Devotional Telugu @devotional Channel on Telegram

Devotional Telugu

@devotional


An attempt to bring our Hindu Devotional information

Devotional Telugu (Telugu)

దేవోషనల్ తెలుగు చానల్ విశ్వభరితంగా ప్రఖ్యాతమైన హిందు భక్తి సమాచారాన్ని తెలుగు భాషలో వినియోగించడంలో ఒక ప్రయత్నము. ఈ చానల్లో అసలు మాహితిని మరియు అర్థం వేరు ప్రేమతో షేరు చేయడం ఉద్దేశము. ఇస్తంతానికి, అసలు మాహితిని ఉచితాన్ని అందించే భారతీయ సాహిత్య వందలు, ప్రార్థనలు, భక్తి గీతాలు మరియు అంధరిని ఆకర్షించే భక్తి కథలు కూడా అందుచిస్తారు. దేవోషనల్ చానల్ నామంలో - 'దేవోషనల్ తెలుగు' అనే సూచనను సూచించే ఈ చానల్ తెలుగు భాషలో హిందు భక్తి సమాచారం తెలియజేస్తుంది. అందుబాటులో ఆస్తికులు తో పరస్పర అభిప్రాయం దాటవచ్చు, ఆరాధనల్లో భాగం లభిస్తుంది, మరియు దేవుడు, దేవి, దేవతలు, మరియు అన్య హిందు ఆధ్యాత్మిక విషయాలు పై తన నిర్ణాయకత్వం మరియు మూల్యాన్ని పంపుతుంది. అంతే, దేవోషనల్ తెలుగు చానల్ అందించిన గ్లోబల్ హిందు భక్తి సమాచారాన్ని ఆనారోగ్యంగా సందర్శించండి.

Devotional Telugu

10 Jan, 16:51


సమయం రావాలి!

ఒకసారి ఓ సాధువు శిష్యులతో ఓ గ్రామంలో బస చేసి అక్కడి ప్రజల సమస్యలను తెలుసుకుంటూ, పరిష్కార మార్గాలను సూచిస్తున్నాడు. అది తెలిసి పొరుగూరి రామయ్య, భీమయ్య ఆయన దగ్గరకు వచ్చారు. తమ గోడు విన్నవించుకున్నారు. 'మమ్మల్ని దరిద్రం పట్టిపీడిస్తోంది. మాకు నిధి నిక్షేపాలక్కరలేదు. మడులూ మాన్యాలక్కరలేదు. కడుపునిండా తిండి దొరికే మార్గం చూపండి స్వామీ!' అని వేడుకున్నారు. సాధువు సంచిలోంచి ఒక పొట్లం తీసి, దాంట్లోంచి రెండు విత్తనాలు ఇద్దరికీ ఇచ్చాడు. 'వీటిని తీసుకెళ్లి నాటండి.

మొక్క పెరిగి మధురఫలాలను ఇస్తుంది. వాటి రుచి అమోఘం. మంచి ధర పలుకుతుంది. మీకు ఆస్తులు గడించి పెట్టకపోయినా, ఆకలిబాధ లేకుండా ఆదుకుంటుంది' అన్నాడు. వాళ్లు సంతోషించారు. తిరిగెళ్లాక నేల చదును చేసి విత్తనం నాటి నీళ్లు చల్లారు. నాటిన దగ్గర్నుంచీ రామయ్య గింజ ఎప్పుడు మొలుస్తుందా అని ఎదురు చూసేవాడు. వారమైంది, పదిరోజులైంది.

మొలక రాలేదు. తవ్వి చూస్తే విత్తనం అలాగే కనిపించింది. ఇంకేం మొలకెత్తుతుందని కోపంగా తీసి పారేశాడు. మరో వారం తరవాత భీమయ్య పాతిన గింజ మొలిచింది. చకచకా ఎదిగి కాపు పట్టింది. మధురమైన ఆ పండ్లను అమ్మి సొమ్ము చేసుకుంటున్న భీమయ్యను చూసి తాను ఆ అవకాశాన్ని కోల్పోయినందుకు రామయ్య బాధపడ్డాడు. గుడ్డు నుంచి కోడిపిల్ల రావటానికి 21 రోజులు పడుతుంది. గర్భంలోని శిశువు భూమ్మీద పడటానికి తొమ్మిది నెలలు పడుతుంది.

ఏ పనులు నెరవేరాలన్నా కొంత సమయం పడుతుందన్న ఇంగితజ్ఞానం లేకపోతే ఫలితం అనుభవించక తప్పదు.

ఒక్కోసారి మనం పడిన కష్టానికి తగిన గుర్తింపు వెంటనే లభించదు. అలాంటప్పుడు కుంగిపోవడం, నిగ్రహం కోల్పోవడం తగదు. బాణభట్టారకుడనే మహాకవి పద్దెనిమిదేళ్లకే 'కాదంబరి' అనే గ్రంథం రాసి, రాజాశ్రయానికెళ్లాడు. అక్కడున్న పండితులు ఇతణ్ని హేళన చేశారు. 'కాదంబరి' అంటే కల్లు. కల్లు తాగితే రుచి తెలియదని రాజు భావించి పరిపక్వత లేదు, పొమ్మన్నాడు.

బాధపడిన బాణుడు ఇంటికెళ్లి కోపంతో కావ్యాన్ని తగలెట్టాడు. రెండురోజుల తరువాత కాళిదాసు వెళ్లి 'అబ్బాయ్, నీ కాదంబరిని మరోసారి వినిపించు' అంటే బాణుడు తెల్లముఖం వేసి విషయం చెప్పాడు. 'సరేలే, నేను చెప్తా రాసుకో అని ఏకసంధాగ్రాహి అయిన కాళిదాసు తాను విన్న కాదంబరిని ఉన్నదున్నట్లుగా అప్పజెప్పాడు.

లేకపోతే కాదంబరి మనకు దక్కేది కాదంటూ బహుళ ప్రచారంలో ఉన్న కథ తొందరపాటు చర్యలు ఎంత నష్టం కలిగిస్తాయో చెబుతుంది.

మరికొందరుంటారు... పర్యవసానం గురించి ఆలోచించకుండా తోచిన పని చేసేస్తారు.

అవివాహిత అయిన కుంతి దుర్వాసుడిచ్చిన వరాన్ని ముందుచూపు లేకుండా ఆచరణలో పెట్టబట్టే కదా అంత కడుపుకోత అనుభవించింది. ఏ పనికైనా ముందు వెనకలు ఆలోచించి, సమయాసమయాలు చూసి నిర్ణయాలు తీసుకోవాలి.

Devotional Telugu

05 Jan, 02:44


అందరిలో నారాయణుడు

తప్పులెన్నువారు తమ తప్పులెరుగరు... అంటాడు వేమన. మన సమాజంలో కొందరు ఇతరుల్లోని లోపాలను అదేపనిగా వేలెత్తి చూపిస్తూ విమర్శిస్తూంటారు. గురివింద తన మచ్చ ఎరగనట్లు తమలోని లోపాలను గుర్తించకుండా ఎదుటివారిలో తప్పులు వెతుకుతూ వారిని విమర్శించడం వల్ల మిగతా నష్టాలను అలా ఉంచితే ముఖ్యంగా అనుబంధాలు దెబ్బతింటాయి.

నిజానికి భగవంతుడి దృష్టిలో అందరూ సమానులే. లోపాలు, దోషాలు ఉన్నంతమాత్రాన సాటివారిని తక్కువగా చూడకూడదు. రూప భేదాలు భౌతికమైన దేహానికే గానీ మనసులకు లేవు. ప్రతీ ప్రాణి హృదయంలో ఆ పరమాత్మ కొలువై ఉంటాడు. అందుకే ఈ సృష్టిలో ప్రతి జీవినీ ప్రేమించాలి. ప్రతి ప్రాణిలోనూ ఆ పరమాత్మను దర్శించే స్థాయికి చేరుకోవాలి. మనిషి సంఘజీవి. ఈ సమాజంలో ఒకరి సహకారం లేకుండా మరొకరు బతకలేరు. ఎంత గొప్పవారైనా మరొకరిపై ఆధారపడకుండా జీవించలేరు.

అందుకే వృత్తి వల్లనో, రూపాన్నిబట్టో, బలహీనతల కారణంగానో ఎవరినీ చిన్నచూపు చూడకూడదు.

ఈ సమాజానికి అందరూ అవసరమే. నవ్విన నాపచేనే పండుతుందన్నారు పెద్దలు. పరాక్రమవంతుడైన రాముడికి వానరసేన సాయం చేసి విజయానికి తోడ్పడింది. అల్పవస్తువులు, అల్పజీవులు అంటూ ఈ సృష్టిలో ఏమీ లేవు.

తండ్రి శాపం వల్ల ఎనిమిది వంకరలున్న ఆకారంతో పుట్టాడు అష్టావక్రుడు. తన అసమాన పాండిత్యంతో ఆస్థాన పండితుడైన వందిని ఓడించి, తండ్రిని చెరనుంచి విడిపించాడు. అలాగే వామనుడు బలిచక్రవర్తిని పాతాళానికి
అణచివేశాడు.

అధికారం, ధనం, అందం వీటివల్ల మనిషికి కీర్తిప్రతిష్ఠలు లభించవు. మంచి నడవడి, సాయపడే గుణం, పాండిత్యం, వివేకం వల్ల మాత్రమే మనిషి కీర్తికాయుడవుతాడు. తియ్యని పండ్లనిచ్చే చెట్ల మధ్య వేపచెట్టు నిరాదరణకు గురైనప్పటికీ అవసరమైనప్పుడు అదే దివ్యమైన ఔషధంగా పనిచేస్తుంది. అంధులైనా, మూగవారైనా, కటిక పేదలైనా మనోబలంతో ఎన్నో విజయాలు సాధించవచ్చని నిరూపించిన మహాత్ములెందరో ఉన్నారు. రెండుపదుల వయసు నుంచే వినికిడి శక్తి నశించడం మొదలెట్టినా చాలాకాలం పాటు అది ఎవరికీ తెలియకుండా ప్రదర్శనలిచ్చాడు బీథోవెన్. కటిక దారిద్య్రం వెంటాడినా మనోబలంతో విద్యావంతుడై అమెరికా అధ్యక్షుడు కాగలిగారు అబ్రహం లింకన్. ఎవరికైనా బుద్ధిబలం, మనోబలమే ముఖ్యం.

వాటితో ఎలాంటి ఘనకార్యాలనైనా సాధించవచ్చు. ఇంక ఎదుటివారిలో మనకు నచ్చని గుణాలున్నాయని వారిని విమర్శించే ముందు అటువంటి గుణాలు మనలో ఉన్నాయేమోనని ఆత్మవిమర్శ చేసుకోవాలి. ఆ స్వభావమే మనసును ప్రక్షాళన చేస్తుంది. వ్యక్తిత్వాన్ని ఉన్నతంగా తీర్చిదిద్దుతుంది.

సాటి మనిషిని నారాయణుడిగా భావించాలన్నాడు వివేకానందుడు. సర్వ ప్రాణుల్లోనూ తనను చూడగలిగినవాడే తనకు ప్రీతిపాత్రుడని శ్రీకృష్ణుడు చెప్పాడు. సర్వసమభావనతో అందరినీ ప్రేమించేవాళ్లే ప్రజల మనుషులుగా ఎదుగుతారు. లోకకల్యాణం కోసం పాటుపడతారు.

Devotional Telugu

04 Jan, 11:34


అపార్థాలు ఆధ్యాత్మికోన్నతికి అవరోధాలు!

మాయావి అనే రాక్షసుడు వాలి పాలిస్తున్న కిష్కంధపై ఓసారి యుద్ధానికి బయల్దేరాడు. వాలి కూడా ఎదురుదాడికి దిగాడు. అన్నకు అండగా సుగ్రీవుడూ వెంటవెళ్లాడు. వాలి, సుగ్రీవులను చూసి మాయావి గుహలోకి ప్రవేశించాడు. తమ్ముణ్ణి గుహ ద్వారం దగ్గర ఉండమని చెప్పి, వాలి లోనికి వెళ్లాడు. రోజుల తరబడి గుహలో యుద్ధం కొనసాగింది. వాలి తిరిగి రావటం లేదు. ఒకరోజు గుహ నుంచి నురుగుతో కూడిన రక్తం బయటకు వచ్చింది. రాక్షసుల గర్జనల ధ్వనులు, నిస్సహాయమైన వాలి ఆక్రందనలు సుగ్రీవుని చెవిన పడ్డాయి. రాక్షసులు అన్నను మట్టుపెట్టి ఉంటారని, గుహను మూసేసి కిష్కింధకు తిరుగు పయనమయ్యాడు. తప్పనిసరి పరిస్థితుల్లో రాజ్యభారాన్ని చేపట్టాడు. కొన్నాళ్లకు వాలి మాయావిని చంపి కిష్కింధకు తిరిగొచ్చాడు. పట్టాభిషిక్తుడై ఉన్న సుగ్రీవుణ్ణి చూసి వాలి అపార్థం చేసుకున్నాడు.

రాజ్యకాంక్షతో తమ్ముడు తనను మట్టుపెట్టాలనే ఉద్దేశంతో గుహద్వారాన్ని మూసేశాడని అనుమానించాడు. అపార్థంతో శత్రుత్వాన్ని పెంచుకున్నాడు. అనర్థాన్ని కొనితెచ్చుకుని శ్రీరాముడి చేతిలో హతమయ్యాడు. అలాగే చిత్ర కూటంలో రామలక్ష్మణులు వనవాసం చేస్తున్నప్పుడు, దూరంగా వస్తున్న భరతుణ్ణి, అతని సేనను చూసి సౌమిత్రి అపార్థం చేసుకున్నాడు. భరతుడు తమపై యుద్ధానికి వస్తున్నాడనుకున్నాడు. అప్పుడు శ్రీరామచంద్రుడు 'శుభలక్షణ సంపన్నుడైన భరతుడు బాధతో, పినతల్లి కైకేయిని నిలదీసి ఉండవచ్చు. నాన్నను ప్రసన్నుని చేసుకుని, రాజ్యాన్ని నాకు అప్పగించాలనుకుని ఇక్కడికి వస్తున్నాడేమో! తమ్ముడు నాకు అపకారం చేయాలని ఎన్నటికీ తలచడు' అన్న విశ్వాసాన్ని వ్యక్తం చేశాడు. అందుకే ఆయన లోకానికి ఆరాధ్యనీయుడయ్యాడు. అపార్థాలు మన అభ్యున్నతికి, ఆధ్యాత్మిక ఉన్నతికి అడ్డంకులని నిరూపించాడు.

Devotional Telugu

04 Jan, 01:38


ఇద్దరూ ఇష్టులే!

వెన్నెల వెలుగులో మెరిసిపోతున్న గదిలో అబూ బెన్ ఆథమ్ ప్రశాంతంగా నిద్రపోతున్నాడు. అతడికో కల వచ్చింది. అందులో ఒక దేవదూత బంగారు పుస్తకంలో ఏదో రాస్తూ ఉంటుంది.

'ఏం రాస్తున్నావు?' అడిగాడు అబూ. 'దేవుణ్ని ప్రేమించే వాళ్ల పేర్లను' చెప్పింది. 'నా పేరుందా' ఆత్రంగా అడిగాడు. 'ఊహూ.. లేదు.'

'అయితే... తోటి మనుషులను ప్రేమించే వ్యక్తిగా నా పేరు రాయవా' అని వేడుకున్నాడు. ఆ దేవదూత అంతర్థానమైంది.

రెండో రోజు మళ్లీ కల. మళ్లీ ఆమె... 'భగవంతుడు ఎవరి ప్రేమను దీవించాడో వారి పేర్లను రాస్తున్నాను' అంటూ ఆ జాబితాను చూపింది.

అందులో మొదటి పేరు అతడిదే.

'అబూ బెన్ ఆథమ్' అన్న ఈ ఆంగ్ల కవిత రాసింది జేమ్స్ హెన్రీ లీ హంట్. ఆ కవిత ఆయన ఊహించనంత పేరు ప్రఖ్యాతులను తెచ్చింది.

కవితలో మానవత్వానికి పెద్దపీట వేయటమేదానికి కారణం. కవితారంభంలో ఉన్న వాక్యం.. 'అబూ బెన్ ఆథమ్... అతని వంశం వర్థిల్లుగాక!' అన్నదీ ఒక కారణమే. తోటివారిని ప్రేమించేవారిని దేవుడు దీవిస్తాడని చెప్పడం... ఎంత గొప్ప భావన!

మాధవుణ్నే పూజిస్తూ ఆయనను చేరవచ్చు. అలా కాక, తోటి మానవులకు సేవ చేస్తూ కూడా ఆయనను చేరవచ్చు. మార్గమేదైనా దానిలో ప్రేమ ఉండాలి. ఇది అంతస్సూత్రం. ఆయన ప్రేమను, ఆశీస్సులను పొందాలంటే మన ప్రేమను ఇతరులకి పంచాలి. అంతే. అంతకన్నా ప్రత్యామ్నాయం లేదు. భగవంతుణ్ని ఒక నిర్దిష్ట ప్రదేశంలో ఉంచి అక్కడకు వెళ్లి ప్రార్థిస్తుంటారు కొందరు. దైవమంటే వారికి పూర్తి విశ్వాసం. ఏది జరిగినా అంతా మన మంచికే అనుకుంటారు.

దైవబలం కారణంగానే ఇంతటితో ప్రమాదం తప్పిందంటారు. చేసే పరోపకారం, దానం, ధర్మం అన్నీ దైవాన్ని తలచుకునే చేస్తారు. విశ్వంలోని అణువణువులో దైవాన్ని దర్శిస్తారు.

సర్వాంతర్యామికి ఒక నిర్దేశిత స్థలమా? ఈ సకల చరాచర సృష్టి ఆయనదే అయినప్పుడు ఆయన లేనిదెక్కడ? అని భావిస్తారు మరికొందరు. వీరు తోటివారిని ప్రేమిస్తూ, వారికి కావాల్సిన సేవలు చేస్తూ దేవుణ్నే సేవిస్తున్నట్టు భావిస్తారు. పేదలకు అన్నవస్త్రాలనిచ్చి కాపాడతారు. ప్రకృతి విపత్తులు వచ్చినప్పుడు ముందుంటారు. పరోపకారమే ఊపిరిగా జీవిస్తారు. అందులోనే ఆనందాన్ని పొందుతారు.

భగవంతుడికి ఈ రెండూ ప్రియమైనవే. ఇద్దరూ ప్రీతిపాత్రులే. పండితులు, జ్ఞానులు, మతగ్రంథాలు చెప్పే ఈ ఉదాత్త భావననే పై కవిత ఇంకొకసారి చెబుతోంది. తన ఉనికిని ప్రశ్నించే ఇటువంటి వారినీ దైవం మెచ్చుకుంటాడు. ఎందుకంటే వీరు సాటి మనిషికి సాయపడటం కన్నా గొప్ప విషయం ఇంకోటి లేదని భావిస్తారు. మొదటిది భక్తి మార్గం. రెండవది సేవా మార్గం. రెండింటి లక్ష్యం ఒకటే... సమాజంలో మానవతా పరిమళాలను వ్యాపింప జేయటం.

Devotional Telugu

03 Jan, 17:07


జ్ఞాన స్వరూపం

భారతీయ ఆధ్యాత్మిక గురు పరంపరలో రామకృష్ణ పరమహంస ముఖ్యులు. పరమ గురువైన వారి ఉపదేశాలు లౌకిక వాసనల్ని చెరిపేసి ఆధ్యాత్మికపథం వైపు నడిపిస్తాయి. వ్యక్తి ఆలోచనా విధానాలను సమూలంగా మార్చేస్తాయి. రామకృష్ణుల దగ్గరికి వివిధ రకాల మనస్తత్వాలు కలిగినవారు వచ్చి తమ సందేహాలకు సమాధానాలు తెలుసుకునేవారు.

