఙ్మయంలో భూమికి చెప్పబడ్డాయి. ఆ నామాలలో భూదేవిలోని వివిధ శక్తులను
గుర్తించవచ్చు.

భూమికి, గోవులకూ ఉన్న అనుబంధాన్ని వేదసంస్కృతి ప్రస్ఫుటంగా వర్ణించింది.
పురాణాల్లో కూడా భూమి గోరూపం ధరించి పృథుచక్రవర్తికి కనబడినట్లుగా
వర్ణించారు. అలాగే దుష్టుల భారాన్ని భరించలేని భూమి తనను కాపాడమని పరమాత్మతో వేడుకోవడానికి గోరూపం ధరించినట్లుగా పురాణాలు వర్ణించాయి.పరీక్షిన్మహారాజుకి కూడా భూమి గోరూపంలోనే సాక్షాత్కరించింది. అందుకే గోవుల
క్షేమం భూమికి క్షేమం.

గోవులు అనే మాటకి ఇంద్రియాలు, కిరణాలు, వేదవాక్యాలు అనే వైదికార్థాలను కూడా గ్రహిస్తే, భూమి ద్వారా ఇవన్నీ సమృద్ధిని పొందుతాయి... అనే భావాన్ని
స్వీకరించవచ్చు. మానవులు మాత్రమే కాక దేవతలు, ఋషులు, ఇతర విశ్వశక్తులు కూడా యజ్ఞమయి అయిన భూమి నుండే సమస్తపుష్టినీ పొందుతున్నట్లుగా వేదపురాణాలు విశదపరచాయి. మన ప్రాచీనుల దృష్టిలో విశ్వక్షేమానికి కేంద్రం
భూమియే.

ఈ భూమికి సద్ధర్మమే రక్ష. దాని వల్లనే భూమి సంపదలని ఇవ్వగలిగే సామర్థ్యాన్ని పొందుతుంది. ధర్మహీనత వల్ల భూరూప గోవు వట్టిపోతుంది. అందుకే ధర్మరక్షణతో
భూమిని రక్షించుకుందామని వేదవాక్కుల ప్రమాణంతో ఉద్యమిద్దాము.

☘️🍁 ఆప్తవాక్యాలు 🍁☘️


118. యద్యదాచరతి శ్రేష్ఠః తత్తదేవేతరో జనః

గొప్పవాడు అనిపించుకున్నవాడు ఏది చేస్తే ఇతరులూ దానినే అనుకరిస్తారు
(భగవద్గీత)

ఎంత గొప్పవారైనా ఎవరి మర్యాద వారు పాటించక తప్పదు. లోక మర్యాదలను అనుసరించడం అనివార్యం. అవతార పురుషులైనప్పటికీ ఏ ఉపాధిని స్వీకరించారో ఆ ధర్మాన్ని అనుసరించవలసిందే! అందునా గొప్పవారనిపించుకున్నవారు మరింత
శ్రద్ధగా ధర్మాన్ని ఆచరించాలి. ఎందుచేతనంటే తనను గమనిస్తూ ఆదర్శంగా అనుసరించడానికి చాలామంది ఉంటారు. అందుకే తనకు అవసరం లేకపోయినా
తాను ఆచరించాలి.

శ్రీకృష్ణపరమాత్మ, శ్రీరాముడు కర్మజన్మలను దాల్చలేదు. లీలా జన్మలను ధరించిన అవతారమూర్తులు. అయినా సత్కర్మాచరణను విడిచిపెట్టలేదు. వారి పితృభక్తి, గురుభక్తి,
లోకమర్యాదాపాలన అంతా అపూర్వ ఆదర్శం.

జగద్గురువులైనా గురువుల వద్ద వినయంగా శిక్షణ పొందారు. లోక పాలకులైనా ధర్మాన్ని ఏమరలేదు. గుర్రాలను తోలే(సారథ్యం) పనిని చేపట్టాక రథాలను శుభ్రపరచడం, అశ్వాల బాగోగులను చూసుకోవడం ఏమరలేదు జగదీశుడు.
ఎందుచేత?

