లక్ష పుస్తకాల సేకర్త !
నవంబర్ 14 నెహ్రూ జయంతి, బాలల దినోత్సవం కూడా. ఇవి రెండూ కాక గ్రంథాలయ వారోత్సవాల ఆరంభం కూడా. ఈ శుభ సందర్భంలో ఒక గొప్ప వ్యక్తిని గూర్చి పాఠకులకు చెపుదాం అనుకుంటున్నాను.
తెలుగు రాష్ట్రాలలో పెద్ద వ్యక్తిగత గృహ గ్రంథాలయాలు కలిగివున్న నార్ల వెంకటేశ్వరరావు, ఆరుద్ర, కొంగర జగ్గయ్య, ఎ.బి.కె. ప్రసాద్, పొత్తూరి వెంకటేశ్వర రావు, చలసాని, సి.వి.యన్. ధన్ తదితరుల్ని గూర్చి వినే ఉంటారు. వీరిలో నార్ల గ్రంథాలు అంబేడ్కర్ విశ్వవిద్యాలయానికి, ఆరుద్ర పుస్తకాలు సుందరయ్య విజ్ఞాన కేంద్రానికి, ఎ.బి.కె. పుస్తకాలు సి.ఆర్. ఫౌండేషన్‌కి ఇచ్చి వేయబడ్డాయి. 5 వేల నుంచి 25 వేల వరకు పుస్తకాలు గల హోం లైబ్రరీలు, అనేకమంది ప్రముఖ సాహితీవేత్తల దగ్గర, పాత్రకేయుల దగ్గరా, వామపక్ష రాజకీయ నాయకుల దగ్గరా ఉండటం కూడా గమనిస్తున్నాం.
కాని ఒక సాదాసీదా ప్రభుత్వోద్యోగి, ఇప్పటిలా జీతాలు లక్షల్లో లేని ఆ రోజుల్లో, ఆ తర్వాత వచ్చే పెన్షన్ తోనూ,లక్ష వరకు పుస్తకాలే గాక అనేక వేల జర్నల్స్, నాలుగు లక్షలకు పైగా పేపర్ కట్టింగ్స్ బైండింగ్‌లు, ఒకే పుస్తకానికి వచ్చిన వివిధ అనువాదాలు, ఒకే పుస్తకం వివిధ ప్రచురణలు కలిగి ఉండటం... ఇవన్నీ లారీల్లో వేసుకొని బదిలీ అయిన ప్రతి ఊరికీ తిరగటం – ఇవేవీ సాధారణ విషయాలు కావు. ఆ అసాధారణ వ్యక్తి లంకా సూర్యనారాయణ.
1936 ఆగస్ట్ 23న గుంటూరు జిల్లా గొట్టిపాడు గ్రామంలో పుట్టి, సెంట్రల్ ఎక్సయిజ్ శాఖలో పని చేసి,1992లో పదవీ విరమణ చేసిన ఈ పెద్దాయన మా గుంటూరులో దర్శనీయ స్థలం లేదనే లోటును తీరుస్తూ తన సమస్త పుస్తక సంపదను కంచి కోమకోటి పీఠం ఆధ్వర్యంలో గుంటూరులో వున్న వెంకటేశ్వరస్వామి దేవస్థానానికి (బృందావన్ గార్డెన్స్) ఇచ్చేశారు.వారు అన్నమయ్య గ్రంథాలయం పేరిట మూడు అంతస్తుల మేడలో బీరువాల్లో భద్రపరిచి ప్రజలకు అందుబాటులో ఉంచారు.
ఆనాటి నుంచి మా ఊరు వచ్చిన ప్రతి సాహితీవేత్తా, పుస్తక ప్రియుడూ అక్కడికి వెళ్లి ఆ పుస్తకాల్ని, లంకా గారిని చూసి ఆయన ఆతిథ్యాన్ని తీసుకోకుండా వెళ్ళరు. ఈ పుస్తక సంపద ఇచ్చిన సమాచారంతో 30 మంది డాక్టరేట్లు పొందారంటే అది చిన్న విషయం కాదు. ‘‘ఇదంతా ఆ పెద్దాయన బ్లడ్ అండ్ స్వెట్. ఇది ఫలిస్తుంది.’’ అని దీవించిన శ్రీరమణ మాటలు నిజమయ్యాయి.