విషయం ఏదైనా ఆయన చిరునవ్వు చిందిస్తూ నవ్వించే మాటలతో చిన్న చిన్న కథల రూపంలో హృదయాలకు హత్తుకొనేలా బోధించేవారు.

ఒకసారి ఓ భక్తుడు సమదృష్టి గురించి తెలియజేయమనగా ఆయన ఇలా మొదలెట్టారు- సంసారజీవితం పట్ల విసుగు చెందిన ఒక జంట తీర్థయాత్రలకు బయలుదేరింది. భర్త వెనకాలే నడుస్తోంది భార్య. దారిలో అతడికి ఓ వజ్రం కనిపించింది. భార్య చూస్తే దానిమీద ఆశపడి వైరాగ్య స్థితిని పోగొట్టుకుంటుందేమోనని దాన్ని దాచిపెట్టే ప్రయత్నం చేశాడు. అది గమనించిన ఇల్లాలు 'వజ్రానికీ మట్టిగడ్డకూ మీకు తేడా కనిపిస్తూంటే ఇక సన్యసించడం ఎందుకు?' అంది.

వజ్రానికి, మట్టిగడ్డకు తేడా తెలియని సమదృష్టి కలిగి ఉండటమే వైరాగ్యం. ఉచ్ఛ, నీచ భేదభావం లేని సమభావమే వైరాగ్యానికి పరాకాష్ఠ అని రామకృష్ణులవారు విశదంగా చెప్పారు.

ఓ నడివయస్కుడు సన్యాసం గురించి అడిగాడొకసారి. దానికి సమాధానంగా 'నాయనా! అందరూ సన్యసించలేరు. కోరికలనేవి లేకుండా కరిగిపోయినప్పుడే అది సన్యాసం అవుతుంది. ఓ యోగి రాజును ఓ ప్రశాంత ప్రదేశానికి తీసుకెళ్లాడు. 'రాజా! మీరు అటు పక్కకి వెళ్లి ఏకాగ్రతతో భగవంతుణ్ని ధ్యానించండి. నేను పిలిచినప్పుడు రండి' అని చెప్పి పంపాడు. కాసేపట్లోనే రాజు తిరిగి వచ్చి 'స్వామీ! ఏకాగ్రత నావల్ల కాదు.

రాజ్యం గురించిన ఆలోచనలు నన్ను వదిలిపెట్టడం లేదు. ప్రాపంచిక సుఖాలు అనుభవించాలన్న కోరిక విపరీతంగా ఉంది' అని చెప్పేశాడట. వైరాగ్యం కానీ, సన్యాసం కానీ అంత సులభమైనవి కావు' అని చెప్పారు పరమహంస.

ఆధ్యాత్మిక జ్ఞానం గురించి ప్రశ్నించిన మరో భక్తుడికి 'ఆత్మజ్ఞానం అశాంతిని దూరం చేస్తుంది. మనుషుల్లో నైతిక విలువల్ని పెంచుతుంది. ఒడుదొడుకుల మానసిక స్థితికి శాంతిని చేకూరుస్తుంది. దుఃఖితుల హృదయాలను సాంత్వనపరుస్తుంది' అని చెప్పేసరికి ఆయన ముందు ముకుళిత హస్తుడై తలవంచాడు.

రామకృష్ణుల తండ్రి మరణానంతరం తల్లి విచారంతో రోజురోజుకూ చిక్కి శల్యమైపోతుండేవారు. అది గమనించి 'అమ్మా! మనిషికి చావు పుట్టుకలు తప్పవు. నిన్న నాన్న, రేపు నువ్వు, తరవాత నేను... ఏదో ఒకరోజు ప్రతి ఒక్కరూ ఈ లోకం విడిచి వెళ్లిపోక తప్పదు. బాధపడటం మాని భగవంతుడి ధ్యానంలో నిమగ్నమై జన్మ ధన్యం చేసుకో' అంటూ తల్లిని ఓదార్చారు. ఇలా భక్తి, జ్ఞాన, వైరాగ్యాలకు సంబంధించిన ఎన్నెన్నో విషయాలను ప్రజావాహినికి తెలియజేసిన మహర్షి- రామకృష్ణ పరమహంస. ఆత్మానంద అన్వేషణలో భాగంగా తమను తాము సంస్కరించు కోవాలనుకునే వారికి ఆయన బోధలు దారిదీపాల వంటివి.

Devotional Telugu

02 Jan, 02:04


ప్రాణస్నేహితులు

సృష్టి ఆరంభంలో స్నేహం ఉందో లేదో తెలియదు కానీ, ఇతిహాస కాలం నుంచి మాత్రం మైత్రీబంధం ఉంది. కర్ణ దుర్యోధనులు, కృష్ణ కుచేలుర కథలు మనకు తెలిసినవే. భర్తృ హరి సుభాషిత త్రిశతిలో మంచి మిత్రుడి లక్షణాలను చెప్పాడు. చెడ్డవారి స్నేహం ప్రాతః కాలపు నీడలా మొదట విస్తారంగా ఉండి, క్రమంగా క్షీణించిపోతుంది. మంచివారి స్నేహం సాయంకాలపు నీడలా మొదట చిన్నదిగా ఉండి క్రమంగా వృద్ధి చెందుతుంది.

స్నేహం బాల్యం నుంచి అలవడే ఓ అందమైన అనుబంధం. స్నేహం ఓ అద్భుత మైన భావప్రకటన. స్నేహం అంటే నమ్మకం, భరోసా, కంటికి కనిపించని అవగాహన. దూరంగా ఉన్నా, మానసికంగా దగ్గర చేసే మధురభావన. తల్లిదండ్రులతో, తోబుట్టు వులతో పంచుకోలేని ఎన్నో విషయాలను స్నేహితులతో పంచుకుంటాం. మనలోని మంచి, చెడులను నిష్పాక్షికంగా తెలియజేస్తూ, అవసర సమయాల్లో అండగా నిలబడ గలిగి, విభేదాలు వచ్చినా మన రహస్యాలను ఇతరుల ముందు బహిర్గతం చేయనివాడే నిజమైన స్నేహితుడు.

స్నేహం అంటే రెండు శరీరాల్లో ఉండే ఏకాత్మ. ఇద్దరి మధ్య వ్యక్తిత్వం, నిబద్ధత, నిజా యతీ, నిస్వార్థం అనే నాలుగు స్తంభాలే స్నేహ సౌధానికి పునాదులు. ఒకే అభిప్రాయం, భావా లుగల వ్యక్తులు మిత్రులు కావడం సాధార ణమే. కానీ దాన్ని జీవితకాలం కొనసాగించే వారే ప్రాణస్నేహితులు అవుతారు. పాలు, నీళ్లలా కలిసిపోయే నైజం కలవారి మధ్య స్నేహం అంకురిస్తే, అది వటవృక్షమై ఎంతో మందికి ఆశ్రయం ఇస్తుంది. కొన్నిసార్లు మన భావాలకు, అభిప్రాయాలకు పొంతన లేని వ్యక్తులతో తప్పనిసరి స్నేహం చెయ్యాల్సి వస్తుంది. ప్రయోజనం ఆశించి చేసే అలాంటి స్నేహాల్ని వదిలించుకోవడం మంచిది.

'నీకు నేనున్నాను, నీ కోసం ఏమైనా చేస్తాను' అనే భరోసా స్నేహానికి సేంద్రియ ఎరువులాంటిది. స్థాయీభేదాలు, అరమరికలు లేనివాళ్లే స్నేహితులు కాగలరు. 'స్నేహి తుడి కోసం ప్రాణం ఇచ్చేవాడికన్నా, ప్రాణమిచ్చే స్నేహితుణ్ని పొందినవాడు అదృష్ట వంతుడు' అన్నాడు జాన్ రస్కిన్.

నేటి యువత చదువు, ఉద్యోగం, సామాజిక జీవితంలోని ఒత్తిళ్లకు లోనవుతూ, స్నేహం ముసుగులో వ్యసనాలకు బానిసలవుతున్నారు. మంచి, చెడుల విచక్షణ తెలిపే స్నేహితుడు ఉన్నప్పుడు మనలోని దుర్గుణాలు వాటంతటవే తొలగిపోతాయి. ధనం స్నేహితుల్ని చుట్టూ చేరిస్తే, దరిద్రం నిజమైన స్నేహితుల్ని మిగులుస్తుంది. కంటికి రెప్పలా, కాలికి చెప్పులా మారడానికి సిద్ధపడేవాడే నిజమైన స్నేహితుడు.

తప్పు జరిగినప్పుడు 'ఎవరిది తప్పు, ఎవరిది ఒప్పు?' అనే రంధ్రాన్వేషణకూడదు. దానికి బదులు తప్పు ఎక్కడ జరిగిందో తెలుసుకుని సరిదిద్దుకోగలిగినవాళ్ల మధ్య స్నేహం సజీవంగా నిలుస్తుంది. ఒక్కసారి స్నేహితుడిగా అంగీకరించాక వాళ్లలో ఉన్న మంచిని, ప్రతిభను పదుగురితో పంచుకోవాలి. చెడు అయితే మనలోనే దాచు కోవాలి. మిత్రుడిలో ఉన్న మలినాలను సైతం ప్రక్షాళన చేయగలిగేవాళ్లే ఉత్తమ స్నేహితులుగా శాశ్వత ఖ్యాతికి అర్హులవుతారు.

Devotional Telugu

01 Jan, 13:25


శుభ సంకల్పం

సమయాన్ని లెక్కించాల్సింది గడియారంతో కాదు, అనుభూతితో. ఒక బ్యాంకులో ఏరోజుకారోజు ఉదయమే మన ఖాతాలో 86,400 రూపాయలు జమ అవుతాయనుకుందాం. మొత్తం ఆరోజే ఖర్చు పెట్టాలి. మిగిలింది ఆ రాత్రికల్లా రద్దయిపోతుంది. అప్పుడేం చేస్తాం. డబ్బు విలువ తెలుసు కనుక పైసా మిగల్చకుండా వాడేసుకుంటాం. అలాంటి బ్యాంకే అందరికీ ఉంది. దాని పేరు 'కాలం'. ప్రతి రోజూ 86,400 సెకండ్లు జమ అవుతాయి. వాడుకున్నది వాడుకోగా మిగిలింది రాత్రికల్లా చేజారిపోయినట్లే. ఆ ఖాతాని ఎవరికి వారే నిర్వహించుకోవాలి. కాలం అందరికీ సమంగానే ఉంటుంది. టైమ్ లేదు- అని చెప్పారంటే నిజంగా సమయం లేదని కాదు, ఆ పని చేయాలనే ఉద్దేశం ఉందా.. లేదా అన్నది ముఖ్యం.

కదిలిపోయే ప్రతి క్షణం కొన్ని జ్ఞాపకాలను,విలువలను, శక్తులను మన పేరున కూడబెడుతూంటుంది. ఆ నిధి చివర్లో మన కళ్లముందు కదలాడుతుంది. జీవితాన్ని ఎలా జీవించామో చెబుతుంది. అప్పుడు అయ్యో అనుకోకుండా తృప్తిగా ఉండాలంటే- మన ఖాతాని మనం జాగ్రత్తగా నిర్వహించుకోవాలి. ఒక రచయితో, చిత్రకారుడో తాను చేసిన పనిని తరచి చూసుకుంటూ, చేయబోయేదాన్ని సరిచేసుకుంటూ ఎలా ముందుకెళ్తాడో అలా వెళ్లాలి. అప్పుడే నిరుటి కన్నా ఈ ఏడాది మరింత మెరుగవుతుంది. 'కాలం ఎగిరిపోతుందన్నది చెడ్డవార్త. దానిని నడిపే సారథివి నువ్వే అన్నది శుభవార్త' అంటారు ఒక అమెరికన్ రచయిత. అశుభం శుభం ఎప్పుడవుతుందంటే- కొత్త సంవత్సరాన్ని వేడుకగా మాత్రమే కాక ఒక గొప్ప అవకాశంగా చూసినప్పుడు. ఈరోజు ఒక మంచి పనికి శ్రీకారం చుడితే, 365 రోజుల తరవాత ఒక మంచి ముగింపునూ సృష్టించగలం. ఒక కొత్త నైపుణ్యాన్ని సంపాదించుకోవచ్చు, కెరీర్లో ఒక లక్ష్యాన్ని చేరుకోవచ్చు, అర్థవంతమైన బంధాలను కలుపుకోవచ్చు. కాలాన్ని కొలవడానికే గడియారం కానీ జీవితం సాగేది హృదయాన్ని అనుసరించే. ఏం సాధించాలని నిర్ణయించుకుంటారో దానికి తగ్గట్టుగా కాలాన్ని ఉపయోగించుకుంటారు జ్ఞానులు.

కాలం కష్టసుఖాలను మోసుకొస్తుందనుకుంటాం. వాస్తవానికి సమస్య కాలంతో ముడిపడిలేదు. ద్వంద్వాలకు నిలయమైన ఈ ప్రపంచంలో ఉంది. ఉష్ణం శీతలం, సుఖం దుఃఖం, జయం అపజయం.. ఇలాంటివన్నీ ఉన్న ప్రపంచమిది. కాబట్టి ఆనందాన్ని అన్వేషించడం ఆపి, ఆధ్యాత్మిక సంతృప్తిని వెతుక్కోమని, అదే శాశ్వతమని, దానికి భక్తియోగం మార్గమని గీతలో శ్రీకృష్ణుడు చెబుతాడు. మనిషిని ఆలోచన నిలబెట్టగలదు, పడేయనూగలదు. భవిష్యత్తు దాని శక్తి మీదే ఆధారపడి ఉంది. విలువైన కాలాన్ని సద్వినియోగపరిచేది ఆ ఆలోచనే. సహనం, సమయాలను మించిన యోధుల్లేరు అంటారు టాల్స్టాయ్. ఆ యోధుల్ని మన సొంతం చేసుకుంటే చాలదూ!

Devotional Telugu

31 Dec, 02:33


రేపటి గెలుపు పిలుపు

మన ఎదురుచూపుల చివరి రోజు రానే వచ్చింది. రేపటినుంచి మరో కొత్త సంవత్సరం మొదలవుతుంది. నిత్యనూతనుడైన సూర్యుడు
కొత్త కాంతులతో వేనవేల వెలుగు రేకలతో బంగారు భవిష్యత్తుకు దారి చూపుతూ వస్తాడు. జగత్తును వెలిగించే సూర్యుడు ఆరోగ్య ప్రదాత. ఆనంద ప్రదాత. సూర్యుడు శాశ్వతం కానీ, జీవన కాలం శాశ్వతం కాదు. ప్రతిక్షణం వేళ్ల సందులోంచి నీటిలా మనకు తెలియకుండానే జారి గతంలో కలిసిపోతుంటుంది. ఆ సంగతి తెలిసీ మరో కొత్త సంవత్సరానికి స్వాగతం పలకడం కోసం ఎదురుచూడటమే జీవితం. రేపటి మీద ఆశలతో జీవించాలి. వర్తమానాన్ని ఆస్వాదిస్తూ, భవిష్యత్తులోకి ప్రవేశించాలి. విశ్వంలో అన్నింటికి శక్తినీ తేజస్సునూ ఇచ్చేది- కనిపించే సూర్యుడు.

అయితే అతడి వెనక, ఈ విశాల విశ్వం వెనక ఉన్న ఏకైక సూర్యుడు ఆత్మా రవి. అతడే జ్ఞాన భాస్కరుడు. పగలనక, రాత్రనక ప్రతి జీవి హృదయంలో స్థావరజంగమాత్మక ప్రపంచాన్ని నడిపించే సూర్యుడు. రేపటికి అతడే ఆధారం. అతడే అందరికీ దారి చూపిస్తాడు. అందుకే ఆ రేపటి కోసం కోటి ఆశలతో కొత్త కోర్కెలతో అందరూ ఎదురుచూస్తూ ఉంటారు.

ప్రహ్లాదుడి కోసం వచ్చిన నారసింహస్వామిలా దైవం రావాలి. చెడును చీల్చి చెండాడి, మంచికి పట్టం కట్టాలి. దైవత్వాన్ని నిరూపించాలి. మన కలల తోటలో మనమే పిల్లలమై, రేపటికోసం రంగురంగుల చిత్రాలెన్నో గీసుకోవాలి. ప్రతి ఇల్లు ఇంద్రధనుస్సు కావాలి. ఎంతో పోరాడి తల్లి గర్భంలోకి చేరి ఈ పుట్టుకను సాధించిన మనకి విజయం సాధించడమనేది జన్మహక్కు. విజయమే మన నినాదం. నిన్నటిని, నేటిని విత్తనాలుగా నాటి, రేపటి పంటను పండిద్దాం. ఈ రంగస్థలం మీద ఈ రోజుకు తెరపడగానే, రాబోయే నూతన సంవత్సరానికి మరో ఆశల, ఆనందపు తెరను తీద్దాం. దేవుళ్లకు ప్రణమిల్లి వేడుకుందాం.. సత్యం వైపు నడిపించమని! కాలం ఇంద్రజాలంతో మాయ చేసినా తట్టుకుని నిలబడే శక్తిని ఇమ్మనమని!!

పాత సంవత్సరానికి వీడ్కోలు పలుకుతూ... మంచిని పదే పదే స్మరించుకోవాలి. చెడుని విస్మరించాలి. చెయ్యబోయే కొత్త సాహసాలకు అందరి దీవెనలు అందుకోవాలి. 'భూత, భవిష్యత్, వర్తమానాలు నేను' అంటాడు గీతాచార్యుడు భగవద్గీతలో. రేపు ఏం జరుగుతుందో మనకు తెలియకపోవచ్చు. కానీ దేవుడి దగ్గర మన భవిష్యత్తు కోసం మంచి ప్రణాళికలు ఉన్నాయి అంటోంది బైబిలు. దేవుడు నిర్ణయించిందే మన భవిష్యత్తు అంటోంది ఖురాన్.

ఈరోజు మనం నిజాయతీతో, నిర్భీతితో, ప్రేమతో, ధైర్యంగా, గొప్పగా చేసింది రాబోయే రోజులన్నింటిని మార్చి తీరుతుంది. రేపటి కోసం ఎదురుచూద్దాం. కొత్త సూర్యుణ్ని ఆహ్వానిద్దాం. సంతోషాలు, ఆనందాల కేరింతల్లో మునిగి నీతి, నియమాలు జీవన విలువలు విస్మరించవద్దు. గెలుపు కోసమే రేపటి మలుపు. ఇదే మనందరికీ పిలుపు!!

Devotional Telugu

30 Dec, 11:01


అగ్నిసాక్షిగా వివాహం అంటే?