“గొప్పవాడు అనిపించుకున్నవాడు ఏది చేస్తే ఇతరులూ దానినే అనుకరిస్తారు.అందుకే అనుక్షణం అప్రమత్తత అవసరం" అని బోధించి, ఆచరించాడు గీతాచార్యుడు.

ఒకసారి బలరాముడు తీర్థయాత్ర చేస్తూ నైమిశారణ్యానికి చేరుకున్నాడు. అక్కడ
సూతమహర్షి శౌనకాదులకు పురాణ కథలు వినిపిస్తున్నాడు. ఆ సమయంలో ప్రవేశించిన బలరాముని చూసి శౌనకాది మహర్షులు లేచి నమస్కరించి, ఉచితాసనాన్ని
ఇచ్చారు. "మహాత్మా! నారాయణాంశ సంభూతులైన మీరు రావడంచేత మేము ధన్యులం” - అని కీర్తించారు శౌనకాదులు.

తనను సత్కరించి కీర్తించే మహర్షుల స్తోత్రాలకు ఉబ్బిపోయి అహంకరించిన బలరాముడు, తనను చూసి సమస్కరించకుండా కూర్చున్న సూతుని గమనించాడు.తనను అవమానించినట్లుగా భావించాడు. కీర్తిస్తున్న వారికి తన ప్రతాపం
ప్రకటించాలనుకున్నాడు.

"ఈ సూతుడు అల్పజన్ముడు. వ్యాసుని వల్ల విద్యలు నేర్చుకుని పౌరాణికుడయ్యాడు.
ఈ అహంకారిని శిక్షించాలి" - అని సంకల్పించుకుని ఒక దర్భను అభిమంత్రించి సూతునిపై ప్రయోగించాడు. సూతుడు మరణించాడు. సగర్వంగా చూశాడు బలభద్రుడు.శౌనకాదులు హాహాకారాలతో బలరాముని దూరం వెళ్ళమని గర్జించారు. "నువ్వు
పాపాత్ముడవు. బ్రహ్మహత్య చేశావు. నీలాంటివాడు ఈ ప్రాంతంలో ఉంటే
దేవతాశక్తులు రావు. దయచేసి ఈ ప్రాంతాన్ని వదలి వెళ్ళు" - అని ఏవగించుకున్నారు.

ఆశ్చర్యచకితుడైన బలరాముడు - “మహాత్ములారా! నన్ను దైవాంశసంభూతునిగా
కీర్తించిన మీరు ఇలా నిందించడం ఆశ్చర్యంగా ఉంది" అని వినయంగా అడిగాడు.

"బలరామా! ఎంత దైవాంశసంభూతుడైనా ధర్మభ్రష్టుడు శిక్షార్హుడే. సూత పౌరాణికులు దివ్య విషయాలను బోధిస్తున్న గురుస్థానంలో ఆసీనులై ఉన్నారు.
వ్యాసపీఠాన ఉపవిష్ణులై ఉన్నారు. ఆ ఆసనంపై ఉన్నవారు ఎవరు సభలో ప్రవేశించినా లేచి నిల్చోరాదు. అలా చేస్తే వ్యాసుని అవమానించినట్లే. అందుకే సూతులు నీవు వచ్చినా లేచి నమస్కరించలేదు. తన ధర్మాన్ని తాను పాటించారు. నీవు అది గ్రహించక నిర్దాక్షిణ్యంగా, నిష్కారణంగా ఆయనను వధించావు. ఈ పాపానికి నువ్వు ప్రాయశ్చిత్తం
చేసి తీర్థస్నానాలు చేసి రావాలి" అని నిర్దేశించారు మహర్షులు.