యాదాద్రి భువనగిరి జిల్లా వెల్లంకి గ్రామంలో డా. కూరెళ్ల విఠలాచార్య; కర్ణాటకలోని మాండ్యలో తన సంపాదనలో 80శాతం డబ్బుని, తనకున్న ఒకే ఒక ఇంటిని అమ్మి, తన పదవీ విరమణ బెనిఫిట్స్‌ని కూడా వినియోగించి రెండు లక్షల పుస్తకాల్ని సేకరించి ఇంటిలోనే గ్రంథాలయం నడుపుతున్న అంకెగౌడ్‌ని; తన సమస్త సంపదని (10 మిలియన్ డాలర్లు) వెచ్చించి 4 లక్షల పుస్తకాలు, 3 లక్షల రాతప్రతులు సేకరించిన హస్టింగ్టన్ (కాలిఫోర్నియా) గురించి; తమిళనాట రోజా ముత్తయ్య; బెంగాల్‌లో అశుతోష్ ముఖర్జీల గురించి విన్నామేగాని అదే ఒరవడి కలిగిన లంకా సూర్యనారాయణను చూడటం,ఆయనతో సుదీర్ఘ పరిచయ భాగ్యం కలిగి ఉండటం జీవితంలో ఆనందదాయకమైన విషయం. 70–-80 దశకాల్లో నలభై సంవత్సరాల వయస్సులో నవోదయ పబ్లిషర్స్‌లో పుస్తకాలు వెదుక్కుంటూ కనిపించే ఈ మానవుడు ఎనభై ఎనిమిదేళ్ల వయస్సులో ఆదివారం ఫుట్‌పాత్‌లపై సెకండ్ హ్యాండ్ పుస్తకాల దగ్గర తచ్చాడుతూ కన్పిస్తుంటాడు.
లంకా సూర్యనారాయణ అపురూప సేకరణలో 500 భగవద్గీతలు,300 భాగవతాలు, 100 మహాభారతాలు,550 రామాయణాలు, ఐదువేల ఆత్మకథలు, రవీంద్రుని ‘గీతాంజలి’ కావ్యానికి ఆదిపూడి సోమనాధరావు తొలి తెలుగు అనువాదం నుంచి డా. భార్గవి ఇటీవలి అనువాదం దాకా మొత్తం 51 తెలుగు అనువాదాలు; 1600 శతకాలు; 700 నిఘంటువులు... ఇవి ఆయన సేకరణలో కొన్ని. కేవలం పది పైసలు ఇచ్చి ఒక మిఠాయి బండి వాడి దగ్గర మిల్టన్ పూర్తి రచనలు కొన్నారట. గుంటూరు విజయవాడలే కాదు; ఢిల్లీ, బొంబాయి లాంటి నగరాలు వెళ్లినప్పుడు కూడా ఫుట్‌పాత్‌లపై అపురూప గ్రంథాలు సేకరించారు.
ఈ గ్రంథాలయంలో పుస్తకాలు చూసి పక్కన పెడితే వరస క్రమం తప్పకుండా వారే సర్దుకుంటారు. కోరుకున్న వ్యక్తులకు కోరుకున్న పుస్తకాలు స్కాన్ చేసి, పెన్‌డ్రైవ్స్‌లో ఇస్తారు.అన్నమయ్య గ్రంథాలయం కేటలాగ్ వికీపీడియా పేజీలో దొరుకుతుంది. ఇంకా ఇతర ప్రాంతాల వారు 0863-–2246365 నంబర్‌లో సంప్రదిస్తే కేటలాగ్ సాఫ్ట్‌కాపీని ఈమెయిల్ ద్వారా కూడా అందుకోవచ్చు.అన్నట్లు ఈయన సేకరించిన పుస్తకాల్లో చదివి ఇస్తానని తర్వాత ఇవ్వకుండా ఉన్న పుస్తకం గాని, కొట్టేసిన పుస్తకం గాని ఒక్కటి కూడా లేదని ఆయన మిత్రులు చెబుతారు.అన్ని పుస్తకాల దొంతరల్లో మనకు కావాల్సిన పుస్తకం ఒక్క నిముషంలో తీసి ఇవ్వగలరు.
పుస్తకాలు ఎక్కువగా ఉండే వ్యక్తుల ఇళ్లల్లో పుస్తక పరిజ్ఞానం తక్కువగా ఉన్న ఆడవాళ్ల పోరు చాలామందికి అనుభవమై ఉంటుంది. లంకా గారి మర్యాదల్ని, ఆయన పుస్తకాల గుట్టల్ని, దానికోసం ఆయన పెట్టిన ఖర్చుని అర్ధ శతాబ్దానికి పైగా భరించిన వారి శ్రీమతి వరలక్ష్మి గారు, ఇంకా ఆయన చెప్పకుండానే ఆయన ఏమి చెబుతారో ఊహించి ప్రవర్తించే గ్రంథాలయ సంచాలకురాలు సుభాషిణి గారు దొరకటం లంకా సూర్యనారాయణ అదృష్టం.