వివాహ సమయంలో వరుడు- వధువుతో

సోమః ప్రథమో వివిధే, గంధర్వో వివిధ ఉత్తరః త్రుతీయాగ్నిష్టే పతిః తురీయస్తే మనుష్య చౌః

అంటాడు. అంటే- నిన్ను ఆరంభంలో సోముడు, తర్వాత గంధర్వుడు, ఆ తర్వాత అగ్ని ఏలారు. నాలుగో వానిగా నేను నిన్ను ఏలుతాను- అని అర్థం. ఇందులోని అంతరార్థం ఏమిటంటే.. అమ్మాయి పుట్టిన వెంటనే ఆమె ఆలనాపాలనా సోముడు లేదా చంద్రుడు చూస్తాడు. చంద్రుణ్ణి ఎన్నిసార్లు చూసినా ఎంతో ఆకర్షణీయంగా కనిపిస్తాడు. పాపాయి కూడా అంతే. అందుకు కారణం చంద్రుని పాలన. వయసు వచ్చాక ఆమెని గంధర్వునికి ఇవ్వటంతో అతడు స్వీకరిస్తాడు. 'లావణ్యవాన్ గంధర్వః' అన్నట్టు గంధర్వుడు ఆమెలో అందాన్ని ప్రవేశపెడతాడు. గంధర్వులు గానప్రియులు కనుక అందమైన కంఠాన్ని లేదా సంగీతాన్ని ఇష్టపడే మనసుని ఇస్తాడు. అందచందాలను ఇచ్చేసి 'నా పనైపోయింది, ఇక నీదే పూచీ' అని కన్యను అగ్నికి అప్పగిస్తాడు. అలా అగ్ని ఆమెనిని స్వీకరించాడు. 'అగ్నిర్వై కామ కారకః' అన్నట్టు అగ్ని ఆమె శరీరంలో కామాగ్నిని ప్రవేశపెడతాడు. చంద్రుని ద్వారా ఆకర్షణను, గంధర్వుని ద్వారా లావణ్యాన్ని, అగ్ని ద్వారా కామగుణాన్ని పొందిన కన్య వివాహానికి యోగ్యురాలైంది. ఇప్పుడు అగ్ని- వాయు, చంద్ర, ఆదిత్య, వరుణులను పిలిచి 'దదామీత్యగ్నిర్వదతి.. ఇక ఈ కన్యని వరునికి ఇవ్వదలచుకున్నాను' అని చెబుతాడు. అందుకు వాయు, చంద్ర, ఆదిత్య, వరుణులు అంగీకారాన్ని తెలియజేస్తారు. వివాహానికి యోగ్యురాలైన అమ్మాయిని వేరొకరికి అప్పగించి తను వెళ్లాలి కనుక వరునికి ఇస్తాడు. అతడామెని అగ్ని సాక్షిగా స్వీకరిస్తాడు. అందువల్లే 'అగ్నిసాక్షిగా వివాహం'

అనే మాట ప్రాచుర్యంలోకి వచ్చింది.

Devotional Telugu

30 Dec, 01:55


ప్రేమను పంచిన మహర్షి

పదహారేళ్లకే పరమ వైరాగ్యంతో అరుణాచలం చేరుకున్న పారమార్థిక పిపాసి రమణ మహర్షి. పవిత్ర పర్వతంపై దాదాపు ఇరవై ఏళ్లు ధ్యానాది కఠిన సాధనల్లో నిమగ్నమ య్యారు. అర్ధ శతాబ్దం అరుణగిరి ఒడినే తన ఆధ్యాత్మిక క్షేత్రంగా చేసుకొని భక్తులను అనుగ్రహించారు. రమణులు ఎవరికీ ఏ బోధలూ చేయడానికి ఇష్టపడేవారు కాదు. తానొక ఉన్నత స్థానంలో ఉన్నానన్న అహంకారం కానీ, ఎవరినో ఉద్దరించాలన్న తాప త్రయం కానీ మహర్షిలో కనిపించేవి కావు. ఆయన మహత్తర ఆయుధం మౌనమే! అయితే దర్శించిన ప్రతి ఒక్కరిపైనా వారి సాన్నిధ్య ప్రభావం ప్రసరించేది. మహర్షి శాంతచిత్తం, నిశ్చల సముద్రం లాంటి మనసు, కరుణార్ధమైన చూపులు, అన్ని జీవరా శులపై కురిపించే దయ మరువలేనివి.

నిరంతరం ఆత్మానందంలో ఓలలా డుతూ, మౌనదీక్షలో ఉండే రమణులు, భక్తులపై కురిపించే ప్రేమ మాత్రం వర్ణనా తీతం. ఆశ్రితులు తమ కుటుంబాల్లోని కష్ట నష్టాల గురించి చెబుతూ ఉంటే ఓపిగ్గా వినేవారు. గృహస్థులు తమ బాధలు చెప్పి కన్నీళ్లు పెట్టుకుంటే కదిలిపోయేవారు. 'ఎదుటివారిపై శ్రద్ధ చూపడం ఆధ్యాత్మిక జీవనానికి ప్రథమ సోపానం' అనేవారు మహర్షి. ప్రతి ఒక్కరికీ ఆ మహానుభావుడి సాన్నిధ్యంలో.. తమకూ ఓ విలువ ఉందన్న స్ఫురణ కలిగేది.

రమణులు ఒంటరిగా మౌనముద్రలో ఉన్నా, అచ్చుప్రతులు దిద్దుతున్నా, పత్రికలు చదువుతున్నా, కూరగాయలు తరుగు తున్నా- సదా సంతోష భరితులై, ఆత్మని ష్ఠులై ఉండేవారు. ఎవరైనా ఆత్మన్యూనతతో కుంగిపోతుంటే 'తాను దుర్బలుడనని అనుకోవడమే మనిషి చేసే పెద్ద తప్పు. వాస్త వానికి ప్రతి వ్యక్తీ దైవిక సంపన్నుడే. బలాఢ్యుడే! అతడి ఆలోచనలు, అలవాట్లు, కోరి కలు, భావాలు- ఇవే దుర్బలమైనవి. ఇవి మనిషి సహజ లక్షణాలు కావు' అని ఆత్మ విశ్వాసాన్ని నింపేవారు. ఉపవాసాలు అవసరమా? అని ఓ శిష్యుడు ప్రశ్నించినప్పుడు 'ఇంద్రియ సంబంధమైన వ్యాపకాలన్నింటినీ ఆపేస్తే మనసు ఏకాగ్రమవుతుంది. అటు వంటి మనసు భగవంతుడి మీద లగ్నమైతే అదే అసలైన ఉపవాసం. వాంఛలే మన సుకు ఆహారం. వాటిని నిలివేస్తే చాలు. మనసుకు ఆహారం లేకుండా చేయగలిగిన వారు, దేహానికి ఆహారాన్ని నిరాకరించనక్కర లేదు. మనసుకు ఉపవాసం లేనివారి కోసమే ఆ శారీరక ఉపవాసం' అనేవారు. అనుకున్నవి జరగడం లేదని ఆందోళన పడుతున్న ఓ భక్తుడితో 'మనుషుల్ని ఓ మహాశక్తి నడిపిస్తూ ఉంది. జరిగేది జరిగే తీరుతుంది. జరగనిది జరగనే జరగదు' అని ఉపదేశించారు.

శరీరాన్ని ఎంత తక్కువ ప్రేమిస్తే ఆత్మకు అంత చేరువవుతామనే వారు రమణులు. దేహభ్రాంతి మనిషి ఆధ్యాత్మిక ఉన్నతికి ప్రతిబంధకమన్నారు. 'కూలీ బరువును మోసినట్లే జ్ఞాని ఈ దేహాన్ని మోస్తాడు. ఎప్పుడెప్పుడు గమ్యస్థానం వస్తుందని ఎదురుచూస్తాడే కానీ, ఏవో ప్రయత్నాలు చేసి ఆ భారాన్ని ఇంకా మోయాలనుకోడు' అని చెప్పేవారు. స్వయంగా ఆ మౌనర్షి కూడా తన జన్మలక్ష్యం పూర్తికాగానే శరీరాన్ని చిరునవ్వుతో త్యజించారు.

Devotional Telugu

29 Dec, 07:53


అవన్నీ తాత్కాలికమే!

రాత్రింబగళ్లు, ఉదయ సాయంత్రాలు, శిశిర వసంతాలు... కాలచక్రంలో భాగంగా ఇవి వస్తూ, పోతూంటాయి. ఇవన్నీ శాశ్వతంగా ఉండేవే. కానీ కనబడుతూ, కనుమరుగ వుతూ ఉండటం వల్ల తాత్కాలికమైన వాటిలా అనిపిస్తాయి. తాత్కాలికమైనవైనా, శాశ్వతమైన వాటిలా కనిపించేవి కొన్ని ఉన్నాయి. అవి యవ్వనం, జీవితం, ఐశ్వర్యం, మనసు, నీడ, పాలకుల ప్రేమ. ఈ ఆరూ చంచలమైనవి. అశాశ్వతమైనవి. అయినా శాశ్వతమైన విషయాలన్నంతగా వీటిని గాఢంగా నమ్ముతారు చాలామంది. వీటిని తాత్కాలికమైనవని గుర్తించి, జాగ్రత్తగా మెలగాలన్నది పెద్దలు చెప్పేమాట.

యవ్వనం జీవిత దశల్లో ప్రధానమైంది. కీలకమైన ఘట్టాలను నిర్వర్తించే వయసు. సంపాదించే సత్తా, బలిమి, బింకం వాటికి తోడు కాస్త పొగరు ఉండే ప్రాయం. కాబట్టి తమకు ఎదురు లేదని, యవ్వనమే శాశ్వ తమని భ్రమిస్తారు చాలామంది. జీవి తమూ అంతే. ఎంతో, ఎన్నో, ఏదో, ఎక్కడో... ఉన్నాయనుకుని, వాటిని ఒడిసి పట్టుకోవాలనే తాపత్రయంతో చివరి దశవరకూ పరుగులు తీస్తూనే ఉంటారు. కానీ రాశిపోసిన బియ్యంలో చెయ్యి పెట్టినవారికి పిడికెడు బియ్యమే దక్కినట్లు వారికి యోగమున్నంత మేరకే దక్కుతాయనే నిజం ఆలస్యంగా, అలసి పోయాక తెలుసుకుంటారు. నిలకడ లేని వాటిలో ఐశ్వర్యం ప్రధానమైంది. అది ఎప్పుడు, ఎవరిని ఎలా వరిస్తుందో, ఎలా వంచిస్తుందో, ఎప్పుడు ఎవరి దగ్గరకెలా చేరుతుందో, ఏ క్షణాన ఎవరి దగ్గరనుంచి ఎలా జారుకుంటుందో ఎవరూ చెప్పలేరు. కాబట్టి సంపద ఉందన్న గర్వం కలిగి ఉండటమంత అవివేకం మరొకటి ఉండదు. ఇలాంటివారిని ఉద్దేశించే ఆదిశం కరాచార్యులు 'ధన, జన, యవ్వన బలాలు చూసి గర్వించవద్దు. వీటన్నింటినీ కాలం రెప్పపాటులో దూరం చేస్తుంది. కాబట్టి ఈ భ్రాంతి నుంచి మిమ్మల్ని మీరు విడిపిం చుకోండి' అంటూ భజగోవిందంలో హెచ్చరించారు. చిత్తం అంటే మనసు. మనిషి మనుగడను మననే నియంత్రిస్తుంది. కానీ దాన్నది నియంత్రించుకోలేదు. ఏ క్షణం ఎటు మారుతుందో చెప్పలేని స్థితి దానిది. అందుకే మనసును నియంత్రించడానికి పతంజలి మహర్షి యోగసూత్రాల్లో సూచించిన సాధనాలేంటంటే- ఏకాగ్రతతో ధ్యానం, భక్తి- వైరాగ్య భావనలు, ఆధ్యాత్మిక చింతన, కోరికలను త్యజించడం, ఇంద్రియ నిగ్రహం.

ఇక, పాలకుల కరుణ. పాలించేవాడికి ఆనందం కలిగినా, ఆగ్రహం కలిగినా ఫలి తాలు తీవ్రంగానే ఉంటాయి. రెండు వైపులా పదునున్న కత్తి లాంటి పాలకులు ఏ క్షణాన ఏ నిర్ణయం తీసుకుంటారో తెలియదు. అందుకే పాలకులకు దూరంగా, పాల కడవకు చేరువగా ఉండటం మంచిదని పెద్దల మాట. సేద తీర్చడం నీడ స్వభావం. కానీ దాన్ని నమ్ముకోవడమంత అవివేకం మరొకటుండదు. వెలుగు మీద ఆధారపడే, స్వతంత్ర ప్రతిపత్తి లేని నీడను నమ్ముకోవడం కన్నా, శాశ్వతు డైన భగవంతుడి ఛాయలోకి చేరడం శ్రేష్ఠం.

Devotional Telugu

28 Dec, 01:35


ఎవరు గురువు?

జ్ఞానసాధనకు తొలి సోపానం గురువు. పుట్టుకతో వచ్చిన నిర్మల హృదయం సద్గురువు బోధనలతోనే సుస్థిరత పొందుతుంది. విష్ణుశర్మ సుదర్శన మహారాజు తనయులకు పంచతంత్రాన్ని బోధించి జన్మతః వచ్చిన మూర్ఖత్వాన్ని పోగొట్టాడు. పరిపూర్ణ జ్ఞానాన్ని పొందటానికి ఆరుగురు గురువులను పెద్దలు సూచించారు. వారెవరంటే- విద్యపట్ల ప్రేరణ కలిగించేవాడు, మహోన్నతుడిగా ఎదగడానికి తగిన సూచనలు చేసేవాడు, అమృతతుల్యమైన మాటలతో అలరింపజేసేవాడు, ధర్మాధర్మాల పట్ల సునిశిత జ్ఞానం కలిగినవాడు, శిక్షణ నిచ్చేవాడు. బోధన చేసేవాడు. వారసత్వంగా ఐశ్వర్యాన్ని పొందవచ్చు. విజ్ఞానం గురువు సన్నిధిలో మాత్రమే లభిస్తుంది.

గురుశిష్యులది పరమాత్మ, జీవాత్మల సంబందం. శిష్యున్ని తనంతవాడిగా తీర్చిదిద్దినవాడే నిజమైన గురువు అంటాడు వేమన. తత్వజ్ఞానాన్ని బోధించే గురువుకన్నా ఏదీ అధికం కాదంటుంది విశ్వసారతంత్ర. ఒకసారి పార్వతి గురువు ప్రశస్తి గురించి శివుణ్ని ప్రశ్నిస్తుంది. విద్యాబలం, ధనబలం, సకల భోగభాగ్యాలున్నా కూడా గురు కృప లేనివారు అధోగతి పాలవుతారని చెబుతాడు. పరమేశ్వరుడు. జ్ఞానార్డిగా శిష్యుడు గురువునెలా సమీపించాలో ముండకోపనిషత్ చెబుతుంది. దర్పాన్ని విడిచి ప్రశాంతమైన చిత్తంతో వెళ్లాలి. కోర్కెల నుంచి విరక్తుడవ్వాలి. అలాంటి ఉత్తమ శిష్యుడికి గురువు బ్రహ్మవిద్యను బోధిస్తాడు. అజ్ఞానమనే సముద్రం నుంచి దాటిస్తాడు. గురువును ఆశ్రయించాల్సిన పద్ధతి, ప్రశ్నించాల్సిన విధానం వివేక చూడామణి చక్కగా వివరించింది. తల్లి, తండ్రి, సద్గతి అంతా గురువే. పరమేశ్వరు డికి మనిషిపై ఆగ్రహం కలిగితే గురువు కాపాడతాడు. గురువుకే కోపం వస్తే ఇంకె వరు కాపాడతారని కులార్ణవ రహస్యం ప్రశ్నిస్తుంది. గురువు మనసు గుర్తించి శిష్యుడు నడచుకోవాలి. సీతా స్వయంవరానికి వెళ్లిన రామలక్ష్మణులు ధనుర్యాగశాల చూడటా నికి వెళ్లి చాలా సమయం గడుపుతారు. ఆలస్యం చేసినందుకు కోపగిస్తాడేమోనని భయపడి విశ్వామిత్రుణ్ని సమీపించి క్షమించమంటూ పాదాభివందనం చేస్తారు.

మంత్రం, తీర్థం, దైవం, జ్యోతిషుడు, వైద్యుడు, గురువు వీరిపట్ల అపారమైన నమ్మక ముంటేనే ఫలితం కనిపిస్తుందని శాస్త్రాలు చెబుతున్నాయి. రామకృష్ణ పరమహంసపైన వివేకానందుడికి తొలిదశలో నమ్మకం కలగలేదు. శిష్యుడి మనసు తెలిసినప్పటికీ సమయం వచ్చేవరకూ మామూలుగానే ప్రవర్తించేవాడు గురువు. ఒకరోజు నరేంద్రుడు పాదసేవ చేస్తుండగా రామకృష్ణ పరమహంస తన పాదాన్ని నరేంద్రుడి భుజంపై వెడ తాడు. ఆ సమయంలో నరేంద్రుడికి లోకమంతా తలకిందులైనట్లనిపించి బిగ్గరగా అరు స్తాడు. కొంత సేపటికి రామకృష్ణుడు పాదాన్ని తీసి నరేంద్రుణ్ని అనుగ్రహిస్తాడు. ఈ సంఘటనతో గురువు మీద అపనమ్మకం తొలగి నరేంద్రుడికి జ్ఞానోదయం అవుతుంది. గురువును సంపూర్ణ నమ్మకంతో ఆశ్రయించాలి. ఆయన అనుగ్రహం పొందాలి.

Devotional Telugu

16 Mar, 18:57


ఊరొక్కటే- దారులెన్నో....

ఒక ఊరికి వెళ్ళాలంటే చుట్టుపక్కల గ్రామాలవారు దగ్గరిదోవ చూసుకుంటారు. సులువుగా, తొందరగా, సుఖంగా చేరే మార్గం వెదుక్కుంటారు. తెలియకపోతే తోటివాళ్లను వాకబు చేస్తారు. అలా క్షుణ్నంగా తెలుసుకున్న తరవాత నమ్మకం కలుగుతుంది. అప్పుడు నిశ్చింతగా, నిర్భయంగా ప్రయాణం చేస్తారు. గ్రామం ఒక్కటే అయినా ఎన్నో మార్గాలున్నట్లే దైవం ఒక్కటే అయినా ఆయన కరుణ పొందడానికి, ఆయన సాన్నిధ్యం చేరుకోవడానికి, ఆయనలో లీనం కావడానికి అనేక మార్గాలున్నాయి, రీతులున్నాయి, సాధనాలున్నాయి. దేన్నీ తోసి రాజనలేం. భక్తుల మనోభావాలు విభిన్నంగా ఉంటాయి. ఎవరి విశ్వాసం వారిది. ఎవరి పంథా వారిది. ఎవరి మతం వారిది.

ఎవరికైనా లక్ష్యం ఒక్కటే దైవకృప కావాలి. స్వామి వాత్సల్యం కావాలి. సద్గతులు కలగాలి. కోరుకున్న కోర్కెలు నెరవేరాలి. నమ్ముకున్న దైవం సాక్షాత్కరించాలి. లేదా కనీసం మనోనేత్రాలతోస్వామిని దర్శించుకోవాలి.

నదులు ఎటు, ఎన్ని మార్గాల్లో ప్రవహించినా, చివరికి సాగరంలో కలుస్తాయి. రామభక్తి, కృష్ణభక్తి, శివభక్తి,
జ్ఞానమార్గం, కర్మమార్గం, యోగమార్గం, ఆత్మ విచారమార్గం... ఇవన్నీ పరమాత్మకు అనుసంధితమై ఉన్నవే ద్వైతం, అద్వైతం, విశిష్టాద్వైతం, మధ్వం, సగుణోపాసన, నిర్గుణోపాసన... ఇవన్నీ పరబ్రహ్మను
చేరుకోదగిన విధానాలే! 'మనసును ఈశ్వరపాద పంకజాలపై నిలపాలి. అలా చేస్తే భక్తి సార్థకమవుతుంది' అంటారు ఆదిశంకరులు. తల్లికోతి
ఎగురుతున్నంత సేపు దాని పిల్ల తల్లి పొట్టను గట్టిగా కరచుకుని, పట్టుకుని సురక్షితంగా ఉంటుంది. దీన్నే
మర్కటకిశోర న్యాయమంటారు. అలా మనం దైవాన్ని పట్టుకోవాలి. దైవధ్యానాన్ని పట్టుకోవాలి.