తన యోగశక్తితో సూతుని తిరిగి బ్రతికించి, క్షమించమని వేడుకొని, ధర్మశాస్త్ర ప్రకారం తీర్ధసేవనం చేసి పాపాన్ని బాపుకొన్నాడు బలరాముడు.

ఈ కథను గమనిస్తే - ఎంతటి గొప్పవాడైనా తన హోదానీ, పదవినీ, ప్రతిభనీ అడ్డం పెట్టుకుని పాపానికి ఒడిగడితే క్షమార్హుడు కాడు అని తెలుస్తుంది. ధర్మ విషయంలో మొహమాటం లేని మేధావి వర్గం నిలదీసినప్పుడు, ఎంత పెద్దలైనా
హద్దుల్ని అతిక్రమించరు.

Live stream finished (1 day)

☘️🍁 ఆప్తవాక్యాలు 🍁☘️


117. పక్షేభిరపి కక్షేభిరత్రాభి సంరభామహే

మా పక్షము వారితో, ఇతర పక్షములతో అన్ని విధాల కలిసి పనిచేయుదుము (వేదవాక్యం)

గొప్పజీవితము కలవారు ఎలా ప్రవర్తించాలనుకుంటారో పై మంత్రంలో
కనబడుతుంది. తమవారు, పై వారు అనేది తప్పనిసరి విభజన. వ్యక్తికిగానీ, ఒక సామూహిక విభాగానికిగానీ ఈ భావాలు అనివార్యం. అయితే 'సమాజ శ్రేయస్సు' అనే లక్ష్యం సాధించడంలో అందరూ సమైక్యం కావాలి.

ఒకొక్క పక్షంలో ఒకొక్క ప్రత్యేకత ఉంటుంది. ఆ ప్రత్యేక సులక్షణాలను ఏ విధంగా వినియోగించి మంచిని సాధించవచ్చో గ్రహించి ఏకత్వం సాధించాలి.

మొత్తానికి పై మంత్రం చెప్తున్న గొప్పభావం - "పక్షపాతం లేకుండా ఉండడం”.

మంచి ఏ పక్షాన ఉన్నా దానిని ప్రశంసించాలి, ప్రోత్సహించాలి, స్వీకరించాలి.

కులం, మతం, వర్గం, వర్ణం, సిద్ధాంతం, పార్టీ... ఇలా ఎన్నో పక్షాలు ఏ సమాజంలోనైనా ఉంటాయి. ఎవరైనా అటూ యిటూ ఉన్నవారు మనుష్యులే. వారి మధ్య వైషమ్యాలు కూడా అనివార్యమే.

తన పక్షం కానివారు ఏం చేసినా తప్పుగా కనబడడమో, తప్పుగా చూపించాలని తాపత్రయ పడడమో సహజం. అదే విధంగా తన పక్షం ఎప్పుడూ సరియైనదే అనే
భావమూ సహజమే. కానీ అవతలి తప్పును ఎండగట్టడానికి, వారు దోషం చేయకుండా నిగ్గదీయడానికి ఈ భావం పనికివస్తుంది. ప్రశ్నించి, నిలదీసి అడ్డుకునే విపక్షం
ఉన్నప్పుడు ఇవతలి పక్షంవారు జాగ్రత్త వహిస్తారు. ఇదొక విధంగా 'నియంత్రణ'గా సహకరిస్తుంది.

కానీ - ప్రతి మంచిని అడ్డుకొని, ధ్వంసం చేసే విషమభావం కలిగిన విపక్షతత్త్వము ప్రమాదకరమే.

ఈ అవాంఛనీయ వైపరీత్యం కలగకుండా ఉండాలని పై మంత్రాకాంక్ష. యుగాలనాటి వేదధర్మంలో సమాజంలో సౌమనస్య, సామరస్యాలను ఎంత చక్కగా
ఆకాంక్షించారో ఈ మంత్రమే చెబుతుంది. సమైక్య సమాజ దృక్పథం కలిగిన గొప్ప నాగరికత ప్రాచీన భారతీయ సిద్ధాంతంలో అత్యంత సహజంగా ఉందని ఈ
వేదవిజ్ఞానమే స్పష్టపరుస్తోంది.