అప్పుడు మన రక్షణ అంతా ఆయనే
చూసుకుంటాడు. ఆయన అనంత నామధేయుడు. ఆయన లేని చోటు లేనేలేదని ప్రహ్లాదుడు నిరూపించలేదా? మన మానసిక బలహీనత, శంక, భయం, అస్థిరత, అవిశ్వాసం, నాస్తికత... ఆయన్ని కలవనీయకుండా చేస్తున్నాయి. అరిషడ్వర్గాలు
అవరోధాలు కల్పిస్తున్నాయి. అత్యాశ, ప్రలోభం, అసహనం, ఇంద్రియనిగ్రహ రాహిత్యం, అజ్ఞానం, అలక్ష్యం, అలసత్వం- ఇవన్నీ పరంధాముణ్ని స్మరించనీయడంలేదు. ఈ దుర్లక్షణాలను దూరం చేసుకోగలిగితే గమ్యం సుస్పష్టంగా గోచరిస్తుంది. 'మానవసేవే మాధవసేవ' అని కొందరి విశ్వాసం. ఇది ఏమాత్రం సత్యదూరం కాదు. ఈ సూత్రంతో తరించిన మహనీయులెందరో ఉన్నారని అనేక పౌరాణిక ఉపాఖ్యానాలు చెబుతున్నాయి. తీర్థయాత్రలు, పురాణశ్రవణం, నోములు, వ్రతాలు, పూజలు, దీపారాధనలు, దేవాలయ సందర్శనలు, ధ్యానం, యోగం, శ్రవణం, కీర్తనం, చింతనం... ఇవి- వివిధ భక్తిమార్గాలు, నారద భక్తిసూత్రాలు. అన్నీ ఈశ్వర శరణాగతికి సంబంధించినవే! వేదాలు, పురాణాలు, ఉపనిషత్తులు, గీత, రామాయణ, భారత, భాగవతాలు- ఏవైనా ప్రబోధించేది ఇదే! అన్నమయ్య 'బ్రహ్మమొక్కటే, పరబ్రహ్మమొక్కటే అన్నాడు. 'తక్కువేమి మనకు, రాముండొక్కడుండు వరకు' అని రామదాసు అన్నా... 'బ్రోచేవారెవరురా, నిను వినా రఘువరా!' అని త్యాగయ్య కీర్తించినా... 'మీ రాకే ప్రభు గిరిధర్ నాగర్ అని మీరా గాన సమీరం వీచినా... అరుణాచలం మౌనగానం వినిపించినా... బుద్దుడు, పరమహంస, అరవిందుడు, వివేకానందుడు. మొదలైనవారు దివ్యజ్ఞాన ప్రబోధాలు చేసినా.... సర్వత్రా సర్వాంతర్యామిని విస్మరించరాదన్న సందేశమే ప్రతిధ్వనిస్తుంటుంది. అసలైన మోక్షానికి
ఆధ్యాత్మిక నిబద్ధతే గట్టి పునాది! ఇది మరిస్తే తప్పదు అనర్థం!

Devotional Telugu

14 Mar, 01:58


నీకు నీవే సృష్టికర్తవి!

ప్రతీ మనిషిని ఆ భగవంతుడు సర్వస్వతంత్రుడిగా సృష్టించాడు. అందుకే మనిషి స్వయంకృషితో ఏం సాధించాలనుకున్నా, ఏది పొందాలనుకున్నా అది అతడి చేతుల్లోనే ఉంది. మనిషి వేసే ప్రతి అడుగూ అతడి జీవితపథాన్ని నిర్దేశిస్తుంది. అందువల్ల మనిషి జీవితంలో ఏది జరిగినా అది అతడి ఉన్నతికేనని ప్రతి ఒక్కరూ భావించాలి.

నిజానికి మనిషి శారీరకంగా చాలా బలహీనుడు, నిస్సహాయుడు. పక్షిలాగా నింగిలో ఎగరలేడు. పులిలాగా వేగంగా పరిగెత్తలేడు. కాని, ఈ సృష్టిలో మనిషికున్న మానసికశక్తి అమితమైనది. అద్భుతమైనది. అలాంటి మానసికశక్తితోనే బలమైన ఏనుగును సైతం మావటివాడు లొంగదీసుకుంటున్నాడు. ఈ సృష్టిలో ఏ జీవికీ లేని గొప్ప ఆలోచనా సామర్థ్యం ఆ భగవంతుడు మనిషికి మాత్రమే ప్రసాదించాడు. ఆ మేధతోనే చుట్టూ ఉన్న పరిసరాలను మనిషి తనకు అనుకూలంగా మార్చుకున్నాడు. ఆశించినవి, ఇష్టపడినవి, కోరుకున్నవి పొందేశక్తి మనుషులకు మాత్రమే ఉంది. తనకున్న పూర్తి శక్తుల్ని వినియోగించుకోవాలన్న నిర్ణయమే మనిషి జీవితంలో అద్భుతాలు సృష్టిస్తుంది. సుడిగాలి చుట్టేంతవరకు గాలి బలం తెలీదు. ఉప్పెన పోటెత్తేవరకు నీటి బలం తెలీదు. మొలకెత్తేంతవరకు విత్తనం బలం తెలీదు. అలాగే మనమీద మనకు నమ్మకం, విశ్వాసమున్నంతవరకు మన బలం మనకు తెలీదు. కీలకమైన జీవనపోరాట సమయాలలో స్వశక్తి మనల్ని ముందుకు నడిపిస్తుంది. మానసిక శక్తిమీద మనకు నమ్మకం ఉండాలి. ఆ నమ్మకమే అసాధ్యాలను సుసాధ్యాలు చేయిస్తుంది.

నూరు యోజనాల సముద్రాన్ని దాటి సీత జాడ కనిపెట్టాలి. వానరులు ఎవ్వరూ ఆ సాహసం చేయలేకపోయారు. అప్పుడు జాంబవంతుడు హనుమంతుడితో 'నీ పరాక్రమం, ప్రతిభ గురించి రాముడికి తెలుసు. అందుకే నీకు ఉంగరాన్ని ఇచ్చాడు. ఆ రాముడి నమ్మకాన్ని నిలబెట్టి నీవే సముద్రలంఘనం గావించాలి' అన్నాడు. ఆ ప్రోత్సాహంతోనే హనుమంతుడు సీత జాడ తెలుసుకుని రామకార్యాన్ని పూర్తిచేశాడు. కష్టాలు పర్వతమంతగా కనిపించినా, పరిస్థితులన్నీ భయంకరంగా ఉన్నా భీతిల్లకూడదు. పట్టుదలతో చేసే ఏ ప్రయత్నమైనా విజయాన్నే చేకూరుస్తుంది.

మనం కోరుకున్న స్థాయికి ఎదగడానికి అన్ని అవకాశాలు ఉన్నా, శక్తి సామర్థ్యాలు పుష్కలంగా ఉన్నా ఏదో పిరికితనం, ఆందోళన మనల్ని వెనక్కి లాగుతుంటాయి. కురుక్షేత్ర యుద్ధంలో ఆయుధాలతో సిద్ధంగా ఉన్న గురువులు, బంధుజనాన్ని చూసి అర్జునుడు కలత చెంది గాండీవం జారవిడిచాడు. 'ఈ విజయం వల్ల ఒనగూడే రాజ్యం అవసరంలేదు' అన్నాడు. వెంటనే శ్రీకృష్ణుడు అర్జునుడికి స్వధర్మం గొప్పతనాన్ని వివరించి భగవద్గీతను బోధించి కర్తవ్యోన్ముఖుణ్ని చేశాడు. ఒక్కొక్కప్పుడు నిత్యజీవితంలో ఎదురయ్యే సంఘటనల వల్ల మనసు అలజడికి లోనవుతుంది. అయినా ప్రయత్నాలు ఆపకూడదు. మన బలహీనతలను బలాలుగా మార్చుకోవాలి. భయాలను, మానసిక దౌర్బల్యాలను అధిగమించాలి.

జీవితంలో అన్నీ మనల్ని సంతోషపెట్టేవే జరగవు. దుఃఖం కలిగించే సంఘటనలూ ఎదురవుతాయి. అప్పుడు కూడా దైవంపై విశ్వాసం కోల్పోకూడదు. శ్రీకృష్ణుడి ముఖతా యుద్ధభూమిలో గీత ఆవిర్భవించింది. అంపశయ్యపై ఉన్న భీష్ముడు విష్ణుసహస్రనామాన్ని లోకానికి అందించాడు. చీకట్లను చీల్చుకునే ఉషోదయకాంతులు లోకానికి వెలుగునిస్తాయి. అందువల్ల ఎన్ని కష్టాలు ఎదురైనా ఎవరికివారే తమ మేధాశక్తితో ముందుకు సాగాలి. వ్యక్తిత్వాన్ని వికసింపజేసుకోవాలి. అప్పుడే ఎలాంటివారైనా అనుకున్నది సాధిస్తారు!

Devotional Telugu

13 Feb, 01:15


కష్టమంటే...

అందరూ అతి సులభంగా పలికే మాట- కష్టం. కష్టమంటే ఏమిటో సరైన నిర్వచనం చాలామందికి తెలియక అలా అనేస్తారు. నిజమైన కష్టం ఏదో తెలిసేవరకు ప్రపంచంలో ప్రతి పనీ కష్టమైనదిగానే అనిపిస్తుంది. అందరూ కష్టాలు అనుభవిస్తున్నామనే భావిస్తారు. కష్టం అనేది ఒక మానసిక భావన, ఒక అనుభూతి. ఒక అనుభవం. వ్యక్తి, వయసు, ఆలోచనా సరళిని బట్టి కష్టం స్థాయి మారుతూ ఉంటుంది.

ఇష్టం లేకుండా చేసే ఏ పనైనా కష్టంగా అనిపిస్తుందని- మానసిక శాస్త్రవేత్తల నిర్వచనం.. మనసు పెట్టి ఇష్టపూర్వకంగా పనిచేస్తే కష్టం ప్రసక్తే ఉండదు. వయసు, స్థాయి, ఆలోచనా విధానాల్లో మార్పులు వచ్చేకొద్దీ కష్టం తాలూకు నిర్వచనం, లక్షణం, రూపం మారిపోతూ ఉంటాయి. అప్పులు, యాచనల్లాంటివి చేయవలసి రావడం, రోగాలు చుట్టుముట్టడం, దొంగల పాలుకావడం, ఏ పనీ కలిసిరాకపోవడం, వృద్ధాప్యంలో బాధలు అనుభవించడం, సరైన తోడు కాని సలహాలను ఇచ్చేవారు కాని లేకపోవడం, పేదరికం అనుభవించడం... ఇలాంటి ఎన్నింటినో కష్టాలుగా పేర్కొంటారు.

భగవంతుణ్ని ఎపుడూ స్మరించక పోవడమే మహా పాపం అని, ఆ పాపమే కష్టాలకు కారణమని భాగవతంలో పోతన చెప్పాడు. అంటే, భగవంతుడి స్మరణ వల్ల కష్టాలు నశిస్తాయని విశ్వాసం కలిగి ఉండాలని అంతరార్థం. గత జన్మలో చేసిన పాపాలు సైతం కష్టాలుగా పరిణమిస్తాయని పౌరాణికులు చెప్పేమాట. పరిశీలిస్తే జీవితంలో ప్రతిపనీ కష్టంతో ముడివడి ఉన్నదే. లక్ష్యసాధన కోసం చేసే ప్రయత్నాలు, విషయ సేకరణ, వస్తు- ధన సంపాదన, వాటిని నిలబెట్టుకోవడం, భద్ర పరచడం ఇలా ప్రతిపనీ కష్టమే.


కష్టపడితేనే లక్ష్యాన్ని సాధించడానికి ఉత్తు అవకాశం ఉంటుందనేది సత్యం. కష్టం చేయనిదే ఫలితం ఉండదు. కాబట్టి కష్టేఫలీ అనే నానుడి గుర్తు పెట్టుకోవాలి. నువ్వు దేన్ని అందుకోవడానికి కష్టపడకపోతే నీకు ఏదీ అందుబాటులోకి రాదు. అవసరమైనవాటిని అందుబాటులోకి తెచ్చుకోవాలంటే కృషి, కష్టం ప్రధానం అంటారు వ్యక్తిత్వ వికాస నిపుణులు.

మనిషి గొప్పతనాన్ని, విలువను అంచనా వెయ్యాలంటే సుఖసంతోషాలతో గడుపుతున్నప్పుడు కాదు. కష్టాలు కలిగినప్పుడే అది సాధ్యం. ఎందుకంటే అలాంటప్పుడే ఆ వ్యక్తి సమర్థత పూర్తిగా తెలిసి సరైన అంచనాకు దొరుకుతాడు. అతడి మనసు అసలు రూపు బయటపడేది అలాంటప్పుడే.

ఎంత కష్టపడితే అంత ఫలితం ఉంటుంది. అలాంటి ఫలితాలను పొందినవారికే జీవితంలో విలువ ఉంటుంది. మన జీవితం కూడా మంచి, చెడు విషయాల సమతుల్యతతో జరుగుతుంది. నువ్వెంత కష్టపడి పని చేస్తున్నావో చెప్పవద్దు. ఎంత పని పూర్తి అయ్యిందో చెప్పు, జీవితంలో ఒక కష్టం దాటి వచ్చిన తరవాత నువ్వు అనుభవించే ఆనందంతో పోటీపడే అనుభూతి ఈ ప్రపంచంలో మరొకటి ఉండదు. కాబట్టి కష్టాలను ఇష్టంగా ఆహ్వానించు అంటాడొక కవి.

కష్టం విలువ ఒకరు చెబితే తెలిసేది కాదు. అనుభూతి చెందితేనే తెలుస్తుంది. నిజానికి ఎదుటివారు పడే కష్టం ఇతరులకు తేలికగా, చులకనగా అనిపిస్తుంది. ఎదుటివారి సానుభూతి, లేదా సహాయం వస్తుందేమోననే ఆలోచనతో ఎదురు చూడటం మంచిది కాదు. దాని బదులు మీ దృష్టిని లక్ష్యం మీదే ఉంచి దాన్ని సాధించే నిరంతర ప్రయత్నం సాగాలి. అలా చేసిననాడు ఆత్మవిశ్వాసంతో కష్టాలను అధిగమించిన తరవాత వచ్చే ఆనందపు రుచిని అనుభవిస్తారు. ఆ రుచి వర్ణనాతీతం.

Devotional Telugu

01 Feb, 02:18


ఆనందం చిరునామా

మనం ఆనందంగా ఉండేందుకు ఇంకొకరిని దుఃఖ పెట్టకూడదు అంటోంది బృహదారణ్యక ఉపనిషత్తు. ఇతరులను బాధలకు గురిచేసి మనం పొందేది ఆనందం కాదు. భౌతికమైన ఆనందం భౌతికమైన దుఃఖానికి రూపాంతరమని ఆ ఉపనిషత్తు చెబుతోంది. పూర్వం రుషులెందరో ఆనందంకోసం ఏళ్లకు ఏళ్లు తపస్సు చేశారు. పరమాత్మ. అనుభూతిని పొంది ఆనందాన్ని ఆస్వాదించారు. ఈ ఆనందంలో హాయి ఎంత దివ్యమైందో సామాన్యులు సైతం గుర్తెరగాలని ఎన్నో గ్రంథాలు రాశారు. కపటత్వం పశుబలం వల్ల దొరికే ఆనందం తాత్కాలికమైందే కనుక శాశ్వతానందం కోసం తపోవనాలకు వెళ్లారు. ఈ భౌతిక ప్రపంచానికి ఆవల ఉండే పారమార్థిక ఆనందమే నిజమైన ఆనందమని ఆస్వాదించి తెలుసుకున్నారు. సుఖం దుఃఖం ఈ భూమ్మీద విడదీయలేని విధంగా కలిసిపోయి ఉంటాయి. వాటిలో ఒకదాన్ని కోరుకొని రెండోదాన్ని విడదీయడం ధరణిపై కుదరదు. ఇక్కడ ఆనందం పరిమితంగానే అనుభవానికి వస్తుంది. మరింత ఆనందం కావాలనుకొంటే ఇంకొకరినుంచి నయానో భయానో లాక్కోవలసిందే. ఈ భౌతిక ప్రపంచానికి ఆవల ఉండే అంతులేని పారమార్థిక ఆనందాన్ని ఇతరులకు నష్టం లేకుండా సాధనతో సొంతం చేసుకొని అనుభవించడం కుదురుతుంది. ఆనందం చిరునామా ఆధ్యాత్మిక జ్ఞానమని వసిష్ఠుడు శ్రీరాముడికి చెబుతాడు. నూనె గానుగలో తిరిగే ఎద్దులాంటిదే ఈ భూమిపై ఆనందం కోసం మనిషి వెతుకులాట. గానుగలో తిరిగే ఎద్దు తన ముందు వేళ్ళాడదీసిన గడ్డి మోపును ఎప్పుడూ అందుకోలేదు. మనమూ అంతే! మనకు భూమిపై ఎన్నడూ అనుభవానికి అందని దివ్యానందాన్ని వెంటాడుతూనే ఉంటాం.

ఆనందాన్ని వెతికే ప్రయత్నంలో తొలుత ప్రస్తుత స్థితితోనే సంతృప్తి పడటం అలవాటు చేసుకోవాలి. భౌతికమైన వస్తువులలో ఆనందాన్ని వెతకడం తగని పని. ఇందుకోసం నైతిక జీవితాన్ని గడపడం అవసరం. మనసుకు ఆనందానికి అవినాభావ సంబంధం ఉంది. నిజానికి ఆనందాన్ని వెతుక్కోవడం కోసం మనసనే సాధనాన్ని పరమాత్మ ఇచ్చాడంటారు ఆధ్యాత్మికవేత్త జిడ్డు కృష్ణమూర్తి. ఆనందం కావాలనే అంతర్బుద్ధి మనసులోనే పుడుతుంది. అందుకే మనసును నిర్మలంగా ఉంచుకోవాలి. మనసు శూన్యం చేసుకొని ప్రేమభావనలు కలిగి ఉంటే శ్రావ్యమైన సంగీత స్వరాలు వినిపిస్తాయని చెబుతారు. గుట్టల పైనుంచి చెట్ల కొమ్మల కదలికలోనుంచి ప్రవహించే నదుల జల తరంగాలనుంచి వినపడే రాగాలు దివ్య ఆనందానికి ప్రేరణ కలిగిస్తాయి. నిజమైన ఆనందాన్ని ఆస్వాదించేందుకు సిద్ధంగా ఉన్నామనే సంకేతాన్ని ఆ రాగాలు కల్పిస్తాయి. ఈ జీవితమే నిజం అని అనుకోవడమే మనుషులు చేస్తున్న తప్పు. అలా అనుకుని జీవిస్తే ఆనందం భౌతికమైన వస్తువులకే పరిమితం అవుతుంది.

ఆనందాన్ని నిర్వచించలేం. ఎందుకంటే, అదిక్కడ భూమ్మీదనే లభ్యమయ్యేడా కాదు. దాని కోసం వెతకాలి. మనసును సమాయత్తం చేసుకోవాలి. ప్రతి జీవి పరమావధి ఆనందమే. అందుకోసం మనం ప్రయత్నించాలనే దృష్టితోనే ఈ భూమిపై దైవం ఆనందం ఛాయలు కల్పించాడు. ఇవన్నీ శరీరానికి సంబంధించి ఆనందాలు. ఈశ్వరుడి సాన్నిధ్యంలో లభించే ఆనందమే నిజమైన అనంతమైనా అపరిమితమైన ఆనందం. ఆనందం చిరునామా అక్కడే... అదే
శాశ్వతానందం!

Devotional Telugu

24 Jan, 01:29


క్షమించే హృదయం

కంటికి కనిపించకుండా మానవ జీవితమనే మహా నాటకాన్ని ఆడించేది మనసు ఒక్కటే. మనసంత మృదువైనది, కఠినమైనది, పవిత్రమైనది, పాపభూయిష్టమైనది, సౌఖ్యకారకమైనది, శోకకారకమైనది మరొకటి లోకంలో లేదు. పుణ్యకార్యాలూ చేయిస్తుంది. పాపకూపంలోకి నెట్టేస్తుంది.

మనసు మూలంగానే మనిషి తప్పుచేస్తాడు. ఒప్పు చేస్తాడు. తనవల్ల తప్పు జరిగినప్పుడు మనిషి అనేవాడు పశ్చాత్తాపపడాలి. సాటి మనిషికి జరిగే కీడును గ్రహించాలి. తోటిమనిషి మనోభావాలు ఎంతగా దెబ్బతింటాయో అవగాహన చేసుకోవాలి. అలా గ్రహించగానే ఆ సాటి మనిషిని క్షమాపణ కోరుకోవాలి.

మంచి మనసే మంచి శరీరానికి అలంకారం. ప్రసన్నమైన దివ్యభావాలు ఆవిర్భవించే మనసు చెడు ఆలోచనలను, దుష్కర్మలను ప్రేరేపించదు. మంచిని విన్నప్పుడు, కన్నప్పుడు మనసు దుర్మార్గాన పోదు. సత్సాంగత్యంవల్ల, సద్గురు బోధనలవల్ల హృదయం ప్రక్షాళితమవుతుంది.

ఎంతటి గొప్పవాడైనా, మేధావి, పండితుడు, శాస్త్రజ్ఞుడు అయినా అనుకోకుండా పొరపాట్లు దొర్లుతూనే ఉంటాయి. జరిగిన తప్పిదాన్ని అంగీకరించే సంస్కారం ఉండాలి. అంతేగాని, చేసింది సరైనదే అని అడ్డగోలుగా వాదించకూడదు. క్షమాపణ కోరితే పోయేదేముంది.. అహంకారం తప్ప!

యుగయుగాల్లో మహామహుల
చరిత్రల్లోనూ ఎన్నో దోషాలు దొర్లాయి. కైక తన రెండు వరాల వల్ల జరిగిన పరిణామాలకు తరవాత ఎంతో పశ్చాత్తాపపడినట్లు హిందీ జాతీయ కవి మైథిలీ శరణ్ గుప్త తన 'సాకేత్' మహాకావ్యంలో చాలా గొప్పగా అభివర్ణించాడు.


అర్ధరాత్రివేళ అశ్వత్థామ ఉపపాండవులను పాశవికంగా వధించగా, అర్జునుడు అతన్ని బంధించి ద్రౌపది ముందుంచుతాడు. భీముడు అతణ్ని వధించే ప్రయత్నం చేసినప్పుడు ద్రౌపది వారిస్తుంది. బ్రహ్మహత్య మహాపాతకమని, పైగా కన్నతల్లి గర్భశోకం భరింపరానిదని అశ్వత్థామను క్షమించి విడిచిపెడుతుంది. అహల్య శాపగ్రస్తురాలైనప్పుడు పశ్చాత్తాపం చెంది విమోచనోపాయం కోరినప్పుడు భర్త గౌతమ మహర్షి శ్రీరామ పాదధూళి తగిలినప్పుడు స్వస్వరూపం పొందగలవని చెప్పాడు.

సత్రాజిత్తు తన శ్యమంతకమణిని శ్రీకృష్ణుడు దొంగిలించినట్లు నింద వేయడంతో పరమాత్మ అడవులకు వెళ్ళి ఎంతో కష్టపడి, మణిని సాధించి సత్రాజిత్తుకు అప్పగించాడు. సత్రాజిత్తు వాసుదేవుణ్ని దూషించి, నిందించినందుకు క్షమాపణ కోరుకున్నాడు. విరాటరాజు కంకుభట్టుతో పాచికలాడుతూ, ఆగ్రహంతో పాచికలు విసిరేయడంతో కంకుభట్టు తలకు తగిలి గాయమై రక్తం కారసాగింది. కంకుభట్టే ధర్మరాజు అని తెలియడంతో విరాటరాజు క్షమాపణలు కోరుకున్నాడు. ఇలాంటి ఉదాహరణలు రామాయణ, భారత భాగవతాల్లో అష్టాదశ పురాణాల్లో ఎన్నో కనిపిస్తాయి.

చేసిన తప్పును ఒప్పుకొని క్షమాపణలు కోరినట్లయితే క్షమించేవాడికంటే క్షమాపణ కోరినవాడే గొప్పవాడనిపించుకుంటాడు. క్షమాగుణానికి ఎంతో ప్రాధాన్యమిచ్చే జైనులు చిత్తశుద్ధితో ఆత్మప్రక్షాళన కోసం 'దస్లక్షణ్పరే' పేరుతో పదిరోజులు పండుగ చేసుకుంటారు. దోషిని క్షమించినవాడు దైవస్వరూపుడని బాపూజీ అభివర్ణించారు.

Devotional Telugu

15 Jan, 03:38


ఎన్నో విశేషాల అద్భుత పర్వం

సూర్యుడు మకరరాశిలో ప్రవేశించే కాలాన్ని అత్యంత పుణ్యప్రదంగా సనాతన ధర్మశాస్త్రాలు అభివర్ణించాయి. ఉత్తరాయణంలో వచ్చే ఈ పుణ్యకాలాన్ని మహాపర్వంగా పరిగణించి, శ్రోత్రియులు మొదలుకొని సామాన్యులవరకు అందరూ మహోత్సాహంగా జరుపుకొంటారు. భారతదేశమంతా ఈ పండుగకు ప్రాధాన్యం ఉన్నప్పటికీ ఒక్కొక్క ప్రాంతంలో ఒక్కొక్క విధానంలో నిర్వర్తిస్తారు. ఈ సంక్రమణకాలం మహిమాన్వితమని చెప్పిన ఋషుల ప్రతిపాదనను అనుసరించి, ఆ పుణ్యకాలంలో స్నాన, దాన, అర్చన, పితృతర్పణలను ఆచరించే పద్ధతులున్నాయి. ఉత్తరాదిలో గంగానదిలో, విశేషించి ప్రయాగ వద్ద స్నానానికి ప్రాము ఖ్యాన్నిస్తూ అధిక సంఖ్యలో శ్రద్ధాళువులు హాజరై, తీరంలో దేవతలను, పితృదేవతలను ఆరాధిస్తారు.

నింగిలో సూర్యుడి శక్తియే కాంతిగా, వర్షంగా, శక్తిగా భూమిపై కురిసి ప్రాణ చేతనను, పంటను కూడా జీవకోటికి ప్రసాదిస్తుంది. ఈ సంక్రమణల నుంచి చలి తగ్గుతూ, సూర్యకాంతి క్రమంగా పెరుగుతూ ఉంటుంది.

పంటలు చేతికంది భోగాన్ని

ప్రసాదిస్తాయి కనుక 'భోగి' సంబరాన్ని

జరుపుకొని, సంక్రాంతిని పవిత్రకర్మలతో

సార్ధకం చేసుకోవడం ఆనవాయితీ.
వేదశాస్త్ర ప్రకారం కొత్తపంటగా వచ్చిన బియ్యాన్ని దేవతలకు నివేదించి తరవాత తాము స్వీకరించాలని 'ఆగ్రయణం' అనే పేరుతో క్రతువు నిర్వహిస్తారు. అగ్నిహోత్రంలో హవ్యంగా ధాన్యాన్ని సమర్పించడం ఇందులో ప్రధానాంశం. ఆ అగ్నిహోత్రుడు సూర్యభగవానుడి మరో రూపం, ప్రతీక! ఇదే యజ్ఞాన్ని సామాన్యులు కూడా, సూర్యకాంతి పడేలా పాలతో బియ్యాన్ని ఉడికించి 'పొంగల్'గా భగవానుడికి నివేదించే ఆచారంగా ఏర్పరచారు.

సూర్యుడికి సంకేతంగా గాలిపటాలను ఎగురవేయడం కొన్నిచోట్ల సంప్రదాయం. 'పతంగ' అనే పేరు సూర్యుడిదే. సంక్రాంతివేళ పితృదేవతలకు తర్పణాలు వదలడాన్ని విధిగా చెబుతారు. తిలలతో(నువ్వులతో) వంటలు, ప్రసాదాలు, దానాలు; హోమాలు చేయాలని కూడా ధార్మిక గ్రంథాలు చెబుతున్నాయి. అందుకే ''తిలసంక్రాంతి' అని కొన్నిచోట్ల ఈ పండుగకు మరోపేరు ఉంది. దేవతా పూజకు తెల్లనువ్వులు, పితృదేవతలకు నల్లనువ్వులు వినియోగిస్తారు.

ఈ రవి సంక్రాంతినాడు అభ్యంగ స్నానం తప్పనిసరి అని, అది గొప్ప సత్ఫలితాలనిస్తుందని ప్రాచీన గ్రంథాలు చెబుతున్నాయి, విష్ణు, శివ, శక్తి- వంటి దేవతలను ఆయా భక్తులు ఈ రోజున ప్రత్యేకించి పూజించి విశిష్ట ఫలాలు పొందవచ్చని ఆయా దేవతారాధన శాస్త్రాలు తెలియజేస్తున్నాయి. నువ్వులనూనెతో దీపాలు, నువ్వుల వంటల నివేదనలను ముఖ్యంగా నిర్దేశించాయి. ఆవుపాలతో అభిషేకం, తెల్లనువ్వులు బియ్యం కలిపిన అక్షతలతో పూజ- శివుడికి ప్రీతి అని ధార్మికోక్తి. నేల తల్లి ఇచ్చిన పంటలకు సంతోషిస్తూ, ఆ ఫలాలను దానాలుగా, కానుకలుగా, బహుమానాలుగా, దేవతార్పణలుగా పంచుకొనే పండుగ ఇది. వ్యక్తి కృషితో పాటు సాటి వ్యక్తుల సహకారం, ప్రకృతి అనుకూలత, పశువుల తోడ్పాటు, సూర్యాది దివ్యశక్తుల అనుగ్రహం... ఇవన్నీ కలిసి లభించిన సంపదను కృతజ్ఞతా పూర్వకంగా సమర్పించుకుంటూ సంతోషించే దివ్యపర్వమిది.

ఆధ్యాత్మిక- ధార్మిక ప్రాధాన్యంతో పాటు, సాంస్కృతికపరంగా, సామాజికంగా కూడా ప్రాముఖ్యాన్ని సంతరించుకున్న ఈ 'పెద్దపండుగ' అందరికీ ఆనందోత్సవాలను ప్రసాదించాలని వివిధ సంప్రదాయాల ఆంతర్యం.

Devotional Telugu

14 Jan, 07:43


సజ్జన సాంగత్యం


జన సమూహంలో సత్ప్రవర్తన కలిగినవారిని సజ్జనులని, దుర్మార్గంగా ప్రవర్తించేవారిని దుర్జనులని పిలవడం సాధారణం. సజ్జన సాంగత్యంలో చేరాలి, దుర్జన సహవాసం విడవాలి అనేది మహాభారతంలోని విదురనీతి. మంచి, చెడు- మనిషికి రెండు రెక్కలు. వాటితో సమాజపు వీధుల్లో విహరిస్తాడు. కొందరితో మంచిగా, మరి కొందరితో చెడుగా ప్రవర్తిస్తాడు. తిరస్కారం, పురస్కారం రెండూ మనం చేసే పనుల వల్ల కలుగుతాయి. చుట్టూ చేరినవారు మంచి సలహాలతో ప్రభావితం చేస్తే వ్యక్తిగతంగా, సామూహికంగా ప్రయోజనం కలుగుతుంది. వ్యతిరేకంగా పెడదారి పట్టిస్తే అందరికీ దుర్గతి తప్పదు.

సుయోధనుడు అని పేరుగాంచిన యువరాజు అపకీర్తి పొందడానికి కారకులు శకుని, కర్ణుడు. శకుని దుష్ట మంత్రాంగం, కర్ణుడికి తనపై తనకు మితిమీరిన నమ్మకం- దుర్యోధనుడి పతనానికి దారితీశాయి. మరోవైపు ధర్మమార్గంలో శాంతం, సహనం చూపించిన పాండవులకు శ్రీకృష్ణుడి సాంగత్యం లభించి విజయాన్ని ప్రసాదించింది. ఎక్కడ ధర్మం ఉంటుందో అక్కడే విజయం సాధ్యం.

మనిషిలో ఉండే నాలుగు అంతఃకరణాలు మనసు, చిత్తం, బుద్ధి, అహంకారం అని పెద్దలు చెబుతారు. మనసులో పరిపరి విధాల ఆలోచనలు వస్తాయి. మనం చూసే చూపు, వినే మాటలు, తినే ఆహారం- మనసులో ఆలోచనలకు మూలాలు. వివేకం, విచక్షణతో మంచి చెడులను విశ్లేషించేది చిత్తం. ఇటువంటి విశ్లేషణా వడపోతను సాంగత్యం తప్పనిసరిగా ప్రభావితం చేస్తుంది. మంధర పదేపదే చెప్పిన చెడు మాటలు కైక చిత్తాన్ని మార్చాయి. బుద్ధి మంచి నిర్ణయం చేసినా మనిషిలోని అహంకారం దాన్ని తొక్కిపట్టి తప్పుడు దారికి మళ్ళిస్తుంది. సరైన నిర్ణయం వెనక మంచి స్నేహితుల ప్రోత్సాహం ఉంటే అది సజ్జన సాంగత్యంగా మారి వ్యక్తిగతంగా, సామూహికంగా మేలు చేస్తుంది. అధికారం, ఐశ్వర్యం, కీర్తిప్రతిష్ఠలు మన చుట్టూ సమూహాన్ని ఏర్పరుస్తాయి. దాన్ని ఛేదించి ఎవరూ లోపలికి వెళ్ళలేరు. అది కురుక్షేత్ర యుద్ధంలో పద్మవ్యూహం వంటిది.


ఒంటరిగా కన్నా పదిమందితో కలిసి చేసే సామూహిక కార్యక్రమాలు జనంలో స్ఫూర్తి నింపుతాయి. త్యాగరాజ ఆరాధనోత్సవాలు, అన్నమయ్య ఆరాధనోత్సవాల్లో వేలాది గొంతులు బృందగానాన్ని ఆలపిస్తాయి. సంగీత కళాకారుల సామూహిక సాంగత్యంతో రాగాలు భగవంతుడి వైభవాన్ని చాటుతాయి. దక్షిణాఫ్రికా నుంచి వచ్చిన మోహన్దాస్ కరంచంద్ గాంధీ కొల్లాయి కట్టి లక్షలాది భారతీయులతో సత్యాగ్రహ దీక్ష చేపట్టారు. ఒకరితో ఒకరి సాంగత్యం బలమైన శక్తిగా మారి పరాయి పాలన నుంచి దేశాన్ని విముక్తం గావించింది. బలమైన సజ్జనుల సమూహం ఏదైనా సాధించగలదు. బలవంతమైన సర్పం కూడా చలిచీమల చేత చిక్కితే మరణం తప్పదు అన్నాడు సుమతీ శతకకర్త.

అడవిలో సమూహంగా మేతమేసే పశువులను పులి ఏమీ చేయలేదు. సంఘటితంగా ఎదిరిస్తే తోక ముడిచి పారిపోక తప్పదు. పదకొండు అక్షౌహిణుల సైన్యాన్ని సమీకరించి అహంకరించిన కౌరవులు, ఏడు అక్షౌహిణుల పాండవ సైన్యం ముందు ఓడిపోయారు. రాశి కన్న వాసి ముఖ్యం అని పెద్దలు చెబుతారు. సజ్జన సమూహంతో ఏర్పడే సాంగత్యం ఎప్పటికైనా విజయాన్ని ప్రసాదిస్తుంది. పశు గుణాలు తొలగితే మనిషి పశుపతి కాగలడు. సద్గుణాలు, సత్ప్రవర్తన, మానవత్వం- ఇవే సజ్జనుల లక్షణాలు.

Devotional Telugu

09 Jan, 18:35


నిన్న గతం... నేడే నిజం


నరజన్మ దుర్లభమనీ ఎంతో పుణ్యం చేస్తే గాని లభ్యం కాదని పెద్దల వాక్కు. దేహధారణ మొదలు దేహాంతం వరకు ఉన్న సమయంలో మేధను ఉపయోగించి సత్కర్మలు చేసేది మనిషి మాత్రమే. మనిషి జీవితం క్షణికం. బుద్బుదప్రాయం. ఎప్పుడు ఏ రీతిలో ఎలా మలుపులు తిరిగి ముగుస్తుందో ఎవరికీ తెలియదు. నిన్నటిలా ఈ రోజు ఉండదు. నేటిలా రేపు కనిపించదు. భవిష్యత్తు అగమ్యగోచరం.

శిలలాంటి జీవితాన్ని శిల్పంగా చెక్కే ప్రతిభ, ఆలోచన మనిషికే ఉన్నాయి. అద్భుత నైపుణ్యాన్ని ప్రదర్శించి సర్వాంగసుందరంగా రూపుదిద్దగలడు, ముందుచూపు కరవై అనాలోచితంగా ఉలి దెబ్బలతో శిలను ఛిన్నాభిన్నం చేయగలడు. అతడి సృష్టికి బయల్పడేది సుందర శిల్పం కావచ్చు, నిరుపయోగమైన రాళ్లముక్కలు కావచ్చు. అంతా అతడి ఆలోచన పైనే ఆధారపడి ఉంది. జీవితం చిత్రాతిచిత్రమైనది. నిన్నటి లక్షాధికారి నేడు భిక్షాపాత్రతో కనిపిస్తాడు. నేటి మతిమంతుడు రేపు మతిభ్రష్టుడిగా దర్శనమిస్తాడు. ఆరోగ్యవంతుడు అంతుచిక్కని వ్యాధులతో రోగగ్రస్తుడవుతాడు.

దృఢమైన శరీరం, సక్రమంగా ఆలోచించే బుద్ధి, బాధ్యతల పట్ల అవగాహన- అన్నీ పదునుగా ఉన్న తరుణంలోనే నిర్దేశించిన లక్ష్యాలను చేరుకోవాలి. పరహిత కార్యాలకు నడుం కట్టాలి. కాలంతీరి మనిషి మాయమయ్యాక కూడా అతణ్ని జ్ఞప్తికి తెచ్చుకొని అతడి గుణగణాలను శ్లాఘించేలా బతుకును పండించుకోవాలి. విలువలు లేని జీవితం వ్యర్థమని భావించి మనిషి ముందుకు సాగాలి. ఆ నడక సక్రమంగా సాగాలే తప్ప వక్రగతిలో పడితే పతనం తప్పదు. ఆర్తులను శక్తిమేరకు ఆదుకోవడమే జీవితసారం అంటారు అరవిందులు.

మనిషిని నడిపించే ఇంధనం ధనం. కాసులున్నవారికే కనకాభిషేకమని నమ్మి ఆర్జన కోసం ఎంచుకున్నది న్యాయమార్గమా కాదా అని ఆలోచింపక ధనాగారాన్ని నింపి సంబరపడతాడు మనిషి ఈ సంపాదనలో కొంత సంక్షేమం కోసమని ఆలోచిస్తే అతడికి సముచిత రీతిలో గౌరవం లభిస్తుంది. స్వార్ధంతో బతికితే వారసత్వ కుమ్ములాటలు పెచ్చరిల్లి అర్థం వ్యర్థమయ్యే ప్రమాదముంది. ధనం కన్నా కాలం గొప్పదని గుర్తించక దుర్వినియోగపరచే వ్యక్తికి భవిష్యత్తు ఎండమావే. నిన్న గతం. నేడు నిజం, రేపు ఆశ అన్నాడో కవి. గతాన్ని వదిలి రేపటిపై ఆశతో నేడు ఆనందంగా బతికేవాడే తెలివైనవాడు. బలమైన ఆలోచనలకు సువాసనలద్ది పుష్పించి ఫలించేలా చేస్తుంది ఆరోగ్యవంతుడి శక్తి. ఆరోగ్యాన్ని అలక్ష్యం చేస్తే మనిషి బతుకు ప్రశ్నార్థకమే. విత్తం, బలం, విలువలు, కాలం- సమృద్ధిగా ఉన్నప్పుడే వినియోగించాలి.

పరిపూర్ణ జీవితానికి ఆధ్యాత్మిక చింతన పువ్వుకు తావి లాంటిది. మనసుకు శాంతినిచ్చి మోక్షానికి దారి చూపే ఆ మార్గాన్ని దూరం చేసుకొని అంత్యకాలంలో విచారిస్తే ప్రయోజనం శూన్యం. యమదూతలు పాశం విసిరేవేళ, కఫ వాత పైత్యాలు ప్రకోపించి తెలివి సన్నగిల్లే సమయంలో కాకుండా ఆరోగ్యం, జ్ఞానం, తెలివి ఉన్నప్పుడే నీ నామస్మరణ చేసేలా నన్నుద్ధరించు స్వామీ అని విన్నవించుకుంటాడు నరసింహ శతకకర్త శేషప్ప కవీంద్రుడు.