ఈ మంత్ర పూర్వభాగంలో... “దేవతా సంబంధులమైన మేము ఎవరినీ
హింసించము. ఎవరినీ దారి తప్పించము. మంచి ఆలోచనా విధానాన్ని అమలు పరుస్తాము” అనే మంత్రముంది. 'దేవతా సంబంధులు' అంటే విశ్వహితాన్ని కాంక్షించే
సుమనస్కులు. సమూహహితం కోసం వైయుక్తిక పక్షపాత ధోరణులను పరిత్యజించాలి.అని శ్రుతిమతం - అదే దివ్య జీవనం. ఈ దివ్యలక్షణాన్ని సమాజంలో ప్రబోధించి
భారతీయధర్మాన్ని పటిష్ఠపరచాలి.

సమైక్యత భారతీయ హైందవ సహజ విధానం.

హిందువులకు సమైక్య జీవనం, సహన సామరస్య భావన రక్తనిష్ఠమైనవి. వేదకాలం నుండి విస్తరిల్లిన ఈ పవిత్ర భావన ముఖ్యంగా నాయకవర్గాల వారు గ్రహించాలి. చక్కని పాలనా విధానానికి ఇదే పరమమంత్రం.

స్వపక్ష, విపక్షాలు దేశహితం కోసం ఏకోన్ముఖంగా కృషి చేయడం కంటే ప్రగతి ఏముంటుంది?

☘️🍁 ఆప్తవాక్యాలు 🍁☘️


116.ఉన్మేషనిమిషోత్పన్నవిపన్నభువనావళిః

రెప్పలు మూయడంలో విలయాన్నీ, తెరవడంతో సృష్టినీ, చూపుల ప్రసరణతో స్థితినీ కొనసాగించే చైతన్యశక్తి లలితాంబిక (లలితా సహస్రనామం)

విశ్వరచనకు మూలం 'ఈక్షణశక్తి' అని మన వైదిక శాస్త్రాల వచనం. (స ఐక్షత బహుస్యాం ప్రజాయేయ - అని వైదిక వాక్యం).

పరమాత్మ కళ్ళు తెరచి ఈ జగతి నిర్మాణాన్ని సాగించాడు. అంతర్ముఖ యోగనిద్ర అంటే కళ్ళు మూసుకోవడం. ఈ స్థితిలో జగమంతా ఆ పరబ్రహ్మలో అణగి ఉంటుంది.తిరిగి వెలికితీయడమే కనులు తెరవడం. ఇది బహిర్ముఖం. ('ఒకపరి జగముల వెలిని, ఒకపరి లోపలికి గొనుచు' - అని భాగవత వచనం)

కేవలం ఆ కనుచూపులతోనే ఈ జగద్రచనను కొనసాగించినది పరమేశ్వర శక్తి.మనం కళ్ళు తెరచుకున్నప్పుడు లౌకిక వ్యవహారాలను సాగించి, తిరిగి నిద్రతో
(కనుమూతతో) విశ్రమిస్తాం. అదేవిధంగా - జగతి సృష్టి స్థితి లయల వికసనమే కనులు తెరచుకున్నట్లుగా, తిరిగి అంతర్లీనావస్థయే కనులు మూసుకున్నట్లుగా సంభావించారు మహర్షులు.

ఈ చూపుల శక్తినే 'ఈక్షణశక్తి' అంటారు. సమర్థుడైన పాలకుడు కనుసైగలతోనే పాలన సాగించినట్లుగా పరమాత్మ చైతన్యం తన చూపులతోనే విశ్వాన్ని నిర్వహిస్తున్నది.ఆ కటాక్ష రూపచైతన్యాన్ని విశ్వపోషణ చేసే మాతృరూపంగా ఆరాధించడం మన
సంప్రదాయం.

“నీ కటాక్ష వీక్షణాలను నాపై ప్రసరింపజేయమ"ని అమ్మవారిని మనం ప్రార్థిస్తాం.కనులు తెరచి మూసుకోవడమే వ్యాకోచ సంకోచాలు. వికసనం, ముకుళం. ఈ వీక్షణశక్తిగల పరమాత్మను, ఉపాసన సంప్రదాయంలో 'మీనాక్షి, విశాలాక్షీ, కామాక్షీ' అనే పేర్లతో జగదంబా రూపంగా ఆరాధిస్తున్నాం. కన్నులు భావాల స్థానాలు.కాంతి క్షేత్రాలు. బహుభావాల జగతికి మూలశక్తులివి.

తన చూపులతోనే విశ్వాన్ని సంరక్షించి పోషించే జగన్మాతను 'మీనాక్షి' అన్నారు.

ఈ విశాల విశ్వంలో ప్రతి అణువును గమనించే తల్లి కటాక్షానికి అవధి లేదు.ముక్కాలాలని, ముల్లోకాలని నిత్యం వీక్షించే అనంత దర్శనశక్తి కల తల్లి కనుక ఆమె 'విశాలాక్షి'. సర్వజనుల మనోకామనల్ని కరుణ నిండిన చూపులతోనే నెరవేర్చే లోకజనని కనుక 'కామాక్షి'.

క + అ + మ = కామ. ఈ నామం పరబ్రహ్మవాచకం. సృష్టిస్థితి లయలకు
హేతుభూతమైన ఈశ్వరశక్తి ఇది. 'క' అనే అక్షరం మంత్ర (శబ్ద) శాస్త్ర రీత్యా
బ్రహ్మవాచకం. 'అ' విష్ణువాచకం, 'మ' రుద్రవాచకం'. ఈ మూడు సృష్టి స్థితి లయలకు హేతువైన సత్వరజస్తమోగుణాలకు, త్రికాలాలకు, త్రిలోకాలకు, ఓంకారంలోని అక్షరత్రయానికి సంకేతాలు. ముగురమ్మల సంకేతం కూడా ఇదే. ఈ మూడింటినీ
నిర్వహించే మూలపుటమ్మ కనుక 'కామాక్షి' (కనుచూపులతోనే సృష్టి స్థితిలయలను సాగించే తల్లి). ‘'త్రిపురసుందరి' తత్త్వం ఈ పేరులోనే ఉంది.

సూర్యుచంద్రులు కూడా అమ్మ నేత్రాల శక్తులే కదా! అందుకే అమ్మవలె అందరిపైనా సమంగా ప్రసరిస్తూ, పోషిస్తూ విశ్వానికే ప్రాణశక్తిని అందిస్తున్నారు. బ్రహ్మాండ
జనని సూర్యచంద్రాత్మిక శక్తుల్ని తన నేత్రాల నుండే నిర్వహిస్తున్నది. అంటే మనం నిత్యం ఆ తల్లి చూపుల చలువతోనే బ్రతుకులను సాగిస్తున్నామన్నమాట. ఇది తెలిస్తే
నిత్యం అమ్మ సన్నిధిలోనే ఉన్నామన్న ఆనందాన్ని సొంతం చేసుకొని - పిల్లల్లా
నిశ్చింతగా, నిర్మలంగా, నిబ్బరంగా, హాయిగా ఒక ఆటలా జీవితాన్ని గడపగలం.ఈ గ్రహింపునే జ్ఞానం అంటారు.

అమ్మవారికి 'శతాక్షి' (అనంత దర్శన శక్తి గలది), 'ఆమ్నాయాక్షి' (ఎడతెగని
చూపులు గలది, వేదవిజ్ఞానాన్ని ప్రసరించే శక్తి) - వంటి నేత్ర సంబంధ
నామాలున్నాయి.

Live stream started