Devotional Telugu

03 Jan, 00:47


అవకాశమే అదృష్టం

మనం కోరుకున్నప్పుడు పౌర్ణమి రాదు. ఇష్టపడినప్పుడు వసంతం రాదు. చూడాలనుకున్నప్పుడు ఇంద్రధనుస్సు కనిపించదు. ఆశించినప్పుడు ఆత్మీయులు మనకు దొరకరు. జీవితం ఆనందమయంగా గడిచేది మనం కోరుకున్నది పొందినప్పుడు కాదు. వచ్చినవి, పొందినవి ఆస్వాదించినప్పుడే జీవితం సంతోషంగా సాగుతుంది. అలాగే చేతికందిన ప్రతీ అవకాశాన్ని ఉపయోగించుకున్నప్పుడే కోరుకున్న గమ్యానికి చేరువవుతాం.

అవకాశాలు తమంతటతాముగా మన చెంత చేరవు. వాటి కోసం అన్వేషించాలి. తపించాలి. శ్రమించాలి. అందిన అవకాశాలను చేజిక్కించుకుని కార్యనిర్వహణలో విజయం సాధించాలి.

రామాయణంలో హనుమంతుడు సీతాన్వేషణ ప్రయత్నంలో ఏ చిన్న అవకాశాన్నీ విడిచిపెట్టలేదు. ఎన్నో రకాల పరీక్షలను, అడ్డంకులను అధిగమించి చివరికి సీతమ్మ జాడ తెలుసుకున్నాడు. రామకార్యాన్ని పూర్తిచేశాడు. అలాగే ఉడుత సైతం తన వంతు సాయం చేసింది. వచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని రాముడి ప్రేమను పొందింది. చరిత్రలో నిలిచిపోయింది.

కురుక్షేత్ర యుద్ధంలో మోహావేశంలో చిక్కుకున్న అర్జునుడి మనసును మార్చాలనుకున్నాడు శ్రీకృష్ణుడు. మిత్రుడు, బంధువు అయిన అర్జునుడు అజ్ఞానపు చీకటి లోయలోకి జారిపోకుండా కాపాడి గీతామృత బోధ చేసి కర్తవ్యోన్ముఖుడిని చేశాడు. అవకాశాలు కలిసిరావడానికి అదృష్టం ఉండాలని కొందరి వాదన. నిజానికి అదృష్టవంతుడు అంటే ఎవరో కాదు. కిందపడ్డ ప్రతీసారి లేచి నిలబడేవాడు. ఎదురుదెబ్బలు, కష్టనష్టాలు, అవరోధాలు- జీవితంలో ఒక భాగం అనుకుని ముందుకు సాగేవాడు. ఈ సత్యాన్ని అంగీకరిస్తే జీవితం ఎవరికీ కఠినంగా అనిపించదు. అప్పుడు ప్రతి మనిషీ మానసికంగా ఎదగడానికి ప్రయత్నిస్తాడు. ప్రతీ సమస్య వెనకా ఒక అవకాశం ఉందని భావించి ఆశావాదంతో ముందడుగు వేస్తాడు.

చాలామంది తమను దురదృష్టం వెంటాడుతోందని, అవకాశాలు రాకుండా ఎవరెవరో అడ్డుకుంటున్నారని, కొందరు మోసం చేస్తున్నారని భావిస్తుంటారు. నిజానికి మనకు ఏది రావాలో అదే వస్తుంది. ఆ భగవంతుడికి ఎవరిమీదా పక్షపాతం ఉండదు. ఎవరు దేనికి అర్హులో అదే వారు పొందుతారని శాస్త్రాలు చెబుతున్నాయి.

భగవంతుడి పూజ తరవాత పువ్వు, పండు... ఇలా ఏదైనా భక్తితో, కృతజ్ఞతతో స్వీకరిస్తాం. అలాగే ఈ జీవితంలో లభించిన ఎలాంటి అవకాశాన్నయినా భగవత్‌ ప్రసాదంగా భావించి స్వీకరించాలి. స్వశక్తితో ఇతరులను ఒప్పించి వచ్చిన అవకాశాన్ని అదృష్టంగా భావించి అనుకున్న లక్ష్యాలను చేరడానికి ప్రయత్నించాలి.

ఉత్తమ కార్యాలు చేస్తూ ఉదాత్తవ్యూహంతో ముందుకు సాగితే ఆ మనిషికీ తప్పక దైవశక్తి తోడవుతుంది. అప్పుడు అవకాశాలు వాటంతటవే వెతుక్కుంటూ వస్తాయి. చేతికందిన అవకాశాలను స్వార్థప్రయోజనాలకు కాకుండా, సమాజ శ్రేయస్సు కోసం ప్రతి ఒక్కరూ ఉపయోగించాలి. దానం, పరోపకారం, సమాజ సేవ నిర్వహించే అవకాశాలు వచ్చినప్పుడు వాటిని దైవకార్యాలుగా భావించి నెరవేర్చేందుకు ప్రయత్నించాలి. అలాంటి అవకాశాల వల్లే మనిషికి శాశ్వతకీర్తి లభిస్తుంది.

Devotional Telugu

25 Nov, 03:06



మోహముద్గరం

మోహముద్గరం అంటే అజ్ఞానానికి అడ్డుకట్ట అని అర్థం. మానవ జీవితం కామక్రోధాది ఆరు చెడ్డ గుణాలకు నిలయం. నాది, నాకు, నేను అనే ఆలోచనే పై దుర్గుణాలకు, వాటిద్వారా అనేక అనర్థాలకు కారణమవుతోంది.


మోహముద్గరం అంటే అజ్ఞానానికి అడ్డుకట్ట అని అర్థం. మానవ జీవితం కామక్రోధాది ఆరు చెడ్డ గుణాలకు నిలయం. నాది, నాకు, నేను అనే ఆలోచనే పై దుర్గుణాలకు, వాటిద్వారా అనేక అనర్థాలకు కారణమవుతోంది. ఆ ఒక్క ఆలోచనను విడిచిపెడితే మనసు ప్రశాంతత పొందుతుంది. ఆ మోహాన్ని విడిచిపెట్టించడానికి మార్గంగా ఆది శంకరాచార్యులు ‘భజగోవిందం’ అనే శ్లోకంతో ప్రారంభించి 31 శ్లోకాలలో విశదీకరించారు. అవి ‘మోహముద్గరం’ పేరుతో ప్రసిద్ధి చెందాయి.

మనిషి... స్థిరం, శాశ్వతం అనుకునే, పొందడానికి ఆత్రపడే విషయాల అసలు స్వరూపాన్ని, వాటిలోని ఇబ్బందులు, లోపాలు, కష్టాలు, బాధలను ఈ శ్లోకాల్లో అత్యంత సరళంగా విడమరచి చెప్పారాయన.

ఒక వ్యాకరణ పండితుణ్ని ఉద్దేశించి చెబుతున్నట్టు మొదలుపెట్టి, సామాన్య జనానికి అర్థమయ్యేటంత సరళంగా చెప్పారు. మానవుడు ఎంతవరకు ధనం సంపాదించగలడో అంతవరకే కుటుంబం, బంధువులు అతడిపట్ల ప్రేమ కలిగి ఉంటారు. ప్రాణం పోయిన మృతదేహాన్ని భార్య సైతం అసహ్యించుకుంటుంది. నీవు సర్వస్వం అనుకునే ధనం వల్ల ఇసుమంతైనా సుఖం ఉండదు. కాబట్టి భార్య, బిడ్డలు నీవారు అనే భావం విడిచిపెట్టు. ఎందుకంటే ఎవరూ ఎవరికీ ఏమీకారు అని చెబుతూ... వాటిని ఎలా విడిచి పెట్టాలో ఆ మార్గాన్నీ సూచించారు.

వస్తువులు, విషయాల ద్వారానే ఆనందం పొందగలుగుతాం అనుకోవడమే మోహం, భ్రమ. ఈ లోకంలో ఏ వస్తువు, ఏ విషయమూ ఎల్లప్పుడూ ఆనం దాన్నే ఇస్తాయన్న నమ్మకం లేదు. వస్తువు పోయినా, చెడిపోయినా అప్పుడు కలిగేది దుఃఖమే అంటూ అనేక ఉదాహరణలు, సంఘటనలు నిర్మొహమాటంగా చెప్పి మోహనాశాన్ని కలిగించే ప్రయత్నం చేశారు.

నిజానికి పదమూడు శ్లోకాల వరకు శంకరాచార్యులవారు సున్నితంగా హితబోధ చేశారు. ఆయన సున్నితంగా చెప్పిన విషయాలతో జనంలో మార్పు రావడం కష్టమని, ఇంకా నిక్కచ్చిగా చెప్పాలని ఆయన శిష్యులు భావించారు. ఆ ఆలోచనకు కార్యరూపమిస్తూ... వీరిలో పన్నెండు మంది ఒక్కొక్కటి చొప్పున, మరొక శిష్యుడు అయిదు, వెరసి పద్దెనిమిది శ్లోకాలను చెప్పారు. శంకరులు చెప్పినట్టే ప్రచారంలో ఉన్నా వాటికి, వీటికీ చెప్పే తీరులో చాలా తేడా ఉంటుంది.

‘పవిత్ర నదుల్లో స్నానం ఆచరించినప్పటికి, వ్రతాలు-దానాలు చేసినప్పటికీ ఆత్మజ్ఞానం లేకపోతే నూరు జన్మలెత్తినా మోక్షం రాదు’ అని నిక్కచ్చిగా చెప్పాడు సురేశ్వరాచార్యుడనే శిష్యుడు.

జగత్తు నశ్వరత్వాన్ని తెలుపుతూ అవసరం వచ్చినప్పుడు నువ్వు ‘నావి’ అని కౌగిలించుకొంటున్న ధనం, భార్య, పిల్లలు, ఆస్తిపాస్తులు మరణ సమయంలో నీ వెంట రావు. నిన్ను ఉద్ధరించవు’ అని మరో శిష్యుడైన సుమతాచార్యులు నిర్మొహమాటంగా చెప్పాడు.

ఇలా పదమూడు మందిలో ఒక్కొక్కరిదీ ఒక్కొక్క తీరు. అందుకే చివరి పద్దెనిమిది శ్లోకాలూ కాస్త కటువుగా, నిక్కచ్చిగా, నిర్మొహమాటంగా, సూటిగానే ఉంటాయి. గురుశిష్యుల్లో ఎవరు చెప్పినా చివరకు ‘భగవంతుడు ఒక్కడే సత్యం, నిత్యం. అందుచేత అతణ్నే భజించు’ అంటూ వివరిస్తూ మోహానికి అడ్డుకట్ట వేసి, జీవన్ముక్త స్థితిని పొందే మార్గం తెలియజేశారు.

Devotional Telugu

23 Nov, 01:07


లయాత్మక జీవనం


చిన్నారి బుడత నెలల వయసులో తప్పటడుగులతో నడక ప్రారంభిస్తాడు. ఆగిఆగి లయగా బిడ్డ అడుగులు భూమిపై పడుతుంటే కన్నతల్లి మురిసిపోతుంది. తనపై పడే ఆ చిట్టి అడుగుల కమనీయ స్పర్శకు నేలతల్లి సైతం పులకించిపోతుంది. సూర్యభగవానుడు తూర్పు కొండలనుంచి ఉన్నపళంగా ఆకాశంలో కానరాడు. కొండచరియలనుంచి అరుణకాంతులతో కూడిన ఉషోదయపు వెలుగుతో నెమ్మదిగా ఆవిర్భవిస్తాడు. ఆ తరవాత భానుడు లయాత్మకంగా కొండ అంచును దాటుతాడు. నేలపై సూర్యకిరణాలు విరాజమానమవుతూ కనువిందు చేస్తాయి. బింబ కదలికలు కనిపించవు గానీ మధ్యాహ్న సమయానికి ఆకాశం మధ్యలో ప్రకాశిస్తాడు భానుడు. ఆ తరవాత మెలమెల్లగా కిందికి వాలుతూ పడమర దిక్కున దిగంతంలో కలిసిపోతాడు. చందమామ గమనమూ అంతే. లయాత్మకమైనది. భూమిలో విత్తనాలు నాటుతాం. ఎండ, గాలి, చెమ్మ తగిలాక మూడో రోజుకు దళాలతో మొక్క ఊపిరి పోసుకుంటుంది. ఆకృతి దాల్చి మనోహరంగా కనిపిస్తుంది. అలా మొక్క లయాత్మకంగా ఎదుగుతూ పెద్దదవుతుంది. సుదూరం నుంచి అలలా సాగి గాలిలో వినిపించే ఓ పల్లెపదం వీనులవిందు చేస్తుంది. ఆ మనోహర గీతం వినబడే దిక్కుపై దృక్కులు సారిస్తాం. అలాగే నాట్యరవళి పరవశానికి గురిచేస్తుంది. సంగీత నాట్యకళలు లయ ప్రాధాన్యంగా సాగుతాయి. సాహిత్యంలోని ఛందస్సులో లయ ఉంటుంది.

ఓ ఆనకట్ట కట్టాలంటే కొన్ని సంవత్సరాలు పడుతుంది. ఓ ఆకాశ హర్మ్యం నిర్మించాలన్నా అంతే. ఓ నిర్మాణాన్ని కూల్చడం గంటల్లో పని! విత్తనం, మొక్క, పువ్వు, పిందె, కాయ... ఇలా దశలు దాటు కుంటూ ఓ సమయానికి ఫలసాయం అందిస్తాయి వృక్షాలు. విధ్వంసక ఘటనలు ప్రకృతిలో మెరుపు వేగంతో జరుగుతాయి. రోడ్డు ప్రమాదాలు, భూకంపాలు, వరదలు, సునామీలు, సుడిగాలులు, కార్చిచ్చులు... ఇలా మానవ వినాశానికి కారణమయ్యే ఉత్పాతాలు హెచ్చరిక లేకుండా విధ్వంసం సృష్టిస్తాయి.

లయాత్మకంగా మానవుడు జీవించాలని, ఆ దిశగా జీవనశైలి అలవరచుకోవాలని ప్రకృతి ఆకాంక్ష కాబోలు అనిపిస్తుంది. అటువంటి లయలో క్రమశిక్షణ దాగుంటుంది. లయ తప్పినప్పుడు ఊహకందని పరిణామాలు చోటుచేసుకుంటాయి. గుండె నిర్ణీత వేగంలో లయాత్మకంగా నడుస్తుంది. ఆ వేగం హెచ్చినా, తగ్గినా ముప్పే. అందుకే మనిషి లయాత్మక జీవనం సాగించాలని ప్రకృతి చెబుతుంది. గురువులు బోధిస్తారు. అది జీవనశైలిని ఏర్పరచుకోడానికి తోడ్పడుతుంది. యోగా, ధ్యానం వంటి అభ్యాసాలు సైతం లయాత్మకంగా చేయవలసి ఉంటుంది. వేగంగా సాగే నడక మంచిదంటారు. వేగంగా నడిచే నడకలోనూ ఓ లయ ఉంటుంది. అలా హృదయ కండరాలు బలపడతాయి. కొందరు హడావుడిపడుతూ వేగంగా పనులు చేయాలని చూస్తారు. కచ్చితత్వంతో వేగంగా పనిచేయగల సామర్థ్యం యంత్రాలకే పరిమితం. మానవుడు యంత్రంలా జీవించకూడదు. లయాత్మక జీవితం గడిపేవారు ఒత్తిడికి దూరంగా ఆరోగ్యంగా జీవిస్తారంటారు ఆరోగ్య నిపుణులు.

శిశువు జన్మించేముందు తొమ్మిది మాసాలు గర్భవాసం చేస్తుంది. ఒక పువ్వును భయపెట్టి, తొందరగా వికసింపజేయలేం. హృదయం ఆనంద మాధుర్యాన్ని ఆస్వాదించిన వేళ కళాకారుడిలో సృజన జాగృతమవుతుంది. భయభ్రాంతులకు గురైన వేళ అతడు కళాఖండాలను సృజించలేడు. ప్రాణుల సహజ ఆవిర్భావం, అంతర్ధానం సైతం లయను సంతరించుకునే జరుగుతాయి. లయతో అనుసంధానమై జీవయాత్ర చేసినప్పుడు మనుషులు ఆరోగ్యంగా, ఆనందంగా జీవిస్తారన్నది నిపుణుల మాట. మానవుల శారీరక, మానసిక వ్యవస్థలు లయాత్మక నడవడికి అనుగుణంగా నిర్మితమైనవే కాబట్టి అలా జీవిస్తే వారి జీవితాలు సార్థకమవుతాయి. ఆనందనందనాలవుతాయి.

Devotional Telugu

18 Nov, 02:13



ఎప్పుడు కోప్పడాలి?


కోపం అనేది నిన్ను నిన్నుగా నిలవనీయని ఒక అనిశ్చిత ఉద్విగ్న స్థితి. కోపానికి కారణాలు అనేకం. నష్టాలు కూడా ఎన్నో. కోపం సింహాసనం ఎక్కితే కారణం నిష్క్రమిస్తుంది. ఇంగితం నశిస్తుంది. హృదయం జ్వలిస్తుంది. చెవి మంచిమాటలు వినదు. మాట అదుపు తప్పుతుంది. కంటికి దోషాలు మాత్రమే కనపడతాయి. మనసు యథార్థాన్ని చూడదు, చూసినా అంగీకరించదు. చేతలు అదుపులో ఉండవు. శక్తి వృథా అవుతుంది. మనసు అశాంతికి నెలవవుతుంది. మితిమీరిన కోపం ఆవహిస్తే మనిషి పశువవుతాడు.

కోపాన్ని వ్యక్తం చేస్తే బంధాలు కోల్పోతారు, అణచుకుంటే మనశ్శాంతి కోల్పోతారు. ఫలితంగా తనకోపమే తనకు శత్రువవుతుంది.

కోపం అదుపులో ఉన్నంతసేపు దాన్ని ఒక ఆయుధంగా వాడుకోవచ్చు. నయాన చెప్పినా గ్రహించనప్పుడు తల్లిదండ్రులు సంతానం మీద, ఉపాధ్యాయులు విద్యార్థుల మీద, పెద్దలు పిన్నల మీద కోపం ప్రదర్శించాలి. అది వారి నడక, పద్ధతులు, మాటతీరు బాగాలేవని తెలియజెప్పేందుకు, భయభక్తులు కలిగించేందుకు ఒక మార్గం. అంతేగాని, కోపం తెచ్చుకోకూడదు. ఈర్ష్యాద్వేషాలకు తావు లేకుండా ఇతరుల తప్పులు తెలియజెప్పేలా ఉండాలి. ఇతరుల అహాన్ని వ్యక్తిత్వాన్ని గాయపరచకూడదు. అహం దెబ్బతిన్నప్పుడు, తిరస్కృతికి గురైనప్పుడు కోపం అదుపు తప్పుతుంది. విషయం మరుగునపడి విధ్వంసానికి, తీవ్ర పరిణామాలకు దారి తీస్తుంది.

కోపం తెచ్చుకోవడం ఎంత ప్రమాదమో, కోపం తెప్పించడం కూడా అంతే ప్రమాదం. పెద్దలు గురువులు, సాధువుల పట్ల వినయ విధేయతలతో వారి అనుగ్రహం పొందేట్లు అప్రమత్తంగా నడచుకోవాలి. ఆగ్రహం కలిగిస్తే వారి కోపాగ్నికి ఆహుతి కాక తప్పదు. కోపానికి గురైనవారు ఇతరుల ఆగ్రహానికి కారణం అర్థం చేసుకుంటే ఘర్షణ ఉండదు.

చాలామంది తాము అనుకున్న పద్ధతికి ఎవరైనా భిన్నంగా ప్రవర్తించినా, బాగా ప్రేమించి అభిమానించేవారు తన భావాలను అర్థం చేసుకోక పోయినా, చివరికి నిత్యం వాడే వస్తువులు సరిగ్గా లేకపోయినా పనిచేయకపోయినా కోపమొస్తుంది. అటువంటి చిన్న చిన్న విషయాలకు సహనం కోల్పోయి కోపం తెచ్చుకోవడం తప్పు. అది అవగాహన రాహిత్యాన్ని చాటుతుంది. అసమర్థుడి కోపం ఇంట్లో వస్తువులకు, బయటి బంధాలకు చేటు.

తలనొప్పి రోగం కాదు, అంతర్గతంగా తలెత్తిన ఏదో ఒక రోగానికి సూచన అంటారు వైద్యులు. కోపం కూడా మనసులో ఉత్పన్నమైన ఏదో ఒక ఉద్విగ్నతకు పర్యవసానం. సద్వివేచన, ఆత్మవిమర్శతో కోపానికి కారణాన్ని తెలుసుకుని దాన్ని పరిష్కరించుకోవాలి. లేకపోతే మూల్యం చెల్లించక తప్పదు.

వ్యక్తిత్వానికి, తనను నమ్ముకున్నవారికి, దేశానికి, ధర్మానికి హాని కలిగినప్పుడు కోపం రాకపోతే తప్పు.

కోపానికి ఎవరూ అతీతులు కారు. కోపాన్ని సదా నియంత్రణలో ఉంచుకోవాలి. అవసరమైన సందర్భాల్లో మాత్రమే కోపం ప్రదర్శించాలి. ఎప్పుడు ఎంతవరకు కోపం తెచ్చుకోవాలి అనేది కూడా తెలిసి ఉంటేనే అది సాధ్యం. మనిషి నిగ్రహం అప్పుడే తెలుస్తుంది. ఉచితంగా లభిస్తుందని ప్రతిసారి అందరిమీదా కోపాన్ని ప్రదర్శించకూడదు. అది పిచ్చివాడి చేతిలో రాయిలా కాకూడదు. విజ్ఞతతో ఆయుధంగా మలచుకోవాలి.

Devotional Telugu

21 Aug, 06:46


https://t.me/DevotionalAudio

Devotional Telugu

20 Aug, 14:32


రుజువర్తన

మన స్వభావం మూడు విషయాలమీద ఆధారపడి ఉంటుంది. అవి ఆలోచన, వాక్కు, కర్మ. ఆలోచనకు మూలం మనసు. అందుకే మనోవాక్కాయకర్మలంటారు. ఇవి త్రికరణాలు. కరణమంటే సాధనం, పనిముట్టు, కారణమనే అర్థాలున్నాయి. ఏ పని చెయ్యాలన్నా దానికి అనుగుణమైన ఆలోచన లేదా తలపు మనసులో కలగాలి. అప్పుడు దాని సాధ్యాసాధ్యాలు బేరీజు వేసుకొని, మాటద్వారా వ్యక్తం చేస్తారు. ఆ పైన కర్మేంద్రియాలతో ఆచరిస్తాం. ఈ విధంగా మనసులో బయలుదేరిన ఆలోచనలన్నీ శరీరంలో పరిసమాప్తమవుతాయి. గౌతమబుద్ధుడు బోధించిన అష్టాంగమార్గంలో సమ్యక్‌ ఆలోచన, సమ్యక్‌ వాక్కు, సమ్యక్‌ క్రియ అనే మూడూ ఉన్నాయి. అంటే మంచి ఆలోచన చెయ్యడం, మంచిగా మాట్లాడటం, మంచి పనులు చెయ్యడం అని అర్థం.

ఈ మూడూ మంచిగా ఉండటమే కాదు... వాటి మధ్య సమన్వయమూ కావాలి. మనసులో తాజా ఆలోచనకు, నోటితో మాట్లాడే మాటకు పొంతన ఉండదు కొందరికి. చెప్పే మాటలకూ చేసే పనులకూ సంబంధం ఉండదు మరికొందరి విషయంలో. చాలామందికి మూడూ మూడు దిక్కుల్లో పరుగెడుతుంటాయి. నోటితో నవ్వుతూ నొసటితో వెక్కిరించేవాళ్లు చాలామంది కనిపిస్తారు.

మనసా, వాచా, కర్మణా ఒకటిగా ఉండటాన్ని ఆర్జవం అంటారు. ఆర్జవం అంటే రుజుమార్గం, చక్కనైనది అని నిఘంటు అర్థాలు. రుజువంటే తిన్ననైనది. రుజు రేఖ అంటే సరళరేఖ. బాణం ఎలా సరళరేఖలా ఉంటుందో, మన ప్రవర్తన అలా నిటారుగా ఉండాలి. మనసు, వాక్కు, కర్మల్ని ఒకే తాటిపై నిలపగలగాలి. దీన్నే రుజువర్తనమంటారు. మనసు, వాక్కు, కర్మలు రుజువర్తనతో పనిచేసినప్పుడు అటువంటివారిని మహాత్ములంటాం.

చాలామందికి మాటలు కోటలు దాటతాయి కాని, కాలు గడపదాటదు. అంటే, ఆచరణ శూన్యమని అర్థం. ఇటువంటివారు వర్తమానంలో రాజకీయరంగంలో ఎక్కువగా తారసిల్లుతుంటారు. సాహిత్య రంగమూ దానికి భిన్నంగా ఉండటంలేదు. ఆదర్శాలను, సమానత్వాన్ని రచనల్లో ప్రబోధించేవాళ్లు చాలామంది తమ జీవితంలో దానికి భిన్నంగా నడవడం జగమెరిగినదే. సత్యవచనానికన్నా ఆర్జవం ఉన్నతమైనది. ఇందులో ఆలోచన, కర్మ కూడా ఉన్నాయి. శ్రీరాముడు ఆర్జవం వల్లనే పురుషోత్తముడయ్యాడు. ప్రతి మనిషికీ తన అంతరాత్మే సాక్షి. నా మనసులో ఏముందో ఎవరికి తెలుసు అని మనం అనుకోవచ్చు. మనం లోపల ఒకటి భావించి, బయట మరొకటి మాట్లాడితే మన అంతరాత్మ మనల్ని హెచ్చరిస్తుంటుంది. అపరాధభావన మనల్ని కుంగదీస్తుంది. దానివల్ల మనసు సంఘర్షణకు లోనవుతుంది. ఒకటి చెప్పి, మరొకటి చేస్తే లోకం నిలదీస్తుంది. నలుగురిలో నగుబాటవుతాం.

మనోవాక్కాయకర్మల మధ్య సమన్వయం పాటించకపోతే కనబడని అంతరాత్మకు, కనిపించే లోకానికి సమాధానం చెప్పుకోవాల్సి వస్తుంది. కర్మను, వాక్కును నడిపేది మనసైతే- ఆ మనసుకు పైన అంతరాత్మ ఉందని గుర్తు పెట్టుకోవాలి.

నువ్వు ఏ ఆలోచన నాటితే అది నీ మాట అవుతుంది. నువ్వు ఏ మాట మాట్లాడితే అది నీ చర్య అవుతుంది. నువ్వు ఏ చర్య చేస్తే, అది నీ నడవడి అవుతుంది అంటారు స్వామి దయానంద సరస్వతి. త్రికరణాల సరళరేఖను విచ్ఛిన్నం కాకుండా కాపాడుకోగలిగితే సమాజంలో ధర్మం ప్రతిష్ఠితమవుతుంది. మనమూ మహాత్ములమవుతాం.

Devotional Telugu

03 Aug, 18:36


సంస్కార సౌరభం

‘సూర్యచంద్రులవలె మానవులు సమున్నత మార్గంలో నడవాలి. గతి, నియతి తప్పకుండా సూర్యచంద్రులు సంచరిస్తున్నట్లే మనిషి సన్మార్గంలో ముందుకు కొనసాగాలి. సర్వప్రాణుల్లో అత్యంత శ్రేష్ఠమైన జీవి- మనిషి.

సత్సాంగత్యంతో, సద్బుద్ధితో, సాధుగణాలతో నీతిమంతంగా మనిషి జీవించాలి. ఈ సంస్కారాలన్నీ మానవ జీవితాన్ని మహోజ్జ్వలంగా తీర్చిదిద్దుతాయి’- అని అధర్వవేదం అభిలషించింది. తల్లిదండ్రులను, ఆచార్యుడిని త్రివిధ దేవతలుగా శాస్త్రాలు అభివర్ణించాయి. వ్యక్తిత్వ నిర్మాణానికి, సౌశీల్య సాధనకు సంస్కారం అత్యంత ఆవశ్యకం. ఒక జాతి సౌభాగ్యం, పురోగతి ఆ జాతి వారసుల సంస్కారాన్ని బట్టి ఉంటాయని స్వామి వివేకానంద పేర్కొన్నారు. సంపూర్ణ మానవులు అంటే సంస్కార ప్రపూర్ణులు. సమాజ పురోగతి, అభ్యున్నతి- రాశి పరంగా కాదు, వాసి పరంగా గణించాలి. వ్యక్తి సాంఘికంగా ఎదగడమంటే నైతికంగా ఉత్తమ స్థితికి చేరుకోవడం.

ఈ జన్మలో చేసిన సత్కర్మల వల్ల గత జన్మలో చేసిన పాపాలన్నీ నివారణ చెందుతాయన్నాడు శ్రీరాముడితో వసిష్ఠుడు యోగ వాసిష్ఠంలో! అరిషడ్వర్గాలు అనే అడ్డంకుల్ని అధిగమించిన తరవాత ఆధ్యాత్మిక వికాసం అలవడుతుంది. ఆధ్యాత్మిక చింతన అనేది వ్యక్తుల్లో సంస్కార సౌరభాల్ని వెదజల్లు తుంది. ఏ దేశ మర్యాదలైనా ఆ దేశ ప్రజల జీవన వ్యవహార ధర్మాలపై ఆధారపడి ఉంటాయి. అందుకే జీవితంలో సత్ప్రవర్తన, సదాచారాల్ని మూలభూమికగా స్వీకరించాలి. సముచితమైన మానవ సంబంధాల వల్ల ఇతరులతో సానుకూల బాంధవ్యాలు ఏర్పడతాయి. అందరితో సౌజన్యయుతమైన, సామరస్యపూరితమైన వైఖరితో మసలుకోవడం అద్భుతమైన జీవన కళ! ప్రతి వ్యక్తి జీవిత లక్ష్యం కేవలం జీవించడం మాత్రమే కాదు. ఆదర్శవంతంగా జీవించినవారే చరితార్థులవుతారు. ఇది ఎందరో మహనీయుల విషయంలో నిరూపితమైన సత్యం!

అంతరంగ శుద్ధి, అమలిన ప్రేమభావన, అనితర సాధ్యమైన భావ నియంత్రణ- ఈ మూడు అంశాలూ వ్యక్తుల సంస్కార స్థాయుల్ని నిర్ణయిస్తాయి. విశాల హృదయులను, అందర్నీ తమతో కలుపుకొనిపోయే వ్యక్తులకు మిత్రులు అధికంగా ఉంటారు. ఆ మిత్ర బృందానికి వారే ఆదర్శనీయులవుతారు. అలాగే, నిష్కల్మషమైన ప్రేమభావజాలం వ్యక్తుల్ని అభిమానించేలా చేస్తుంది. విచక్షణ, ప్రజ్ఞ, విజ్ఞత, ఓర్పు అనేవి భావ నియంత్రణకు ప్రధానమైనవి. స్థితప్రజ్ఞ, సమయోచిత స్ఫూర్తి వ్యక్తులకు ప్రత్యేకతను ఆపాదిస్తాయి. లౌకిక జీవితంలో పై స్థాయికి ఎదగాలంటే వివిధ పరీక్షల్లో ఉత్తీర్ణత సాధించాలి. అలాగే సాధకుడికి, సంస్కారవంతుడికి పరీక్షలు ఎదురవుతుంటాయి. ఇవి ఆధ్యాత్మిక ఉన్నతికి గీటురాళ్లవంటివి. సాధకుల నిగ్రహాన్ని, ఓర్పును ఇవి నిగ్గుతేలుస్తాయి.

జీవితం అశాశ్వతం, యౌవనం, ధనం అస్థిరాలు. కుటుంబ బంధాలన్నీ తాత్కాలికం. అయితే లోకంలో శాశ్వతమైనవి, నశించనివి- వ్యక్తులు తమ సంస్కార వైభవంలో చేసిన ధర్మం, ఆ సంస్కార ఫలంగా సాధించిన కీర్తి! సంస్కార సుశోభితులైన వారే అసలైన కీర్తిశేషులు! సంస్కారమే ఆభరణంగా ధరించిన వ్యక్తులు దేదీప్యమానమైన తేజస్సుతో యశస్సుతో నిరుపమాన రీతిలో ప్రకాశిస్తారు.

Devotional Telugu

01 Aug, 02:31


ఓటమి-గెలుపు

జీవితంలో ఒకసారి ఓడటం, మరోసారి గెలవడం మామూలే. గెలిస్తే సంబరం అంబరం చుంబిస్తుంది. అమందానందం వెల్లివిరుస్తుంది. మన విజయానికి వీలుగా ఆ దేవుడు మూడు శక్తులు ప్రసాదించాడు. ఇష్టమైన పని తెలివిగా కుదురుగా చేయడానికి ఇచ్ఛాదేవిని, జ్ఞానదేవతను, క్రియాశక్తిని తోడుగా ఉంచాడు. ఏ పనికి ఎలాంటి ఫలితం ఇవ్వాలో అదొక్కటీ...

జీవితంలో ఒకసారి ఓడటం, మరోసారి గెలవడం మామూలే. గెలిస్తే సంబరం అంబరం చుంబిస్తుంది. అమందానందం వెల్లివిరుస్తుంది. మన విజయానికి వీలుగా ఆ దేవుడు మూడు శక్తులు ప్రసాదించాడు. ఇష్టమైన పని తెలివిగా కుదురుగా చేయడానికి ఇచ్ఛాదేవిని, జ్ఞానదేవతను, క్రియాశక్తిని తోడుగా ఉంచాడు. ఏ పనికి ఎలాంటి ఫలితం ఇవ్వాలో అదొక్కటీ తన చేతిలో ఉంచుకున్నాడు.

పని రెండురకాలు... ఒకటి కోరికతో మనకోసం చేసేపని. రెండోది అందరికీ మంచి కలిగించే విధంగా చేపట్టే పని. ఎవరు ఏ పని చేయాలో నిర్ణయిస్తాడు భగవంతుడు. చేయవలసిన రీతిలో ఒళ్లు దగ్గర పెట్టుకుని పనిచేస్తే తగిన ఫలితం వస్తుంది. ఆ నమ్మకం మనకు ఉండాలి.
తాను కర్మ చేయవలసిన అవసరం లేకపోయినా, ఎలాంటి కోరిక కోరకపోయినా, భగవంతుడు ఈ జగత్‌ చక్రాన్ని క్షణం తీరిక లేకుండా నడిపిస్తూనే ఉన్నాడు. ఆయనను చూసి మనమూ పని చేయాలి. ఎంతో కొంత సేవ చేయాలి సమాజానికి. తోటి మనిషిని తప్పకుండా ఆదుకోవాలి.

బళ్లు ఓడలు, ఓడలు బళ్లు అవుతాయి. ధనికుడు పేదవాడవుతాడు. గరీబు నవాబుగా మారతాడు. ఇవన్నీ కళ్లారాచూస్తూ, ఏ పని ముట్టుకుంటే ఏం కొంపలంటుకుంటాయోనన్న భయంతో- మనం చేయకపోతేనేం... ఎవరో ఒకరు చేసేస్తారు అన్న ధీమాతో ఒళ్లు దాచుకోవడం మహాపచారం. అది జీవ ధర్మానికి విరుద్ధం. మూలపడ్డ యంత్రం తుప్పుపట్టి తునాతునకలైనట్టు- మన శరీరాలు, ఇంద్రియాలు సోమరిపాటుకు గురికాక తప్పదు. పనికి దూరంగా ఉండటం సోమరి తనమే కాదు, ఆత్మవంచన కూడా. ఈ పని మనం చేస్తున్నాం కాబట్టి ఫలితం అనుకున్నట్టే రావాలి అనుకోవడం దురాశ. దురాశ వల్ల దుఃఖం కలుగుతుంది. ఓడిపోయానన్న ఆవేదన అగ్నిగోళంగా మారి కోపావేశానికి కారణం అవుతుంది. కోపిష్టికి ఒళ్లు తెలియదు. మెదడు మొద్దుబారుతుంది. బుద్ధిజ్ఞానాలు నశించడం వల్ల తానూ నశిస్తాడు. పురాణాల్లోని దూర్వాసుడు కోపం వల్ల, విశ్వామిత్రుడు కామం వల్ల, భృగుడు అహంకారం వల్ల, విభాండకుడు మమకారం వల్ల భంగపడ్డారు. జ్ఞానికి భంగపాటు తప్పనప్పుడు అసలు కర్మ చేయడం దేనికని అడగవచ్చు. సాక్షాత్తు ఆ భగవంతుడే కర్మలు చేపట్టుతూ, ఈ జగత్‌ చక్రం తిప్పుతుండగా- మనం చేతులు ముడుచుకుని, కాళ్లు చాపుకొని కూర్చోవడం తగునా? కేవలం మన స్వార్థం కోసం పాటుపడకుండా నలుగురికీ పనికి వచ్చే మంచిపనులు చేపట్టాలి. అలా విశాల హృదయంతో పనులు చేస్తుంటే- ఫలితం పట్ల ఆసక్తి క్రమంగా తగ్గుముఖం పడుతుంది. గెలుపు ఓటముల నడుమనున్న అడ్డుగీత అంతర్థానమైపోతుంది.
అనుకున్నది అయితే మంచిది, అనుకోనిది జరిగినా అదీ మనమంచికేనని తెలుసుకోవడమే వైరాగ్యం. గెలుపు ఓటమి నాణానికి బొమ్మ,

బొరుసు లాంటివి. సముద్రానికి ఆటూపోటూ, చంద్రుడికి ఎదుగుదల, తరుగుదల తప్పవు. కష్టసుఖాలు వెలుగునీడల్లా వెంటాడుతూనే ఉంటాయి. గెలుపుతో పొంగిపోకుండా, ఓటమికి కుంగిపోకుండా సమతౌల్యం సాధించడమే జీవిత పరమార్థం.

Devotional Telugu

31 Jul, 02:10


మనసు అమృతకలశం

మనిషి ఉన్నచోటనే ఉంటూ మనసుకు రెక్కలు తొడిగి సీతాకోక చిలుకలా ఎగురుతూ ఎక్కడ కావాలంటే అక్కడ వాలవచ్చు. మొలవబోతున్న రెక్కలను ముడిచి గొంగళిపురుగులా గూటిలో బందీ అయి తనదైన లోకంలో సుషుప్తావస్థలో ఉండవచ్చు

ములుకుల్లాంటి మాటలకు మనిషి మనసు కుంచించుకుపోతుంది. పొగడ్తలకు, ప్రశంసలకు సహస్రదళ వికసిత పుష్పమవుతుంది. కంటికి కనిపించని మనసు చేసే గారడి ఇంతా అంతా కాదు. జీవితకాల అనుభవాల సారాన్ని మెదడులో నిక్షిప్తం చేసి అవసరానికి అందించేది మనసు. నేల కేవలం సారవంతమైనదైతే సరిపోదు... అక్కడ మంచి విత్తనాలు చల్లాలి. మొలకెత్తాక ఎరువులేసి తగిన జాగ్రత్తలు తీసుకుంటే మొక్కలవుతాయి. ఎప్పటికప్పుడు కలుపుమొక్కల్ని తొలగిస్తే, మొక్కలు ఆరోగ్యవంతంగా పెరిగి కల్పవృక్షాలై సకల జీవుల అవసరాలు తీరుస్తాయి. అలాగే, మనం మనసును ప్రశాంత చిత్తంతో ప్రక్షాళించుకోవాలి. సవ్యమైన ఆలోచనల తేటబావిలా రూపొందించుకోవాలి. నిత్యం మంచిని చూడాలి, మాట్లాడాలి, వినాలి. మనసుకు మంచిని నూరి పోయాలి. పెద్దలం దించిన సూక్తులు, మహి తోక్తులను మనసుకు పట్టించాలి. కళ్లతో చదివిన, చెవులతో గ్రహించిన పురాణ ఇతిహాసాలతో మనసులోని మాలిన్యాన్ని తొలగించుకోవాలి. మనసంటే నిర్మల ఆకాశంలా, నిశ్చల తటాకంలా, స్వచ్ఛమైన ముత్యంలా ఉండాలి. మనిషి ఉత్తముడిగా, ఉన్నతుడిగా సమాజంలో మనగలగడానికి లోపల దీపంలా వెలుగు వెదజల్లుతున్న మనసు కారణం. రాముడి ధర్మపరాయణత్వం, రావణుడి అధర్మవర్తనం, పాండవుల సౌశీల్యం, కౌరవుల కుటిలత్వం, హిరణ్యకశిపుడి రాక్షసత్వం, ప్రహ్లాదుడి నారాయణ భక్తి తత్వం వారి వారి మనసుల్లోని ఆలోచనలకు ప్రతిరూపం.

దానగుణానికి, సత్యసంధతకు, రుజువర్తనకు మూలకారణం మనసు. నీరు పల్లానికి ప్రవహించినట్లు, గాలి పీడనానికి లోనైనట్లు, నిప్పు గాలివాలును అనుసరించినట్లు, మనసు నిరంతరం పరి పరి విధాల పోతూనే ఉంటుంది. మనసును నియంత్రించడం అనుకున్నంత సులువు కాదు. పట్టులో ఉన్నట్టే ఉండి గుప్పిట్లో ఉన్న ఇసుకలా జారిపోతుంది. కనిపించే దృశ్యాలకు, వినిపించే మాటలకు, అనుభూతి చెందే స్పర్శకు మనసు త్వరితగతిన స్పందించకూడదు. విషయంపై సరైన అవగాహన కలిగి, ఆలోచనలు కొలిక్కి వచ్చాక అనుకున్నది అమలుపరచాలి.

ఆటలో ఓడిపోయినప్పుడు, ఆర్థికంగా నష్టపోయినప్పుడు, అవమానం పాలైనప్పుడు, జీవితం విలువ కోల్పోయిందనిపిస్తుంది. మన జీవితంలో అదో దురదృష్టకర సన్నివేశం... అంతే. మనసు అస్తవ్యస్తంగా ఉన్నప్పుడు నిర్ణయాలు తీసుకోకూడదు. కుదుటపడిన మనసు మంచి ఆలోచనలకు నెలవవుతుంది. మనిషి సక్రమ మార్గంలో సంచరించేందుకు సహకరిస్తుంది. సముద్రంలో పడిన కెరటం తరవాత ఆకాశాన్నంటే కెరటం వచ్చి తీరుతుందన్నది ప్రకృతి పాఠం. ఇది మనసులో పెట్టుకుంటే అనాలోచిత నిర్ణయాలకు అవకాశం ఇవ్వరు. మనసు మర్మాన్ని తెలియజేసే మార్గాలను జ్ఞానులు చూపారు. స్వయంకృషితో మనసు గుట్టు తెలుసుకోలేకపోయినా, కనీసం పెద్దలు చూపిన మార్గంలో నడుస్తూ మనసును అమృతకలశం చేసుకోగలిగితే, మానవజన్మ అర్థవంతమవుతుంది.

Devotional Telugu

30 Jul, 13:04


ఉన్నత వ్యక్తిత్వం

వ్యక్తి ప్రదర్శించే ఉద్వేగాలు, శారీరక మానసిక లక్షణాలను అనుసరించి అతడి వ్యక్తిత్వాన్ని అంచనా వేస్తారు. సాధారణంగా మనిషి ప్రవర్తించే తీరును బట్టి ఉన్నత, నీచ(అధమ) వ్యక్తిత్వాలుగా భావిస్తారు. పూర్వం దేవతలు, మానవులు, రాక్షసులు వర్గాలుగా విడిపోయి జీవించేవారు.

వ్యక్తి ప్రదర్శించే ఉద్వేగాలు, శారీరక మానసిక లక్షణాలను అనుసరించి అతడి వ్యక్తిత్వాన్ని అంచనా వేస్తారు. సాధారణంగా మనిషి ప్రవర్తించే తీరును బట్టి ఉన్నత, నీచ(అధమ) వ్యక్తిత్వాలుగా భావిస్తారు. పూర్వం దేవతలు, మానవులు, రాక్షసులు వర్గాలుగా విడిపోయి జీవించేవారు. అందుకే దేవతలను దైవ దూతలని, మానవులను మానవతా మూర్తులని, రాక్షసులను దుర్మార్గులని విభజించి చూపేవారు. నేటి కాలంలో ఒకే మనిషిలో పరిస్థితులను అనుసరించి దైవత్వం, మానవత్వం, రాక్షసత్వం తాండవిస్తున్నాయి. ఉదయం దేవుడిగా కనిపించే వ్యక్తే మధ్యాహ్నం మనిషిగా, రాత్రికి రాక్షసుడిగా ప్రవర్తించవచ్చు. ఆయా స్థితిగతులను బట్టి వ్యక్తిత్వ స్వభావాలు మారుతుంటాయి. పూర్వ యుగాల్లో దేవుడు భూమి మీద అవతరించి రాక్షస సంహారం చేసేవాడు. నేటి సమాజానికి కావాల్సింది సంహారం కాదు, సంస్కరణ. అదే ఉన్నత వ్యక్తిత్వ వికాసానికి దోహదం చేస్తుంది. మనిషి దేవుడిగా మారకపోయినా నష్టం లేదు కానీ రాక్షసుడిగా మారకూడదు. జీవించినంత కాలం మానవత్వంతో మనిషిగా బతికితే చాలు. క్షణక్షణం మారే స్వభావం మనిషికి సహజంగానే ఉంటుంది. సృష్టిలోని ఇతర ప్రాణులు పుట్టినప్పటి నుంచి మరణించేవరకు తమ సహజ స్వభావాన్ని మార్చుకోవు. శాకాహార జంతువు మాంసాహారిగా మారదు. ఆకలితో చావునైనా కోరుతుంది కానీ అలవాటు మార్చుకోదు. మనుషులు బుద్ధిజీవులు. తమ సంకల్ప వికల్పాలతో అభీష్టాలను, అభిప్రాయాలను మార్చుకుంటారు.

మనిషికి మంచి ఆదర్శాన్ని అందించే నిమిత్తం భగవంతుడు అనేక అవతారాలు ఎత్తాడు. శ్రీరాముడిగా వ్యక్తిగత, కుటుంబ విలువలకు ప్రాధాన్యమిచ్చాడు. కొడుకు, సోదరుడు, మిత్రుడు, ప్రభువు చివరకు శత్రువుగా ఉత్తమంగా ఎలా ప్రవర్తించాలో ఆచరించి చూపాడు. సమాజంలో ప్రేమ, అనురాగం, ఆత్మీయతతో పాటు మంచివారికి సహకారం దుర్మార్గులకు వినాశనం తన జీవిత సందేశంగా శ్రీకృష్ణుడు అందించాడు. ఇవి అవతారమూర్తులు నేర్పిన ఉత్తమ వ్యక్తిత్వ పాఠాలు.
మనిషి మనీషిగా, దేవుడిగా ఎలా మారవచ్చో అనేక పురాణాలు చెబుతున్నాయి. అన్ని పురాణాల్లో అత్యుత్తమమైందిగా నారదుడు కీర్తించిన భాగవతంలోని అన్ని కథలు, పద్యాలు- నైతిక, ధార్మిక, మానవతా విలువల గురించే బోధించాయి.

చేతులతో శివుడి పూజ(సమాజ సేవే శివ పూజ), నోరారా హరినామ సంకీర్తన, దయ, సత్యం మనసారా తలచుకోలేనివారు తల్లులకు కడుపు చేటు అని భాగవత పద్యం చెబుతుంది. భాగవతుల కథలన్నీ మనిషిని ఉన్నతుడిగా తీర్చిదిద్దే ప్రక్రియలే.

మహాపురుషులు ప్రబోధించిన వ్యక్తిత్వ వికాస సిద్ధాంతాలు వారు నమ్మి ఆచరించిన ఉన్నత విలువలు. దయ, సత్యంతో కూడిన బుద్ధుడి బోధనలు, నిలువెత్తు ప్రేమ స్వరూపం జీసస్‌, సహనానికి ప్రతీక మహమ్మద్‌ ప్రవక్త, అహింసే పరమ ధర్మంగా ఆచరించిన గాంధీ మహాత్ముడు... అందరూ అనుసరణీయులే.

కాలువ ప్రవాహంలో కొట్టుకొనిపోతూ ప్రాణ భయంతో ఉన్న తేలును అది కాటు వేస్తున్నా చేతితో తీసి రక్షించే సాధువు కథ ఆదర్శవంతం. తేలు సహజ గుణం కాటు వేయడం, మనిషి సహజ గుణం కాపాడటం. ఉపకారికి ప్రత్యుపకారం గొప్ప కాదు. తనకు అపకారం చేసినా తాను వారికి మేలు చేయడం దైవత్వ లక్షణం. మనిషిని దేవుడిగా పూజించే స్థాయికి చేరకున్నా కనీసం తాను మనిషిగా జీవిస్తే చాలు. అదే ఉన్నతమైన వ్యక్తిత్వ పరిపూర్ణ జీవితం. సమాజానికి వెలుగు నింపే ఉజ్జ్వల కాంతి కిరణం.

Devotional Telugu

23 Jul, 13:01


అందమైన బంధం

సగం దూరం వరకు వెళ్ళి, మనసు మార్చుకొని వెనక్కి వచ్చినవాళ్ళు ఉన్నారు. ఆశ్రమ జీవితం గడుపుతూ కూడా తమ ఊరివాళ్లెవరైనా కనిపిస్తే వాళ్లెలా ఉన్నారు. వీళ్లలా ఉన్నారని వాకబు చేసేవారూ ఎందరో! బంధాలు అందమైనవి. మాత్రమే కాదు... గొప్పవి, కఠినమైనవి కూడా. బంధమే మనల్ని ఈ భూమ్మీదకు తీసుకువచ్చింది. వచ్చిన తరవాత మరిన్ని బంధాలు కల్పించింది.

ఆవు తనకు కట్టిన పలుపుతాడు తెంచుకొని వెళ్ళిపోవాలనుకుని అటు, ఇటు చుట్టూ తిరుగుతుంది. చివరకు తన పరిధి తాను తెలుసుకుని చతికిలపడుతుంది. మన నిస్సహాయతను మనం తెలుసుకోవాలి. అదే సమయంలో మనల్ని ఇలా ఉంచినవాడి గొప్ప దనాన్నీ గ్రహించాలి. ఎవరిమీదో కోపం వస్తుంది. ఎందుకో కోపం వస్తుంది. పారిపోవాలని అనిపి స్తుంది. తాళ్లతో కట్టి బంధించ రెవరూ అయినా వెళ్ళలేం. ఎందుకు, ఎవరు మనల్ని ఆపుతు న్నారో తెలియదు.

చూసిన ముఖాలే చూస్తూ, ఆడిన మాటలే ఆడుతూ, అదే తిండి తింటూ, నిద్రపోతూ తెల్లవారి లేచి మరో కొత్త సూర్యుడి కోసం ఎదు రుచూస్తాం. ఇదే బంధంమౌలికంగా మనిషి బతకడంలోనే బంధం ఉంది. బంధాలు అందంగా ఉంటాయి. అవి ఇనుప గొలుసులైతేనేం, బంగారు గొలుసులైతేనేం- బంధాలు బయటకు కనిపించవు. తల్లి వెంట బిడ్డ, బిడ్డ వెంట తల్లి... ఆ బిడ్డ ఎదిగి తల్లి.... అలా అందరూ కలిసి కుటుంబం. ఈ కుటుంబాలన్నీ ఈశ్వరుడివే. పరిస్థితులు అనుకూలంగా లేనప్పుడు మనసు వైరాగ్యానికి గురి అయినప్పుడు తట్టా బుట్టా సర్దుకుని ఎక్కడికైనా వెళ్ళిపోదాం అనిపిస్తుంది. కానీ, అంతలోనే ఆగిపోవాలి అనిపిస్తుంది. కనపడకుండా ఆపేదెవరని ఆలోచిస్తే- మనవాళ్లే కాదు... మన మధ్యలో ఉండే బంధమే అనిపిస్తుంది.

బంధాలు, వాటి స్వరూప స్వభావాల గురించి జ్ఞానులకు బాగా తెలుసు. ఆ బంధాల మాయలో పడకుండా, నమ్మిన సత్యాన్ని విడవకుండా దర్మమార్గంలో నిమిత్తమాత్రుల్లా వారు కాలం గడిపారు. మోహపూరితమైనవి. మోసపూరితమై నవి దేవతలను కూడా ఆధోగతిపాలు చేసిన బంధాలు ఎన్నో. అందుకే మనుషులు జాగ్రత్తగా ఉండాలని మహానుభావులు ఎప్పుడో హెచ్చరించారు.

కోట బయట యుద్ధం, తోట లోపల యుద్ధం అంటూ శ్రీరామకృష్ణ పరమ హంస- బంధాలతో కలిసి ఉండటం, లేకుండా ఏ కొండలలోనో కోనలలోనో జీవించడం గురించి చెప్పారు. నాకు ఏ బంధాలూ లేవు... కొండమీద ప్రశాంతంగా, హాయిగా బతుకుతున్నాను' అని ధ్యానంలో అనుకున్న మనిషికైనా ఆకలి, నిద్ర తప్పవు. అతడి ఆధ్యాత్మిక శక్తి పెరిగే కొద్దీ, అతడి చుట్టూ చేరే జనం పెరుగుతారు. లేనిపోని బంధాల్లోకి ఆయన్ను ఈడుస్తారు.

మనకు శరీరం ఉంది. పంచభూతాలతో దానికి బంధం ఉంది. మనసు, బుద్ధి, అహంకారంతో దానికి బంధం ఉంది. ఈ విశాల విశ్వంతో బంధం లేని జీవి ఎవరూ లేరు. అయినా- అన్ని బంధాలూ అశాశ్వతమైనవి. ఏదో ఒకరోజు తెగి పోతాయి. అన్నింటి కంటే గొప్పది, శాశ్వతమైనది- ఆత్మబంధం. ఒకరు, మరొకరి కోసం జీవిస్తే ఆ బంధం చరితార్థమవుతుంది. రక్తసంబంధాలను మించినవి. దైవసంబంధాలు. ఇది అందరూ తెలుసుకోవాలి!

Devotional Telugu

13 Jul, 02:24


పొరపాట్లు

ఉద్యానవనంలో అనామకంగా పెరిగే పిచ్చి మొక్కలు లాంటివి మానవ జీవితంలో మనం అప్పుడప్పుడు చేసే పొరపాట్లు, మొక్కల్లోని ఔషధ తత్వాలను శాస్త్రజ్ఞులు వెలికి తీసినప్పుడు వాటి గొప్పతనం ప్రపంచానికి తెలుస్తుంది. అందాకా అవి పిచ్చి మొక్కలుగానే మిగులుతాయి. సరిదిద్దుకున్న మన పొరపాట్లు సైతం కాలగతిన ఆప్తులకు మధురమైన అనుభూతుల్ని మిగులుస్తాయి.

మనిషి సంఘజీవి. సమాజంలోని వ్యక్తులతో అతడికి ఎన్నో బంధాలు, అనుబంధాలు, స్నేహాలు! ప్రతి మనిషికీ ఓ ప్రత్యేకమైన మనస్తత్వం ఉంటుంది. తన మనసుకు సరిపడే వారితోనే స్నేహం కుదురుతుంది. అయినా వారిలో కొన్ని ప్రవర్తనాపరమైన తేడాలు ఉంటాయి. కాలగతిన మనసు తెచ్చే మార్పులు ఒక్కొక్కసారి వ్యధను కలిగిస్తాయి. మనిషి చేత పొరపాట్లు చేయిస్తాయి. పిచ్చి మొక్కలు ఔషధ మొక్కలుగా గుర్తింపు తెచ్చుకొని వెలుగొందినట్లు మనం చేసే పొరపాట్లు సరిదిద్దుకుంటే స్నేహ సంబంధాలు వికసించి పరిమ శిస్తాయి. ఓ స్నేహితుడు ఓ విజయాన్ని సాధించాడు. వేరే కారణంగా స్థిమితమైన మనసుతో లేని అతడి మిత్రుడు దానిపై సాధారణంగా స్పందించాడు. మిత్రుడి నుంచి ఎక్కువ స్థాయిలో ప్రశంస ఆశించిన విజయుడైన స్నేహితుడికి అది అసంతృప్తిని కలిగించింది. మిత్రుడితో మాట్లాడటం మానేశాడు. మిత్రుడు, విజేత అయిన స్నేహితుడికి క్షమాపణ | తెలుపు కోవలసి వచ్చింది. ఆంగ్లభాషలో 'సారీ' అన్న పదం చాలా చిన్నది. అయినా ప్రభావవంతమైనది. చెప్పేవారి హుందాతనాన్ని ఏ మాత్రం తగ్గించని ఆ పదం నొచ్చుకున్న స్నేహితుడి అహాన్ని సంతృప్తిపరచి సాంత్వన చేకూర్చింది. వారి మధ్య స్నేహ పరిమళం సాధారణ రీతిలో మరల వెల్లివిరిసింది. ప్రవర్తనాపరంగా అప్పుడప్పుడు ఎగసిపడే పొరపాట్ల పట్ల మనిషి జాగ్రత్త వహించాలి. అవి నేరాలు కావు. అనైతికమైనవీ కావు. కేవలం స్వల్పమైన ప్రవర్తనా దోషాలు. అవి ఎదురైనప్పుడు కారకులైనవారు కొంచెం జాగ్రత్త వహించి తప్పు జరిగిందని భావిస్తే ఎదుటివారికి క్షమాపణ చెప్పినప్పుడు పరిస్థితులు చక్కబడతాయి. మనిషన్న ప్రతివాడూ పొరపాట్లు చేస్తాడు! చేసిన పొరపాట్లు మరల మరల చేయకపోవడం విజ్ఞత ఆ విజ్ఞతను అందరూ అంది పుచ్చుకొంటే సమాజం పరిమళాలు వెదజల్లే పుష్పవనం అవుతుంది. మనిషి సాధారణంగా చేసే పొరపాట్లను శివపురాణం ప్రస్తావిస్తుంది. తన మాటలు, చేతలతో ఎవరికీ హాని చేయకపోయినా వాటిని మనసులో అనుభూతించడం సైతం పాపం. దుర్యోధనుడు అహంకారంతో చేసిన ఒక పొరపాటు కురుక్షేత్ర సంగ్రామానికి ముందు శ్రీకృష్ణభగవానుడి సమక్షంలో జరుగుతుంది. సార్వభౌమాధికార గర్వంతో స్వామి తలగడ వైపు ఆసీనుడయ్యాడు దుర్యోధనుడు. పాదాల వైపు కూర్చున్నాడు. అర్జునుడు. ముందుగా స్వామి దర్శనం, సహాయాన్ని కోరే అవకాశం, ఆ అదృష్టం అర్జునుడికే కలిగాయి. ఈ పొరపాట్లు చిన్నవైనా ఒక్కొక్కసారి అవి కలిగించే నష్టం ఘనంగా ఉండవచ్చు. అందుకే మనిషి తన ప్రవర్తన విషయంలో జాగ్రత్త వహించాలి. సదా అప్రమత్తుడై జీవించాలి.

3,831

subscribers

105

photos

23

videos